ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అంతర్నేత్రానికి పద్మశ్రీ --యామిజాల జగదీశ్ రచన--నా ఈ రచనకు కారణం ఓలేటి వేంకట సుబ్బారావుగారే. "శాంథోం" గురించి నేను రాసినది చదివిన సుబ్బారావుగారు ఫోన్ చేసి శాంథోంలో ఉన్న ప్రముఖ చిత్రకారుడు మనోహర్ దేవదాస్ గారు గుర్తుకొచ్చారంటూ ఆయన గురించి కొన్ని అరుదైన విషయాలు చెప్తుంటే ఓ రసవత్తరమైన కథ చదువుతున్నట్లు ఓ గొప్ప సినిమా చూస్తున్నట్లు అనిపించింది. అంతే, అమాంతం మనోహర్ దేవదాస్ గారి గురించి తమిళంలో ఏవైనా వ్యాసాలుంటాయాని వెతికాను. ఓ రెండు మూడు వ్యాసాలుకనిపించడంతో అవి చదివి ఓ కొన్ని విషయాలిక్కడ ఇస్తున్నాను. ఈ నాలుగు ముక్కలూ నేను రాయడానికి కారకులైన సుబ్బారావుగారికి మనసా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనోహర్ గారి కథనంలోకెళ్తున్నాను. మనోహర్ దేవదాస్ గారు ఓ చిత్రకారుడు. రచయిత. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న విశిష్ట వ్యక్తి.మనోహర్ గారు, ఆయన భార్య కీ.శే. మహిమ అసామాన్యులు. అన్ని విధాలా గొప్పగా చెప్పుకోవలసిన వారు. ఒకరికోసం ఒకరు పుట్టేరా అన్నంతగా అల్లుకుపోయారు. చూపుకోల్పోయిన వారు చూడగలరా? అనే ప్రశ్నకు జవాబిస్తూ చూడటమే కాకుండా తాను చూసిన గొప్ప దృశ్యాలను ఇతరులకు చూపడమూ సాధ్యమే అని మనోహర్ దేవదాస్ గారు నిరూపించిన అరుదైన చిత్రకారుడు.1936లో మదురైలో జన్మించిన మనోహర్ అక్కడి అమెరికన్ కాలేజీలో డిగ్రీ చదివారు.1956 లో మద్రాసుకొచ్చి తనకిష్టమైన అంశంలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అందుకు సంబంధించిన ఉద్యోగంలో చేరారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే చిత్రాలు గీయడంపట్ల ఎంతో ఆసక్తి చూపిన ఆయన ఆలయ కట్టడాలు, శిల్పాలు గీస్తూ తన అంతరంగంలో ఒదిగి ఉన్న ప్రజ్ఞను నలుగురి ముందూ పరిచారు.ఆయన పని చేసిన సంస్థ, మనోహర్ గారుతన ప్రతిభకు మరిన్ని మెరుగులు పెట్టుకోవడంకోసం ఇంగ్లండుకి పంపింది.సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉన్న మనోహర్ గారు ఇంగ్లంఢ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్నో పెళ్ళి సంబంధాలు వచ్చాయి. కానీ ఆయన తానిష్టపడిన మహిమగారిని కుటుంబ పెద్దల ఆశీస్సులతో జీవితభాగస్వామిని చేసుకున్నారు. ఆయన భార్యకూ కళల పట్ల ఆసక్తి ఉండటంవల్ల వీరి వైవాహిక జీవితం ఓ అందమైన నదీ ప్రవాహంలా సాగింది.మనోహర్ గారు తన కొచ్చిన విద్యలో మరింత రాటుదేలడానికి 1969లో అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆయన వెంట భార్య మహిమకూడా వెళ్ళారు. వీరి జీవితంలో 1970 - 72 సంవత్సరాలు చిరస్మరణీయమైన రోజులు.మద్రాసు చేరుకున్నాక తన సంస్థలోనే టెక్నికల్ డైరెక్టరుగా పదోన్నతి పొందారు.దురదృష్టకరంగా 1960లో ఆయన కంటికి నయం చేయలేని జబ్బు చేసింది. క్రమంగా ఆయన కంటిచూపు తగ్గుతూ వచ్చింది. చివరికి ఓరోజు అసలు చూపే ఉండదని తెలిసినప్పటికీ మనోహర్ దంపతులు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. మనోహర్ గారు తనకెంతో ప్రియమైన చిత్రకళలో ముందుకు సాగారు తప్ప వెనకడుగు వేయలేదు. ఆయన వేసిన చిత్రాలకు, మహిమగారి క్యాప్షన్లతో మరింత జీవమిచ్చాయి. వీరిద్దరి కలయికలో సృష్టింపబడిన గ్రీటింగ్ కార్డులకు విశేష ఆదరణ లభించడంతోపాటు వాటి అమ్మకాలు జోరుగా సాగాయి. వాటిని సేవాకార్యక్రమాలకు ఉపయోగించారు.కంటిచూపు లోపాన్ని అధిగమించి సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో మరొక దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. 1972 డిసెంబర్ 30వ తేదీన (వారి తొమ్మిదో వివాహ వార్షికోత్సవం) మహిమ గారు కారు నడుపుకుంటూ వస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. ఆమెకు గొంతు కింది భాగంలోని భాగాలన్నీ పని చేయడం మానేశాయి. మనోహర్ గారు గాయాలతో బయటపడ్డారు. కానీ ఈ దుర్ఘటన తర్వాత మహిమగారు వీల్ చైరుకే (చక్రాలకుర్చీకే) పరిమిత మయ్యారు.ఈ సంఘటన వారి జీవితానికి ఓ సవాల్ విసిరింది.కానీ మనోహర్ దంపతులు ఏమాత్రం డీలాపడిపోలేదు. వారి ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు.దేవుడు తమకొక పరీక్ష పెట్టారనుకుని ఇతరులకు సేవచేయడం మానలేదు. జీవితాన్ని ఓ అపూర్వ కానుకగా స్వీకరించి ముందుకుసాగారు."ఈరోజు కొత్తగా జన్మించాం" అనే తమిళ జాతీయకవి సుబ్రహ్మణ్య భారతియార్ చెప్పినట్లు మనోహర్ దంపతులు జీవనయాత్ర సాగించారు. మనోహర్ గారు తమ చిత్రకళతోపాటు రచనలూ చేయడం మొదలుపెట్టారు. జీవితంలో ఏ సంఘటనైనా ఇష్టంగా స్వీకరించే పరిపక్వతనూ మనోధైర్యాన్ని దేవుడు వారికిచ్చాడు.అంతర్నేత్రంతో తాము చూసిన వాటిని ఇద్దరూ కలిసి అక్షరాల తోనూ చిత్రాలతోనూ బయటి ప్రపంచానికి చూపిస్తూ వచ్చారు. మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంతోపాటు అనేక కట్టడాలు, మండపాల శిల్పాలు మనోహర్ గారి నలుపూ తెలుపూ వర్ణాలతో కొత్త ఊపిరి పోసుకున్నాయి. పర్వతాలూ ప్రకృతి దృశ్యాలూ ఆయన అంతర్ దృష్టిని ఆకర్షించి చిత్రాలై లోకం ముందుకొచ్చాయి. ఇంకా చెప్పాలంటే యావత్ మదురై ఆయన రేఖలతో కొత్త శోభతో మెరిసింది.ఆయన ఇంగ్లీషులో రాసిన తొలి పుస్తకం "గ్రీన్ వెల్ ఇయర్స్" ఆత్మకథలాగానే సాగింది. అందులోనూ తన మనసుని కట్టిపడేసిన మదురై గురించి బోలెడు విషయాలు చెప్పారు. మదురైతో తనకున్న అనుబంధానికి ఇచ్చిన అక్షరరూపం అమోఘం. మహిమ కూడా ఓ రెండు పుస్తకాలు రాశారు.ఆయన రాసిన మరొక పుస్తకం "కలలు, ప్రాయాలు, హామీలు" - ఇది తన భార్య మహిమ జీవితానికి అద్దం పడుతుంది.ఆయన మూడో పుస్తకం ధైర్యానికో కవిత. ఇది పూర్తిగా మహిమ జీవితపయనం. 2007లో ఆయన బహుముఖ మదురై అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ప్రతి పేజీ బొమ్మలతోనూ వాటిని వివరిస్తూ మాటలూ రాశారు. మహిమగారికి అంజలిగా "పట్టాంపూచ్చియుం - మహిమావుం" అనే పుస్తకం రాశారు. (సీతాకోకచిలుకా - మహిమానూ)2008లో మహిమ కాలధర్మం చెందేవరకూ ఇద్దరూ కలిసే అనేక కార్యక్రమాలకూ హాజరయ్యారు. ఇతరులపై భారాన్ని మోయక జీవనయాత్ర సాగిస్తూ వచ్చారు. వారి హాస్యం, నిజాయితీ, ఎదుటివారిని నొప్పించక ప్రవర్తించే తీరు అందరినీ ఆకట్టుకునేవి.సుజాతా శంకర్ తో కలిసి మనోహర్ గారు ఓ ఇంగ్లీష్ పుస్తకం రాశారు. ఇందులో సిరాతో గీసిన 61 చిత్రాలలో రెండు మహిమగారు గీసారు. కష్టాలనూ కన్నీళ్ళనూ గెలిచి ఇతరులకు ఏదైనా అవసరమై చేయవలసివచ్చినప్పుడు ముందుండే ఈ గొప్ప మనసుని గుర్తించి సత్కరించడం వల్ల పద్మశ్రీకో గౌరవం దక్కిందనుకోవచ్చు.ఆయన ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి న కొన్ని విషయాలను ఆయన మాటల్లోనే ..."నాకు ప్రేమంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ ప్రేమించాలనే ఆశ. పెళ్ళి చేసుకున్న అమ్మాయిని ప్రేమించాలనుకున్నాను. అలాగే మహిమను ప్రేమించాను. మా నాన్న ఓ డాక్టర్. మా అమ్మకు కోడలు మహిమంటే ఎనలేని ప్రేమ. మాది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజీ. మహిమ దూరపు బంధువే. నా కజిన్ సత్యాకి తరచూ ఉత్తరాలు రాస్తుండే వాడిని. సత్యా, మహిమాకూడా కజిన్సే. వేసవి సెలవులకు మహిమ కొడైకనాల్లో ఉండే సత్యా ఇంటికే వెళ్తుండేది. సత్యాకు ఉత్తరాలు రాస్తున్నప్పుడు కొన్ని బొమ్మలుకూడా గీసి పోస్ట్ చేసేవాడిని. అయితే మహిమ అక్కడ ఉంటున్న విషయం తెలిసి బొమ్మలు గీయకుండానే ఓ ఉత్తరం రాశాను. కారణం, మహిమ స్టెల్లా మేరీస్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ గోల్డ్ మెడలిస్టు. మరోవైపు నేనేమో ఓ పద్ధతి ప్రకారం చిత్రకళ నేర్చుకున్న వాడిని కాను. బొమ్మలు లేని ఉత్తరం చదవడంతోనే సత్యాకు కోపమొచ్చింది. ఘాటుగా జవాబు రాసింది. మరుసటి ఉత్తరంలో నేను బొమ్మలు గీసి నేనెందుకు క్రితం ఉత్తరంలో బొమ్మలు వేయకపోవడానికి గల కారణాన్ని చెప్పాను. పైగా ఆ ఉత్తరంలో నేను సంతకం పెట్టకుండా ఓ క్యారికేచర్ వేసాను. ఆ ఉత్తరాన్ని మహిమకూడా చూసింది..1963 మే 24వ తేదీన తొలిసారిగా ఓ బంధువులింటి పెళ్ళిలో మహిమను చూశాను. మరోవైపు అప్పటికే ఇంట్లో ఓ ప్రపోసల్ ఉండేది. మా ఇద్దరికీ ఇష్టమైతే పెళ్ళి చేసెయ్యా లన్నదే ఆ ప్రపోసల్. కానీ ఈ విషయం మహిమకు తెలీదు. ఆ పెళ్ళిలో నన్ను చూడటంతోనే మహిమ పరిగెత్తుకుంటూ వచ్చి "మీరేనా మనోహర్?" అని అడిగింది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లోని చిలిపితనంతో కూడిన నవ్వుని చూసాను. ఆ క్షణాలు మరచిపోలేనివి. నేను జవాబు చెప్పేలోపు మహిమ "మీకు కాస్త ఇన్ఫీ రియారిటీ కాంప్లెక్స్ అండి. తెలుసా మీకిది" అంది. ఆరోజు చాలాసేపు ఇద్దరూ నవ్వుతూ గడిపాం. మహిమ చెప్పినట్లు నాలో ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకపోలేదు. మహిమ నాకన్నా ఓ మెట్టెక్కువే. అందంగా కారు నడుపు తుంది. అప్పట్లో మహిమ పరిచయమయ్యే నాటికి నేను ఓ కంపెనీలో ఓ కెమిస్టుని. కంపెనీ ఖర్చులపై ఓ మూడు నెలలు ఇంగ్లండ్ వెళ్ళిరావడంతో ఫారిన్ రిటర్నడ్ అనే మాట మిగిలింది తప్ప నాకు సైకిల్ తొక్కడం ఒక్కటే వచ్చు. కానీ ఇవేవీ మా పెళ్ళికి అడ్డు రాలేదు. ఇద్దరి మనసులు కలిశాయి. పెళ్ళికి ముందర ఏడు నెలల్లో మేము డెబ్బయ్ ఉత్తరాలు రాసుకున్నాం. ఎంగేజ్ మెంటుకి నేనే ఉంగరాలు డిజైన్ చేశాను. మా పెళ్ళి చాలా సింపుల్ గా అయిపోయింది. మాకు1966 లో సుజా అనే పాప పుట్టింది. చిన్నప్పటి నుంచీ ఉన్న కంటి సమస్య 1967 లో ఎక్కువైపోయింది. సరిగ్గా డయగ్నోసిస్ చెయ్యలేదు. 1975 నాటికి కుడి కన్ను పూర్తిగా పోయింది. అమెరికా మిత్రుడొకరు చేసిన సూచన మేరకు ఓ డాక్టరుని కలిశాం. అనతికాలంలోనే ఆ డాక్టర్ మాకు అత్యంత సన్నిహితుడయ్యారు. రెండవ కన్నుకూడా పూర్తిగా దెబ్బ తినకముందరే ఏవైనా బొమ్మలు గీయాలనుకున్నాను. పుస్తకం రాయాలనుకున్నాను. వీటి వెనుక మహిమ ప్రోత్సాహం నా ప్రతి అడుగులోనూ ఉంది. నా మొదటి పుస్తకంలో ఏడవ అధ్యాయం పూర్తిగా మహిమే రాసిపెట్టింది.నేనేమీ ప్రొఫెషనల్ ఆర్టిస్టుని కాను. ఏ కోర్సుకూడా చదవలేదు. అనుభవంతో గీయడమే తప్ప శిక్షణంటూ ఏమీ తీసుకో లేదు. నలుపు , తెలుపు రంగులు మాత్రమే గుర్తించడంవల్ల ఇతర వర్ణాలలో బొమ్మలు వేసేవాడిని కానన్న మనోహర్ ప్రపంచమంతా మహిమా, పాప సుజా, బొమ్మలూ. అక్షరాలే. - యామిజాల జగదీశ్
July 31, 2020 • T. VEDANTA SURY • News