ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
"సామాన్యంతో అసామాన్యం"--ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించిఓ లైబ్రరీ తెరవాలి అందులో మీ పరిచయ వ్యాసం తప్పక ఉండాలి- ఇదీ సామాన్యశాస్త్రం ఆదర్శం. ఈ ఆదర్శంతోనే కొంతమంది మిత్రులు కలిసి పేరు లేని పెద్ద మనుషుల గురించి వ్యాసాలు రాయాలని, పుస్తకాలు ప్రచురించాలని, సభలూ సమావేశాలూ నిర్వహించాలనీ అనుకున్నారు. తలో వంద రూపాయలు విరాళం స్వీకరించి కేవలం పది రూపాయలకే పుస్తకాలు అందిస్తూ వచ్చారు. సామాన్యుల సారస్వతం జనసామాన్యానికి చేరువ కావాలన్న ఉద్దేశంతో ఏకమైన సామాన్యశాస్త్ర మిత్రబృందం అనుకున్నట్లుగానే విజయవంతమైంది.పేరు ప్రఖ్యాతి, కీర్తి, డబ్బు, ప్రతిష్టలతో నిమిత్తం లేకుండా సామాన్యుల జీవితాలను అక్షరబద్దం చేయడంలో భాగంగా పుస్తకాలు ప్రచురిస్తోంది. సామాన్యశాస్త్రం, గణితం అతడి వేళ్ళ మీది సంగీతం (ఇది తమ గురువుగారైన వెంకటయ్యపై రాసిన నివాళి), బాలుడి శిల్పం, యాన్ ఎక్స్ పీరియన్స్ – 6 డిసెంబర్ 1992, గడ్డిపరకలు, బతికిన కోడి, కల్లే పాటలో, జూన్ 2017 – ఓ మళయాల దర్శకుడి పరిచయ కథనం, లెపెస్క్యూర్, డోంట్ ఫీల్, తొమ్మండగురు, నామవాచకం వంటి పుస్తకాలను ప్రచురించింది. తనేసే ప్రతి అడుగులోనూ సామాన్యులను గుర్తించి సమాజానికి ఓ అసామాన్యుడు అని పరిచయం చేస్తున్న కందుకూరి రమేష్ బాబుగారు తిరునగరి వేదాంతసూరిగారివల్లే పరిచయమయ్యారు నాకు. రమేష్ బాబు పాత్రికేయుడు. రచయిత. ఫోటోగ్రాఫర్. సమాజంలో సామాన్యుడి కృషిని అప్పటివరకూ ఎవరూ గుర్తించని వారి గురించి తెలుసుకుని వెలుగులోకి తీసుకురావడానికి రమేష్ బాబు చేస్తున్న మహత్తర కార్యక్రమం ప్రశంసార్హం. సామాన్యులు అసామాన్యులే అంటూ లెక్కలేనన్ని వ్యాసాలు రాసిన రమేష్ బాబు కొన్ని టీవీ ప్రేక్షకులకూ వారిని పరిచయం చేశారు.ఇప్పటికే పన్నెండు ఫోటోగ్రఫీ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న రమేష్ బాబు ముంబైలోని జెహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో "సెలబ్రేటింగ్ ది ఆర్డినరీ" అనే శీర్షికన నిర్వహిచిన ఫోటోగ్రఫీ ప్రదర్శనకు విశేష స్పందన లభించింది.మీరు సామాన్యులు కావడం ఎలా అనే భిన్నమైన శీర్షికతో ఆయన ఓ పుస్తకం రాశారు.2016లో రమేష్ బాబు సామాన్యశాస్త్రం అనే పేరిట మణికొండలో ఓ ఫోటోగ్రఫీ గ్యాలరీ స్థాపించారు. ఆయన తీసిన వేల పోటోలను ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రాంగణంలో ఇప్పటికే ఎనిమిది ప్రదర్శనలు నిర్వహించిన ఆయన 2011 నుంచి 2016 వరకూ నమస్తే తెలంగాణా దినపత్రికలో ఆదివారం అనుబంధానికి సంపాదకులుగా వ్యవహరించారు. అలాగే కొన్ని నెలలు ప్రత్యేక ప్రతినిధిగా కూడా అమూల్యమైన వ్యాసాలు రాశారు.ఇలా ఉండగా, అయన "గడ్డిపరకలు" రచన గురించి కీ.శే. అబ్బూరి ఛాయాదేవిగారు ఓ ఉత్తరం రాస్తూ,"మీ ‘గడ్డిపరకలు’ అద్భుతంగా ఉంది. ఒక వ్యక్తి, ముఖ్యంగా వృద్ధిలోకి రావాల్సిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నా డంటే, అందుకు ఎన్ని రకాల కారణాలుంటాయో, సమాజంలో ఎంతమంది దోహదం చేసి ఉంటారో, ఎన్ని సంఘటనలు ప్రోద్బలం చేసి ఉంటాయో నిశితంగానూ విస్తృతంగానూ విశ్లేషించి రాయడం చైతన్యదాయకంగా ఉంది. ఈ విధమైన రచన ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికీ, అన్ని మతాలు, అన్ని కులాల వారికీ, అన్ని స్థాయిల వారికీ కనువిప్పు కలిగించాలనీ, తద్వారా సమాజాన్ని మెరుగు పరచాలనీ మీరు కాంక్షించడం ప్రశంసనీయంగా ఉంది.అయితే, సమాజాన్ని అంతటినీ మార్చగలిగేందుకు ముందు, సమాజంలో భాగమైన ప్రతి వ్యక్తి మనసులోనూ మార్పు రావాలి. మనలో ప్రతి ఒక్కరి మనసులోనూ మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే, మన చుట్టూ ఉన్న సమాజంలో మార్పు వస్తుంది. ప్రతి మనిషీ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోగలిగేలా మన పెంపకం, విద్యా విధానం మారాలి. ఆదర్శాలకు, వాస్తవాలకీ మధ్య అంతరం పెరుగుతుండటం వల్లనే నిరాశా నిస్పృహలు కూడా పెరుగుతున్నాయి. ఈనాటి ధన సంస్కృతిలో ఆకాంక్షలు పెరిగిపోతూ, వాటిని తీర్చుకోలేని అశక్తత నిస్పృహకీ ఆత్మహత్యలకీ దారి తీస్తోంది. మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఆలోచనాత్మకమైన, ప్రయోజనాత్మకమైన మరిన్ని ప్రచురణలు మీరు అందించాలని కోరుకుంటున్నాను. మీ పుస్తకాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు...." అని కాంక్షించారు.సామాన్యశాస్త్రం ప్రచురణల కింద విడుదల చసిన ‘గడ్డిపరకలు’ పుస్తకం ముఖ్యంగా మూడు పాత్రలతో నడుస్తుంది. ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిన ప్రసిద్ద రచయిత సిడ్ని షెల్డన్ ఈ నిజ నవలలో ఉంటారు. అత్మహత్య చేసుకున్న మన రాష్ట్రానికి చెందిన గిరిజన యువకుడు శ్రవణ్ ప్రధానంగా కథనం సాగుతుంది. ప్రకృతికి దూరం జరిగి, ఆత్మహత్య దుస్థితిలో ఉన్న సమస్త ఆధునిక మానవాళికి ఏమీ చేయనవసరం లేని వ్యవసాయ విధానం ఒక ప్రతీకగా చెప్ప చూసిన జపనీస్ వ్యవసాయ వేత్త మసనోబు ఫుకుఓకా ఒక పరిష్కారంగా ప్రతి పుటలో మన ఇంగితాన్ని మేల్కొలుపుతారు.ఈ పుస్తకం ఇప్పటికే రెండు సార్లు పునర్ముద్రణ పొందింంది. ఇది 90 పేజీల చిన్ని పుస్తకమే అయినా అందరూ చదవాల్సిన గొప్ప పుస్తకం.అలాగే తమ గురువుగారైన ఎల్. వెంకటయ్యకు నివాళులర్పిస్తూ గణితం అతడి వేళ్ళ మీది సంగీతం పుస్తకం నన్ను కట్టిపడేసింది. అందుకే రమేష్ బాబుగారికి ఫోన్ చేసి కొనియాడాను. త్వరలో నిర్వహించబోయే ఫోటో ప్రదర్శన ఏర్పాట్లలో బిజీగా ఉన్న రమేష్ బాబు తీసిన ఫోటోలలోనూ సామాన్యులెందరో అసామాన్యులుగా కనిపిస్తారు. ఆయన ఆశయం నిరంతరాయం సజావుగా సాఫీగా సాగిపోవాలని కాంక్షిస్తున్నాను.- యామిజాల జగదీశ్
June 23, 2020 • T. VEDANTA SURY • Book Review