ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అక్కడ పుస్తకాలు..--జుత్తు కత్తిరించుకోవడానికి వెళ్ళే దుకాణాలలో వార్తాపత్రికలు ఉండటం సర్వసాధారణం. ఈరోజుల్లో టీవీలు కూడా ఉంటున్నాయి.మద్రాసులో ఉన్న రోజుల్లో నేను మా ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ దుకాణానికి వెళ్ళేవాడిని. ఆ షాప్ అసలు పేరు గుర్తుకు రావడం లేదు కానీ అన్నదమ్ముల హెయిర్ డ్రెస్సస్ అనే వారు. ఈ షాపులోనే కాదు మద్రాసులో దాదాపు తొంబై శాతం షాపులవారు దినత్తంది వార్తాపత్రిక తెప్పిస్తారు. అప్పట్లో రేడియోనో లేదా ట్రాన్సిస్టరో ఉండేది. తమిళం వార్తలు తప్పకుండా పెట్టేవారు. అలాగే ఇండ్రు వొరు తగవల్ (ఈరోజు ఒక సమాచారం) అనే శీర్షికతో తెన్కచ్చి స్వామినాథన్ గారి ప్రసంగం కూడా పెట్టేవారు. ఆయన కేవలం అయిదు నిముషాల్లో చరిత్రకు సంబంధించిగానీ లేదా ఓ ప్రముఖుడి గురించికానీ ఏదైనా ఒక మంచి విషయం చెప్పేవారు. ఇవి చాలా బాగుంటాయి. విజ్ఞానదాయకంగా ఉండేవి. మా ఇంట ట్రాన్సిస్టరు కూడా ఉండని రోజులవి. కనుక ఏడు ఇరవై అయిదుకి ప్రసారమయ్యే తెన్కచ్చి వారి మాటలు వినడం కోసం ఈ సలూన్ కి వెళ్ళేవాడిని. ఊహించని విషయమేమిటంటే తర్వాతి రోజుల్లో ఆయన తమిళంలో రాసిన నీతికథలలో ఓ వందకుపైగా నేను శ్రీరామకృష్ణ ప్రభలో అనువదించాను. అంతేకాకుండా ఆయనను కలిసి నేను అనువదించిన విషయంకూడా చెప్పాను. సినిమా వాల్ పోస్టులు చూసి తమిళ అక్షరాలూ మాటలూ చదవడం నేర్చుకున్న నాకు ఈ విషయంలో దినత్తంది వార్తాపత్రిక కూడా ఎంతో ఉపయోగపడింది. ఈ దుకాణాలవారు ఓ పేపరుతోపాటు ఏదైనా ఒక వారపత్రిక తెప్పించేవారు. కానీ ఇటీవల నా తమిళ మిత్రుడు, రచయిత ఎస్. రామకృష్ణన్ వల్ల మరొక విషయం తెలిసింది. అదేంటంటే, ఓ సలూన్ షాప్ అతను సాహిత్య పుస్తకాలు తెప్పించడం. ఈ దుకాణం తమిళనాడులోని తూత్తుకుడిలో మల్లిపురం అనే ప్రాంతంలో ఉంది. ఆ షాప్ యజమానికి పుస్తకాలంటే ప్రాణం. తన వద్దకు క్రాఫ్ చేసుకోవడానికి వచ్చే వారికోసం కొన్ని పుస్తకాలు తెప్పించిపెట్టాడు. వాటికోసం ఓ అల్మరా ఏర్పాటు చేశాడు. అందులో ఓ నలభై యాభై పుస్తకాలుంటాయి. వీటిని చదవడం కోసం వచ్చే కస్టమర్లలో కొందరు మరెక్కడికీ వెళ్ళకుండా తన దగ్గరకే వస్తుంటారని రామకృష్ణన్ కి ఫోన్ చేసి చెప్పాడు. పైగా "యు - ట్యూబ్లో" రామకృష్ణన్ గారి సాహిత్య ప్రసంగాలను ఆడియోగా రికార్డు చేసి వాటిని స్పీకర్ ద్వారా వినిపిస్తుంటాడు. అవి వినడంకోసమూ వచ్చే కస్టమర్లున్నారట. తన దుకాణంలో ఎలాంటి పుస్తకాలు సేకరించి ఉంచాలో తెలుసుకోవడానికిగాను అతను రామకృష్ణన్ కి ఫోన్ చేశాడట. పుస్తకాలు చదివించే విషయంలో విద్యాలయాలు చేయని కృషిని ఈరోజుల్లో ఓ సలూన్ షాపు యజమాని పుస్తకాలు కొనడం కోసం తనను సంప్రదించడం ఆశ్చర్యంగా ఉందన్నారు రామకృష్ణన్. \తన దుకాణానికి వచ్చే కస్టమర్లతో పుస్తకాలు చదివించేలా చేయాలన్నది అతని కోరికట. ఇంతకూ ఆ పుస్తకప్రియుడి పేరు చెప్పలేదు కదూ. అతని పేరు పొన్ మారియప్పన్. అతని దుకాణం పేరు "సుశిల్ కుమార్ బ్యూటీ కేర్". మామూలుగా అయితే పెద్ద పెద్ద హెయిర్ డ్రెస్సస్ షాపులో టీవీలు ఉండటం, ఇంగ్లీష్ పేపర్లు ఉండటం మామూలే. తమిళ పుస్తకాలు కనిపించవు. కానీ మారియప్పన్ తీరు వేరు. తమిళ పేపర్లు మాత్రమే తెప్పిస్తే అది లోకల్ సలూన్ అయిపోతుందని మారియప్పన్ అసలు పత్రికలు తెప్పించడు. అందుకు బదులు తనకొచ్చే తక్కువ సంపాదనలోనే ఇష్టమైన సాహిత్య పుస్తకాలను కొనుక్కొచ్చి తాను చదవడంతోపాటు ఇతరులూ చదవాలనే ఆలోచనతో వాటికోసం తన దుకాణంలో ఓ అల్మరా చేయించడం విశేషం. ఈ దుకాణంలో సినిమా పాటలు వినలేం. మారియప్పన్ లాగానే పుదుక్కోట్టయ్ సమీపంలో తమిళ్ వరదన్ అనే యువకుడు తాను నడిపే సలూన్ సెంటర్లో సాహిత్య పత్రికలను తెప్పిస్తుంటాడు. ఇలాంటి దుకాణాలు ఊరుకి ఓ నాలుగో అయిదో ఉంటే పుస్తకప్రియుల సంఖ్య పెరిగే వీలుంటుందికదా. కొన్ని జిల్లా కేంద్ర లైబ్రరీలు పాఠకులు లేక నిస్తేజంగా ఉండటం తెలిసిన విషయమే. ఈకాలంలో స్కూళ్ళూ కాలేజీలూ పాఠ్యపుస్తకాలు తప్ప మిగిలిన పుస్తకాలు చదివించడం లేదు. లైబ్రరీలు చాలావరకూ పేరుకే నడుస్తుంటాయి. సినిమాలూ టీవీల వీక్షణతో పుస్తకాలు చదవడమనే అలవాటు క్రమంగా తగ్గిపోతోంది. ఈ స్థితిలో పొన్ మారియప్పన్ లాంటి వారి కృషి అభినందనీయం.- యామిజాల జగదీశ్
August 18, 2020 • T. VEDANTA SURY • Memories