ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అదిగో..నా బాల్యం..--చిట్టె మాధవి--కడప
October 14, 2020 • T. VEDANTA SURY • Memories

 

ఈరోజెందుకో...నా బాల్యం నన్ను ఆత్మీయంగా కౌగిలించుకొని పరామర్శించింది.పదే పదే తనని గుర్తుచేస్తూ...సంతోషంతో పాటూ తన చిలిపితనాన్ని గుర్తుచేసింది.నా ప్రయాణంలో మమైకమైతూ...వర్షంలో వొదిలిన కత్తి పడవలా..
తనతో నడిపించింది...గతంలోకి... అమ్మ ప్రేమతో, కలిపిపెట్టిన ఆవకాయ అన్నం..అమ్మ కుటించిన అంతస్తుల గౌన్లు ఎంతో ముచ్చటతో వేసుకొని గంతులేసిన క్షణాలు..
బుద్ధుడి బొమ్మ చెయ్యి విరగొట్టి మంచం క్రింద నక్కిన వైనం..తిలకం సీసా పగలగొట్టి యాపిల్ పండు బొమ్మలోకి ఎత్తి బొమ్మల అల్మారాలో దాచిపెట్టి దెబ్బలు తిని ఇల్లు అదిరిపోయేలా 
ఏడ్చి   రణరంగంగా చేసిన నా గీరంగితనం ..
నా అల్లరికి విసుగొచ్చి విసనకఱ్ఱతో అమ్మ కొట్టిన దెబ్బలు..ఆపై దగ్గరకు తీసుకొని ముద్దులిడిన ఆపురూపమైన అనుభవాలెన్నో..!

.ప్రేమతో నాన్న పిలిచే పెద్దోడా అనే తీయని పిలుపు..కోసిరి కోసిరి తినిపించే తంగేడుపల్లి కోవా..నాన్న సైకిల్ తొక్కుతూ క్రిందవేసి ఏడవడం.
అన్నతో దెబ్బలాటలు..నా కుడిచెయ్యి మణికట్టు విరిగిన వేళ ఇల్లంతా ఒక్కటి చేసిన గందరగోళం పెద్ద చెల్లి చేసిన అల్లరిపనులకు కూడా నాకు దక్కే పనిష్మెంటు..చిన్న చెల్లెలు మారం.. తమ్ముడిని చంకనెత్తుకొని అన్నం తినిపించిన వైనం..వాడు అక్కా అక్కా అంటూ నా చుట్టూనే తిరిగితే వాడికి ఇంకో అమ్మలా మారిపోయే ప్రేమ..

పుస్తకంలోని నెమలి ఈక...
సరస్వతీ ఆకు...
కొత్తబ్యాగులకై... ఏడుపు..
అల్యూమినియం బాక్స్ తో గర్వం...
క్రొత్త పుస్తకాల వాసన..
పెన్సిల్ కొట్టేసే రబ్బరు సువాసన...
జామెట్రీ బాక్స్ లో దాచుకున్న 
రూపాయి బిళ్ళలు...
లీడర్ షిప్ దర్పం..
నల్ల రేగిపండ్ల..తీయదనం
పావలా దోసెల..కమ్మదనం
గుంతపొంగణాలు..నిమ్మఒప్పులు..
కమ్మరకట్టలు...పిప్పరమెంట్లు..
ఉప్పు కారం వేసిన అరచెక్క చీనిపండ్లు..
ఆకర్షించే రాంబాణం పూలు..
వర్షంలో...ఇంద్రధనస్సు చూడటం...
బల్ల పలకలపై... ఎగిరిన గెంతులు...
కన్నీళ్లు తెప్పించే బెత్తం దెబ్బలు..
ఒంటి కాలు ఆటలో దోక్కపోయిన మోకాళ్ళు...
కబ్బాడ్డి ఆటలో 
చిరిగి పోయిన బాడీ పావడా..

అమ్మ తిట్టే తిట్లు...నాన్న ఓదార్పు...
మొదటి తరగతి మేరీ టీచర్..అభిమానం
రెండో తరగతి పార్వతి టీచర్..ఆప్యాయత
మూడో తరగతి సంజీవయ్య సర్...బెత్తం దెబ్బలు
నాలుగో తరగతి సుబ్బారాయుడు సర్ పిలిచే పిలుపులు హెడ్మాస్టర్  రామ చంద్రయ్యా సర్....మెతకతనం అందరూ...అందరూ గుర్తుకు వచ్చారు....అవును మధురమే నా బాల్యం నాకెంతో మధురం..
చాలా బాగా గుర్తు చేసావు డియర్.
వెళ్లిపోతున్నావా....డియర్...
మళ్ళీ మళ్ళీ నన్ను పలకరిస్తావు కదూ...
ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్..

వెళ్లిపోతూ నా  కన్నీటిని పలకరించింది...
నా బాల్యం...అదిగో నా బాల్యం...!