ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అతని బతుకుతీరు....మద్రాసులో ఉన్న రోజులవి. ఓరోజు వెస్ట్ మాంబళం తంబయ రెడ్డి స్ట్రీట్ సమీపంలో ఒకరిని చూశాను. వయస్సు యాభైపైనే ఉండొచ్చు. సన్నగా పొడవుగా ఉన్నాడు. కళ్ళు చిన్నవి. నల్లటి మేని. భుజాన ఓ సంచి. వేలాడుసుకున్నాడు. చేతిలో ఓ కర్ర. ఆ కర్ర సన్నపాటిది. మరీ పొడవూ కాదు. అలాగని పొట్టిదీ కాదు. మధ్యంతరంగా ఉంది. ఆ కర్రతో రోడ్ఖు పక్కన ఏదో వెతుకు తున్నాడు.అటు తిరుగుతున్నాడు. ఇటు తిరుగుతున్నాడు. అతనినే చాలాసేపు గమనించాను. ఆ కర్ర అంచున అయస్కాంతం లాంటిది కనిపించింది.ఆ భాగాన్ని నేల మీద ఉంచి వెతుకుతున్నాడు. ఆ అయస్కాంతానికి అతుక్కున్న మేకులను, తుప్పుపట్టిన తాళాలు, స్క్రూలు తీసి భుజానికి తగిలించుకున్న సంచీలో వేసుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తిని నేనప్పుడే మొదటిసారి చూశాను. దాంతో ఎందుకవి ఏరుతున్నాడో తెలుసుకోవాల నిపించింది. అతని చూపులన్నీ నేల మీదే ఉంటున్నాయి. ఉండబట్టలేక అతని దగ్గరకు వెళ్ళి మెల్లగా అడిగాను. ఎందుకవన్నీ సేకరిస్తున్నావని ప్రశ్నించాను.అప్పుడతను అదొక పని అన్నాడు. చెత్తకుప్పలలో చెత్తకుండీలలో పడేసిన ఇనుప వస్తువులను సేకరించి చెత్తసామాన్ల దుకాణంలో వీటినిస్తే డబ్బులిస్తారన్నాడు.కర్రకున్న పెద్ద అయస్కాంతం ఎక్కడ కొన్నావని అడిగాను. నేనప్పుడే అంత పెద్దది చూస్తున్నాను. టీ.నగర్లో కొన్నట్టు చెప్పాడు.అతను తన చేతిలో ఉన్న సంచీని చూపించాడు. అప్పటికే సగందాకా ఉన్నాయి ఇనుప ముక్కలు, తాళాలు, సైకిల్ చక్రంలో ఉండే కమ్మీలు వంటివన్నీ ఉన్నాయి. వాటిలో కనీసం వంద తాళాలు కనిపించాయి. అన్ని రకాల సైజులలో ఉన్నాయి. వాటి వంక ప్రశ్నార్థకంగా చూడటం గమనించిన నన్ను చూసి అతనన్నాడు "రోజుకి కనీసం వంద తాళాలైనా దొరుకుతాయి" అన్నాడు. వాటిని విడిగా అమ్మితే కాస్త ఎక్కువ డబ్బిబ్తారన్నాడు. ఆ మాట ఆశ్చర్యం కలిగించింది. అంటే రోజూ ఎంతమంది తమ ద్విచక్ర వాహనాల తాళాలు, ఇంటి తాళాలు పోగొట్టుకుంటున్నారో ఆలోచించాను. అలా ఎలా పోగొట్టుకుంటారని మరో ప్రశ్న. మనుషులకు మరీ అంత అజాగ్రత్తా అనిపించింది. అప్పుడలా అనిపించింది కానీ హైదరాబాదులో కాపురం పెట్టిన కొత్తలో ఎక్కడో పోగొట్టుకున్న తాళంతో తలుపుకి వేలాడుతున్న తాళం కప్పను పగలకొట్టడానికి ఒకడ్ని పిలిపించుకొచ్చిన సంఘటన ఉంది. ఇంతకూ రోజుకి ఎంత ముడుతుందని అడిగాను. రోజూ రెండు వందల రూపాయలుపైనే లభిస్తాయన్నాడు. తనలాగా ఓ యాభై మంది ఈ పని చేస్తుంటాం అన్నాడు. ఏదో ఒకటి చేసుకుని బతకాలి కదండీ అని చెప్పాడు.అతనీ విషయం చెప్తుంటే ఎక్కడో ఎప్పుడో తమిళంలో చదివిన ఓ అనువాద కథ గుర్తుకొచ్చింది నిజానికది నవలే. కాని రచయిత ఆ నవలనే కుదించి రాశాడు. మూలకథ రాసిందెవరో మరచిపోయాను.ఆ కథలో నాయకుడు ఓ పెద్ద అయస్కాంతాన్ని తానుండే ఊరుకి తెచ్చుకుని కానిచ్చిన పనుల తతంగమంతా అందులో ఉంది. అతను ఇనుపసామాన్లకోసం వెతుకుతుంటాడు.ఇనుముని ఓ సమాజం ఎలా ఉపయోగిస్తోందన్నదీ ఆలోచించాను.ఒక్కొక్క సమూహమూ ఒక్కోలా వినియోగిస్తోంది ఇనుముని. ఒక్కొక్కసారి అతను ఓ కర్రకు అయస్కాంతం కట్టి కిటికీలలోంచి లోపలకు పోనిచ్చి చిన్న చిన్న ఇనుప సామాన్లను తస్కరించి సేకరిస్తాడు.ఇనుము ఉపయోగం రకరకాలుగా ఉంటూనే ఉంటోంది. ఇనుము గురించి పూర్తిగా తెలియని నేను ఆలోచనలో పడగా అతనీలోపు నేలమీద మరిన్ని తుప్పుపట్టిన సామాన్లు సేకరించి సంచీలో వేసుకున్నాడు.అతని జీవితం తాళాలమీదా తుప్పుపట్టిన ఇనుప సామాన్ల మీద సాగుతోంది. ఒకరికి ఉపయోగఫడనిది మరొకరికి ఉపయోగపడుతోంది. ఈ లెక్కన పనికిరానిదంటూ ఏదీ లేదన్న మాట. ఇదే జీవితం. - యామిజాల జగదీశ్
August 17, 2020 • T. VEDANTA SURY • Memories