ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అంతమాత్రాన ....- యామిజాల జగదీశ్
October 15, 2020 • T. VEDANTA SURY • Memories

ఏ మనిషినీ నూటికి నూరు శాతం కచ్చితమైన వ్యక్తిగా చెప్పలేం. ప్రతి ఒక్కరూద్వంద్వమే....మంచీ చెడూ ఉండే అనేవి తీరుతాయి. మంచో చెడో ఏదైనా కావచ్చు, కేవలం ఏదో ఒక్క విషయాన్ని పట్టుకుని అతను మంచివాడనో చెడ్డవాడనో ఓ నిర్ణయానికి రావడం సబబుకాదు. కాలేజీలో నాకో మిత్రుడు ఉండేవాడు. అతని పేరు ఎస్. శివం. ఆయన నాలుగు దశాబ్దాలుగా వక్తగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అతను చెప్పిన విషయం ఇది....

ఓమారు ఓ తండ్రీ కొడుకులు రైల్లో ప్రయాణిస్తున్నారు. కొడుక్కి పదిహేనేళ్ళు ఉంటాయి. ఆ కుర్రాడికి కనిపించిన ప్రతిదీ విచిత్రంగా అనిపించేది. చూసిన వాటినల్లా తన తండ్రితో చెప్పి ఆశ్చర్యంగా చూసేవాడు. అతని మాటలేవీ పదిహేనేళ్ళ కుర్రాడు చెప్పే మాటలుగా ఉండేవి కావు. ఓ చిన్న పిల్లాడి మాటల్లా ఉండటంతో తోటి ప్రయాణికులలో ఒకరిద్దరిలో అసహనం పెరిగిపోయింది. ఆ కుర్రాడి తండ్రితో "ఏంటండీ వాడల్లా మాట్లాడుతుంటే మీరూ నవ్వుతారేంటండీ...వాడిని ఓ మంచి డాక్టర్ కి చూపించండి...." అని సలహా ఇచ్చారు.

అప్పుడా కుర్రాడి తండ్రీ "అవునండీ...ఇప్పుడూ డాక్టర్ దగ్గర్నుంచే వస్తున్నామండి....వాడికి పుట్టినప్పటినుంచి కంటి చూపు లేదండి. ఓ వైద్యుడు వాడికి చికిత్స చేయగా కంటి చూపొచ్చిందండి. వాడిప్పుడే మొదటిసారిగా ఈ లోకాన్ని చూస్తున్నాడండి. కనుక వాడికన్నీ విచిత్రమూ. ఆశ్చర్యమూ. వాడికి కంటిచూపు రావడం మాకు ఆనందంగా ఉందండి" అన్నాడు. 

ఆయన మాటలతో తోటిప్రయాణికులు మొహం ఎక్కడపెట్టాలో తెలీక తలదించారు.

అందుకే ఎవరినీ ఏదో ఒకటి రెండు విషయాలతో ఓ నిర్ణయానికొచ్చేసి చిత్తమొచ్చినట్లు మాటలు వాడకూడదు. అలా వాడితే ఇలా చిన్నబోవాల్సి ఉంటుంది.