"ఏవోయ్ !పేపరొచ్చిందా?"కాఫీకప్పు చేతిలో పెట్టిన భార్యను ప్రశ్నించాడు రామరావు.
"ఇంతవానలో పేపరెలా వస్తుదండీ! ఏళ్ళూ ఊళ్ళూ ఏకమైపోతుటేను" అని సమాధానం చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది అతడిభార్య.
రమారావుకి ఉదయం లేవగానే ,కమ్మగా వేడివేడి కఫీతాగుతూ పేపరుచదవడం ఆలవాటు.ఈ రెంటిలో ఏది ఆలస్యమైనా గంగవెర్రిలెత్తిపోతాడతడు.
ఇంతలో "పేపర్" అన్న అరుపుతో పాటు రివ్వన పేపరు వచ్చి కాళ్ళదగ్గర పడింది. రమారావు పేపరు తీసిచూస్తే దాని చివర్లు కొంచం తడిసి వున్నాయి.
వెంటనే రమారావు కొంపమునిగినట్టు ఓ పెను కేకపెట్టి"ఒరేయ్ కుర్రాడా ఇలారా! "అనిఅరిచాడు.
ఆ పేపరుకుర్రాడికి ఎనిమిదీ ,పదేళ్ళ మధ్యవయసుంటుంది. నల్లగా బక్కగా వున్నాడు.డొక్కులా వున్న మొఖంలో కళ్ళూ పళ్ళూమాత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి.
రమారావరచిన అరుపుకు సీటుకూడా అందని డొక్కుసైకిలు ఫెడలు పై కాలేయబోతున్న ఆ పేపరబ్బాయి, హడలిపోతూ వచ్చి రామరావు ముందర నిలబడ్డాడు.తలనుండి నీళ్ళుకారిపోతున్నాయి.పూర్తిగాతడసిపోయి, చలికి వణుకుతున్నాడో , రామారావు అరిచిన అరుపు వణుకుతున్నాడో తెలియదు గాని గజగజ వణుకుతూ వచ్చి నిలబడ్డాడు.
"ఏరా తడిసి పోయిన పేపర్ ఇచ్చావు. ఎలా చదవమని?ఏం ఉత్తినే ఇస్తున్నారా బిళ్ళకుడముల్లా ఎనిమిది రూపాయలు తీసుకొంటున్నారు.వర్షంలో పేపరు తడిపి పడెయ్యడమేమిటో మీ ఏజంటుకు ఫోన్చేసిచెప్పి నీతోలు తీయిస్తా జగ్రత్త. రేపటినుండీ పేపరు చేతికిచ్చేలావుంటే యియ్యి ,లేకపోతే మానెయ్యి .ఫో ఫో ఇక" గర్జించినట్లు ఆరిచాడు రామారావు.
"అలాగేనయ్యా" అంటూ బిక్కమొఖంతో అక్కడనుండి కళ్ళువత్తుకొంటూ బయటపడి,డొక్కుసైకిలుకి ఫెడలేసుకొంటూ ఆ జోరువానలో బయలుదేరాడు ఆ బక్కప్రాణి.
రామరావు రెండవసారి కాఫీ కోసం భార్యని పిలిచి, హాయిగా వేడిగా వున్న కాఫీని వూదుకొంటూ తాగుతూ,
"ఇంతవానలో ఈరోజు పిల్లలు స్కూలుకి రారని స్కూలువాళ్ళకు ఫోన్చేసి చెప్పేయ్. వాళ్ళు దుప్పట్లు సరిగా కప్పుకొన్నారోలేదో,సరిగా కప్పి ,ఆగది తలుపులు జారేసివెళ్ళు.వాళ్ళు లేచేవరకూ లేపకు. పాపం రోజూ స్కూలుంటే ఎలాగా
పెందరాళే లేవక తప్పదు."
అంటూ తన పిల్లల పైన బోల్డు జాలి కురిపిస్తూ పేపరు మడతలు విప్పాడు రామారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి