ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
"వైడ్ యాంగిల్" రవిశంకరన్---మద్రాసు నుంచి ఓ అయిదేళ్ళపాటు నడిచిన ఓ మాస పత్రిక పేరు "శుభమంగళ". శ్రీరాం చిట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇది నడిచింది. ప్రముఖ నాటక రచయిత కోమల్ స్వామినాథన్ ఈ మాసపత్రికకు సంపాదకులు. అయితే ఇళయభారతి అనే అతనే సంచిక మొత్తం తయారుచేసేవారు. 1991 నుంచి అయిదేళ్ళ పాటు నడిచిన ఈ పత్రిక ప్రత్యేకత ఏమిటంటే ప్రతీ నెల ఓ ప్రముఖుడిని ఇంటర్వ్యూ చేసి కనీసం పది ఫోటోలతో ప్రచురించేది. అదీనూ రకరకాల ఫోటోలు ప్రచురించఘదీ పత్రిక. ఆ ఫోటోల కోసమే కొందరు ఈ పత్రికను కొనేవారు. ఈ పత్రికకు ఆనంద్, రవిశంకరన్ అనే ఇద్దరు ఫోటోగ్రాఫర్దుండేవారు. రవిశంకరన్ ని " వైడ్ యాంగిల్ " రవిశంకరన్ అని పిలిచే వారు. ఓమారు కరుణానిధి ఫోటోలతో ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రచురించింది. ఫోటోలకోసం కరుణానిధి ఇంటికి రవిశంకరన్ వెళ్ళారు. కరుణానిధి అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి. రవిశంకరన్ వచ్చాడన్న తర్వాత కరుణానిధి తయారై తన ఆఫీసు గదిలోకొచ్చి కూర్చున్నారు. రవిశంకరన్ ని ఫోటోలు తీసుకోమన్నారు. కానీ రవిశంకరన్ ఫోటో తీయలేదు. రెండోసారి కరుణానిధి ఫోటో తీసుకోవయ్యా అన్నారు. అప్పటికీ రవిశంకరన్ ఫోటో తీయలేదు. ఫోటోలు తీయవేమిటీ అని కరుణానిధి మళ్ళీ అడిగేసరికి రవిశంకరన్ "సార్! రొటీన్ గా ఉండే ఈ పోజులో ఫోటోలు మాకు అక్కర్దేదండి. కాస్త భిన్నమైన ఫోటోలు కావాలండి. మీరు ఇంట్లో ఎంత సహజంగా ఉంటారో అలా ఉంటే నేను ఫోటోలు తీస్తానండి" అని చెప్పగా కరుణానిధి లోపలికెళ్ళి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలాగే ఓ లుంగీ చుట్టుకుని ఓ బనియన్ వేసుకుని వచ్చారు. ఆ తర్వాతే రవిశంకరన్ లెక్కపెట్టలేనన్ని ఫోటోలు తీశారు. వాటిలో ఒకటి కరుణానిధిని నేలమీద కూర్చోమని చెప్పి ఫోటో తీయడం మరచిపోలేనని రవిశంకరన్ అన్నారు. ఫోటోల సెషన్ అయిన తర్వాత తను చూసి "ఓకే" చేసిన ఫోటోలు ముద్రించాలని చెప్పారు కరుణానిధి. రవిశంకరన్ అలాగే అని తాను తీసిన ఫోటోలను డెవలప్ చేసి కరుణానిధికి చూపించగా అన్నీ బాగున్నాయని కొనియాడారు. వాటిలో తనకు నచ్చినవేవో కరుణానిధి చెప్పగా ఆ ఫోటోలను శుభమంగళ మ్యాగజైన్ ప్రచురించింది. ఈ మ్యాగజైన్ ని నడిపిన శ్రీరాం చిట్ ఫండ్స్ తర్వాతి కాలంలో తెలుగులో ఆంధ్రదర్శిని.కామ్ అనే వెబ్ మ్యాగజైన్ ని నడిపింది. ఈ పత్రకకు మద్రాసులోని ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిచ్చాను. నాకు ఆ అవకాశం కల్పించింది శివప్రసాద్ అనే పాత్రికేయుడు. ఇదికూడా కొన్నేళ్ళు నడిచి ఆగిపోయింది.- యామిజాల జగదీశ్
June 26, 2020 • T. VEDANTA SURY • Memories