చెట్టు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నిబిడాంధకార
మృత్తికా కుహరాన్ని చీల్చుకుని 
ఆశల రెక్కలు తొడుక్కుని 
రెండాకులతోనైనా 
నా తలను సగర్వంగా పైకెత్తుతాను 
ఆకుల ఈకలు ఒళ్ళంతా కప్పుకుని
పచ్చని నెమలిలా నా పురి విప్పుతాను.
ఆకులై, శాఖలై, కొమ్మలై, రెమ్మలై,
పూవులై, కాయలై
సంబరంగా నిలబడుతాను
జనాలకు వనాల నజరానాలనిస్తాను
నన్ను గాయపరిచిన ప్రతిసారీ
పరిమళాల గేయాలు 
పల్లవిస్తూనే ఉంటాను
నాతల తెగ్గోసిన ప్రతిసారీ
కసితో మరిన్ని తలలు పైకెత్తుతాను
ఎడారుల్లో ఒంటరినైనా
జనాల్లోని తుంటరి చేతుల్లోనైనా
నాలోకి నేను ముడుచుకుపోను
గ్రీష్మ హేమంత శిశిర కష్టాల కడలిలోనైనా
నిట్టనిలువుగా నిలిచే వుంటాను
ఆశావాదిలా వసంతాగమనం కోసం
నిరంతరం నిరీక్షిస్తూనే ఉంటాను!!
******************************

కామెంట్‌లు