చీర కట్టుకు ఫిదా అయిపోయా!--ప రికిణీ ఓణీలో కనిపించే అమ్మాయిలంటే ఎంతిష్టమో అంతకు రెట్టింపిష్టం చీరకట్టులో ముస్తాబైన మగువను చూడాలంటే. చీర మాట స్ఫురణకు వచ్చినప్పుడల్లా ఎప్పుడో ఎక్కడో నేను రాసుకున్న కవితొకటి గుర్తుకొస్తోంటుంది.... "నువ్వు చీరలో వస్తుంటే దారిపొడవునా నిన్ను చూసిన వారందరూ శిలలై నిల్చుండిపోయారు! చీరను కట్టుకున్న సంతోషం నీ ముఖంలో చూసాను! నిన్ను కట్టుకున్న సంతోషం చీరంతటా చూసాను! ఇంకా ఎందరి హృదయాలను లేలేత దూదిపిందలల్లే మార్చబోతున్నావో కదూ నీ చీరకట్టులోని అందమైన నవ్వుతో!! చాలమ్మాయి, చాలిక, ఇక లేదు నా దగ్గర కోల్పోయేందుకు మరొక హృదయం....!! నీ చూపులు చీరందంతో పోటీ పడి జరిపే నాటకానికి కిందా మీదా అయిపోయేది నా హృదయమేగా!! అర క్షణంలో పడిపోతాను చీరకట్టులో నిన్ను చూసినప్పుడల్లా!! ఎందుకిలా అనుకుంటున్నానో తెలుసా నీకు నన్ను నేను మరచి...? నేను నాదేనని అనుకున్న మనసుని నీ చీరకట్టుతో నీ వెంటే తీసుకుపోతున్నావు అప్రమేయంగా!! అంతెందుకు ఓమారడిగావు గుర్తుందా "ఈ చీర నాకు బాగుందాని?" అప్పుడు నేనిలా అన్నాను... "బాగుండటమేంటీ, చీర కట్టులో మాత్రమే నీ అందమంతా అందిస్తున్నావు నాకు" అని! అవును, చీరకున్న శక్తి,.ఆకర్షణ అలాంటిది! శ్రీమతి జ్యోతి వలబోజు గారి ప్రేరణతో "సరదా శతకం"గా బ్నింగారు పాఠక లోకానికి అందించిన "చీర పజ్యాలు" మళ్ళీ చదివానిప్పుడు. పరికిణీ మీద కవితలు రాసిన "పరికిణీ వాలా" తణికెళ్ళ భరణిగారు "చీరని ఉతికి ఆరేయకుండా, చీరని చిరాకు పడే వాళ్ళని ఉతికి, చీరకి కుచ్చిల్లు పెట్టిన బ్నింగారికి "త్రీ ఛీర్స్" అనడం పట్టుచీరకున్నంత అందంగా ఉంది.బ్నింగారు మాటలతో మురిపిస్తారు. మరిపిస్తారు. ఓసారి ఆయనతో పరిచయమైతే మళ్ళీ మళ్ళీ ఆయన మాటలు వినడానికి మనసు ఉవ్విళ్ళూరుతుంంటుందనడం అతిశయోక్తి కాదు. తల్లావజ్ఝల లలితాప్రసాద్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్న మరుక్షణమే బ్నింగారికి ఫోన్ చేసి అడ్రస్ అడిగి వారింటికి కలియడంతో మా మధ్య పరిచయం శ్రీకారం చుట్టుకుంది. అదిప్పటికీ హాయిగా ఆనందంగా కొనసాగుతోంది."చీరపజ్యాల" రచనా శతకానికి శతక లక్షణమైన "మకుటం" లేనందువల్ల దీనిని శతకమనలేమని, కనుకే "సరదా శతకం"గా బ్నింగారు పద్యాల నడకను చదివి తరించవచ్చన్న డా. అక్కిరాజు సుందర రామకృష్ణగారి మాట అక్షరసత్యం."ఫెమినిస్టుని కాదుగానీ ఫెమిన్ ఇష్టున్ని అని చెప్పుకున్న బ్నింగారికి స్త్రీత్వం మీద విపరీతమైన ఇష్టమూ! గౌరవమూ!! చీరలంటే ఇష్టమున్న బ్నింగారు తమ ముందుకు అమ్మాయిలు మోడ్రన్ డ్రస్సులు వేసుకుని రావడానికి భయపడేలా మాత్రం నిక్కచ్చిగా చెప్పేస్తారు. తన సరదా శతకంలో కొన్ని పద్యాలు పేలాయని, కొన్ని పెట్రేగాయని చెప్పినప్పటికీ చీరందంలోని సొగసుని చాటి చెప్పడానికి బ్నింగారి శైలితో, భావంతో ఏకీభవించని వారుండరు. "బాపూ రమణల సినిమాల్ చూపెట్టును తెలుగుతనము జూమ్ షాట్లలోఆ పిక్చర్లో తరచుగ ఓ పాటనొ సీనులోనొ ఒదుగున్ చీరే!" అంటూ మొదలుపెట్టిన చీరపజ్యాల శతకాన్ని "చీరలపై శతకాన్ని వెరెవ్వరు రాయలేదు వింతే కాదా వారెవ్వా! నా బ్రైన్ లో ఊరించే చీర మడతలున్నా యింకాన్" తో ముగించారు.. ఇందులోని ప్రతి పద్యమూ చదివి ఆర్థం చేసుకోవడానికి శబ్దరత్నాకరమో శబ్దార్ద చంద్రికో లేక మరే నిఘంటువో అవసరం లేదు. అన్ని మాటలూ మన చుట్టూ మనతో మనలో ఉన్నవే. కనుక వాటిని చదువుతున్న కొద్దీ చీరకట్టుకున్న ప్రాధాన్యం విదితమవుతుంది. వారంరోజుల్లో ఈ చీర శతకాన్ని బ్నింగారు నేసిన సమయంలో రెండు సార్లు బ్నింగారిని కలిశాను. ఈ పుస్తకం ఇన్ సైడ్ కవర్లలో ఆయన వేసిన రెండు కార్టూన్లను వేస్తున్నప్పుడు ఎదుటే ఉన్నాను.వాటిలో ఒకటి - "అరుస్తారెందుకు? నా కన్నా చీరలే మీకిష్టం కదా....కులకండి! అంటూ చీరల ట్రంకుపెట్టెలో ఉన్న భర్తతో భార్య చెప్తున్నటువంటి ఈ మాటలు బలే పేలాయి. ఇక రెండో కార్టూనుకి "చీరలు కొనమని భార్యలు / ఊరకనే కోరబోరు - ఉందురు ఓర్పున్ / వారల అవసర మెరిగియు / మీరే తెచ్చివ్వ వలయు మేలగు నేస్తం" అంటూ అందించిన పద్యం మజాగా ఉంది.ప్రతి పద్యంలోనూ బ్నింగారు పలికించిన భావం "చీరకట్టులో ముచ్చటగా, ముద్దుగా కనిపించే సొగసైన కన్యలా" ఉంది.చీరలపై పుట్టిన సాహిత్యంలో, ముఖ్యంగా జానపద సాహిత్యంలో చీరందాలను ఎంతలా అభివర్ణించారో అందరికీ విదితమే."చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా" అని ఒకరంటే "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి...." అని మరొక కవి మాట. అయితే ఇంకొక కవి "జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గొచ్చింది...." అనడం ఎంత బాగుందో కదండీ. చీరంటే మాటలా! కనుక చీర పజ్యాలనొక్కసారైనా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా స్త్రీలు చదివితే బాగుంటుందని నా మాట.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు