ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
*భాస్కర శతకము* - పద్యం (౦-04)
September 8, 2020 • T. VEDANTA SURY • Poem

చంపకమాల :
*అడిగినయట్టి యాచకుల | యాశ లెరుంగక లోభవర్తియై*
*కడపిన ధర్మదేవత యొ | కానొక యప్పుడు నీదు వాని కె*
*య్యెడల నదెట్లు పాలు తమి | కిచ్చున యెచ్చటనైన లేగలన్*
*గుడువఁగనీనిచోఁ గెరలి | గోవులు తన్నును గాక భాస్కరా !*
*కడపిన = పంపివేసిన; కెరలి = కోపించి*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురు మూర్తివైన ,భాస్కరా ...
లేగ దూడలను పాలు తాగనీయకుండ ఆవు దగ్గర మొత్తం పాలు తానే తీసుకుని వ్యాపారం చేసుకోవాలి అనుకునే మనిషికి ఆ ఆవు పాలు ఈయదు, పైగా తన బిడ్డను పాలు తాగనీయలేదని తన్నుతుంది కూడా.  అలాగే, మన దగ్గరకు ఎవరైనా అవసరార్ధం యాచనకు వస్తే వారి అవసరం తెలుసుకోకుండా, లోభి లాగా స్వార్ధం తో ఆలోచించి, వారిని పంపించి వేస్తే,  మనకు అవసరం కలిగి నప్పుడు ధర్మదేవత సహాయ పడదు..... అని భాస్కర శతకకారుని వాక్కు.
*మన చుట్టూ వున్న సమాజంలో సహాయం అవసరమై ఎదురు చూచేవారు చాలా మంది వుంటారు/వున్నారు.  వారందరికీ సహాయం చేయడం ఏఒక్కరి వల్ల కాదు. అందుకని, మనదైన పద్ధతిలో, వీలున్నంత వరకు తోటి వారికి సహాయ పడే లక్షణం మనం అలవాటు చేసుకోవాలి. మన తరువాతి వారికి ఆ అలవాటు నేర్పాలి. అప్పడే, "అందరూ బావుండాలి. ఆ అందరిలో మనం వుండాలి" అనే భావానికి సార్ధకత చేకూరుతుంది*
 అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss