నడకను మించిన వ్యాయామం లేదు ------------------------------------------- నాకు నడకంటే బహు ఇష్టం. చిన్నప్పటి నుంచీ బాగానే నడిచేవాడిని. కానీ ఇప్పుడీ అరవై ఆరో ఏట మొండిగా నడుస్తున్నాను. ఎడమ మోకాలు నొప్పి మొదలై ఎక్కవ దూరం నడవటం తగ్గింది. అప్పటికీ నొప్పిని దిగమింగుతూనే నడుస్తుంటాను. రోజూ సాయంత్రాలు ఓ గంటైనా నడవటం అలవాటు చేసుకున్నాను. హైదరాబాద్ రోడ్లలో మొట్టమొదటిసారి ఎక్కువ దూరం నడిచింది ప్రముఖ రచయిత తిరుమల రామచంద్రగారివల్లే. తిరుమల అనే ఇంటి పేరు స్ఫురణకు రావడంతోనే పిట్టల్లే బక్క పల్చగా కనిపించే ఆయన రూపం కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లో ఇప్పుడున్న అరవిందో స్కూల్ కి దగ్గర్లో తెలుగు భాషా సమితి కార్యాలయం ఉండేది. ఇప్పుడది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి సంబంధించిన కార్యాలయముందనుకుంటాను. తెలుగు భాషా సమితి కార్యాలయమైతే లేదు. నేను హైదరాబాదుకి వచ్చిన కొత్తలో అంటే 1982 ప్రాంతంలో ఈ తెలుగు భాషా సమితి కార్యాలయంలో ఆదివారాలు తప్పనిసరిగా తెలుగు గోష్ఠి సభ్యులు సమావేశమయ్యేవారు. చీమకుర్తి శేషగిరిరావుగారు, బొమ్మకంటి శ్రీనివాసా చార్యులు, యార్లగడ్డ ఆంజనేయులుగారు, తదితర ప్రముఖ రచయితలు ఈ సమావేశాల్లో పాల్గొనే వారు. వీటికి నేనూ మా మావగారైన జీ. కృష్ణ (పాత్రికేయులు) గారితో పాటు వెళ్తుండే వాడిని. పదబంధాలపైన, భాష గురించీ, సాహిత్యం గురించి చర్చలు జరిగేవి. అలా ఓ ఆదివారం నాడు తిరుమల రామచంద్రగారుకూడా తెలుగు గోష్ఠికి వచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత తిరుమల రామచంద్రగారితో మాట్లాడాను. అప్పట్లో నేను ఉద్యోగ వేటలో ఉన్నాను. ఇదే విషయం చెప్పగానే అయితే తాను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డు మొదట్లో ఉన్న ఈ తెలుగు భాషా సమితి బిల్డింగ్ నుంచి రాజ్ భవన్ రోడ్డు పరిసర ప్రాంతంలో ఎక్కడో ఉండే ఓ వార పత్రిక కార్యాలయం వరకూ తిరుమల రామచంద్రగారు నడిపించే తీసుకుపోయారు. దారిపొడవునా ఎన్నివిషయాలు చెప్పుకుంటూ వచ్చారో చెప్పలేను. అది వేసవి కాలంపైగా. మధ్య మధ్యలో ఎక్కడో చోట రోడ్డు పక్కన కాస్సేపు ఆగడం, మళ్ళీ ముందుకు నడవడం ఇలా ఆ వారపత్రిక ( మయూరి లేదా పల్లకి వారపత్రికో గుర్తుకు రావడం లేదు) ఆఫీసుకి నడిపించుకు తీసుకువెళ్ళిన తిరుమల.రామచంద్రగారు అక్కడి సంపాకుడికి నన్ను పరిచయం చేశారు. ఉద్యోగం ఇవ్వమన్నారు. కానీ నేనే అక్కడ చేరలేదు. కానీ అంతదూరం నడచిన నడకైతే ఇప్పటికీ జ్ఞాపకమే. అలాగే కృష్ణగారితోనూ అనేక చోట్లకు నడిచి వెళ్ళిన సందర్భాలున్నాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమకాలంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా అందనప్పుడు బంజారా హిల్స్ లో కేర్ హాస్పిటల్ పక్కనున్న సాక్షి ఆఫీసు (ఇక్కడ ఓ అయిదేళ్ళు పని చేశాను) నుంచి రాంనగర్ గుండు దగ్గరున్న మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసేవాడిని. అలాగే ఉదయం పూటా ఇంతదూరమూ నడిచే వెళ్ళేవాడిని. కనుక నాకు నడక బాగానే అలవాటు. అయితే ఈ అలవాటు మా నాన్నగారి నుంచే వచ్చిందనుకోనా? అయ్యుండొచ్చు. 1950 ల్లో కృష్ణగారు నెంబర్ ఏడు తంబుచెట్టి వీధీలో ఉండే ఆంధ్రపత్రిక ఆఫీసులో పని చేస్తుండేవారు. ఇక్కడే భారతి సాహిత్య మాసపత్రిక కూడా ఉండేది. ఆంధ్రపత్రిలో ఓ రెండేళ్ళపాటు ఆదివారం సంచికకు మా నాన్నగారి గ్రంథ సమీక్లలు రాసారు. అలాగే "భారతి"కి సాహితీ వ్యాసాలు రాసేవారు. తన రచనలు ఇవ్వడం కోసం నాన్నగారు ఆంధ్రపత్రిక కార్యాలయానికి వెళ్ళేవారు. అయితే తిరుగుప్రయాణంలో ఆంధ్రపత్రిక కార్యాలయం నుంచి కృష్ణగారూ మా నాన్నగారు టీ నగర్లో ఉండే ఇంటికి నడుచుకుంటూ వచ్చేసేవారట. ఈ బహుదూర నడకయానంలో ఇద్దరూ సాహిత్యాంశాలు మాట్లాడుకుంటూ వచ్చేసేవారట. ఈ విషయం కృష్ణగారు నాకు సమయమొచ్చినప్పుడు చెప్పేవారు. అంటే ఈ నడక అనేది మా రక్తంలోనే ఉందన్న మాట. అలాగే తిరువణ్ణామలైలో చలంగారింట ఉన్నప్పుడు గిరిప్రదక్షిణ‌ంంతా నడకే. చలంగారింటి ఎదురుగా ఉన్న కొండనైతే ఎంత అవలీలగా ఎన్ని సార్లు ఎక్కానో చెప్పలేను.ఇలా బహుదూరమనుకోకుండా నడిచిన నా కాళ్ళు ఈ మధ్య ఎక్కువ దూరం నడవలేకపోవడం విచారకరమే....!?! - యామిజాల జగదీశ్


కామెంట్‌లు