ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అనగ ననగ రాగమతిశయిల్లుచు నుండు: - బిందు మాధవి . ఎం
November 15, 2020 • T. VEDANTA SURY • Story

అనగ ననగ రాగమతిశయిల్లుచు నుండు,
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ"


గాయకుడికి ....పాడగా పాడగా రాగం పట్టు చిక్కి మంచి సంగతులతో ఎలా పాడగలడో, చేదుగా ఉండే వేప కూడా తినగా తినగా తియ్యగా ఉంటుంది.

అలాగే ఎంత చేతకానివారికైనా ఒక పని పదే పదే చేస్తూ ఉంటే అందులో సమర్ధత చేకూరుతుంది.

అదెలా గాంటే......


విద్యాధర్ కి పెద్ద జీతంతో చక్కటి ఉద్యోగం ఉన్నది.
ఇంట్లో వాళ్ళు పెళ్ళి గురించి ఆలోచించమనగానే....చేతినిండా డబ్బుండి.... స్వేచ్చతో కూడుకున్న జీవితాన్ని పెళ్ళి అనే లంపటం లో దిగి రొష్టు పెట్టుకోవటమెందుకు అని వితండ వాదనకి దిగుతున్నాడు.

ఇది విని అతని బామ్మ ....జీవితం లో ఎన్ని ఉన్నా మనిషికి మనిషి తోడు ఉండాలి.
చిన్నప్పుడు తల్లిదండ్రులు....తోబుట్టువులు.... ఆ తర్వాత స్నేహితులు ఎలాగో, యుక్త వయసు వచ్చాక ఒక జీవిత భాగస్వామి కూడా చాలా ముఖ్యం.

జీవిత భాగస్వామి ఎప్పుడూ స్వేచ్చకి అడ్డు వచ్చే ఒక సంకెలనో, భారమనో అనుకోవటం అజ్ఞానమని తలంటి పోసింది.

అలా బామ్మ ఙ్ఞాన స్నానంతో కళ్ళుతెరుపుడు పడ్డ విద్యాధర్ ఓ మంచి ముహూర్తం చూసి అనన్యని పెళ్ళి చేసుకున్నాడు.

కాపురానికి వచ్చి, కొంచెం స్థిమిత పడ్డాక ఇంట్లో అందరు సరదాగా ఆ రోజు అనన్యని బ్రేక్ ఫాస్ట్ కి ఉప్మా చెయ్యమన్నారు.

పాపం ఇంట్లో అమ్మ వండింది తింటూ కాలేజ్ కి వెళ్ళొచ్చిన అనన్య ఒక్క సారిగా అంతమందికి టిఫిన్ తయారు చెయ్యాలంటే కొంచెం కంగారు పడింది.

బామ్మ గారు అనన్య వెన్నుతట్టి 'నీకేం ఫరవాలేదు, నేనున్నాగా' అని వంటింటిని పరిచయం చేసి, పూజకి ఉపక్రమించింది.

ఇల్లు కొత్తైన అనన్య, బెరుకు బెరుకు గా కావలసినవన్నీ అక్కడ వెతికి, ఇక్కడ వెతికీ సమకూర్చుకుని మొత్తానికి బామ్మ గారి పూజ అయ్యేటప్పటికి ఉప్మా తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది.

అందరు కొత్తకోడలు చేసిన ఉప్మా తింటానికి తయరై ఉత్సాహంగా వచ్చారు. వేడి పొగలు కక్కుతున్న ఉప్మా నోట్లో పెట్టుకుంటూనే 'విద్యాధర్ ' 'ఏంటి ఏదో తేడా గాఉన్నది' అని తల్లి మొహం వంక చూశాడు. తండ్రి కూడా భార్య వంక చూసి, 'రుచి బాగానే ఉన్నది కానీ ఏదో తేడా గా ఉన్నది, ఏంటో చెప్పవోయి' అని కళ్ళెగరేశాడు.

వీళ్ళ హావ భావాలు చూసిన అనన్య కి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంతలో బామ్మ రంగ ప్రవేశం చేసి, 'ఏమిటర్రా, అందరూ అలా మొహాలు పెట్టారు.' 'నా మనవరాలు ఉప్మా అంత బాగా చేసిందా ఏం' అని కాస్త నోట్లో వేసుకుని, 'భేషుగ్గా ఉన్నది. రుచి తేడా కి కారణం ఇది ఇడ్లీ రవ్వ తో చేసిన కొత్త వెరైటీ,' అని అప్పటికి వాతావరణాన్ని తేలిక చేసేసింది.

అందరూ ఎవరి దారిన వారు వెళ్ళాక, అనన్యని పిలిచి 'ఇందాక ఉప్మా రవ్వ ఏదో చెప్పకపోవటం నా పొరపాటేనమ్మా. పూజకి ఆలశ్యమవుతున్నదని హడావుడి లో గబ గబా వెళ్ళిపోయాను, ' అని ఊరడించి వెన్నుతట్టింది.

ఇక ఇంట్లో అందరూ ఎప్పుడూ ఇది గుర్తు చేసి అనన్యని ఆట పట్టించేవారు.

ఇంతలో వరలక్ష్మీ వ్రతం వచ్చింది. అత్తగారు పూజ గది సిద్ధం చేసుకుంటుంటే బామ్మ గారు అనన్య కలిసి వంట పూర్తి చేశారు.

విద్యాధర్, విశ్వం గారు భోజనానికి కూర్చుని - 'అబ్బా ఇవ్వాళ్ళ వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఎంతైనా నీ చేతి వంట రుచే వేరమ్మా. కాస్త అనన్యకి కూడా నేర్పరాదూ, మొన్న ఆ ఉప్మా తినలేక, బామ్మ ఏమంటుందో అని నోరు మూసుకు తిన్నాం' అని అనర్గళంగా ఉపన్యాసమిచ్చాడు.

బామ్మ గారు, ముసి ముసి నవ్వులు నవ్వుతూ, 'భడవ కానా అవన్నీ మీ ఆవిడ చేసినవే. నేను ఊరికే పులుసులో పోపు వేసి, నా మనవరాలు తయారు చేసి పెట్టిన ముక్కలతో గ్రైండర్ లో పచ్చడి చేశాను.' అని ముక్తాయించి, చిన్నప్పుడు నీ చేత భట్టీయం వేయించిన పద్యం గుర్తుందా?

"అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు,
.............
సాధనమున పనులు సమకూరు ధరలోన, అని

అలా మూడు నెల్ల కాలంలో నా మనవరాలు అన్ని వంటలు నా దగ్గర నేర్చుకుని నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది, చూశావా? అన్నది మనవరాలిని దగ్గరకి తీసుకుని.