ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అనాధ: --- యామిజాల జగదీశ్
November 13, 2020 • T. VEDANTA SURY • Poem


అతను 

తాడూ బొంగరం లేనోడు

చినిగిన బట్టలూ

చింపిరి జుత్తూ

స్నానం చేసి రోజులైంది

వికృతంగా కనిపించే రూపం

పిల్లలు అతనిని చూస్తే పరుగులు తీస్తారు

కొందరైతే ఉమ్ముతారు

నానా రగడా చేస్తారు

చూసిన వారంతా పిచ్చోడంటారు

మూర్ఖుడంటారు

ఆకలే అతని ఆహారం


అర్థరాత్రి స్వేచ్ఛగా తిరుగుతాడు

నాన్నెవరో తెలీదు

అమ్మెవరో తెలీదు

ఓదార్పనే మాటే తెలీని అనాథతను

అతనికి లోకమంతా మిత్రులే అనాథ అనే పేరుతో


ఒక్కడుగా నవ్వుతాడు

ఒక్కడుగా ఏడుస్తాడు

నవ్వులు పంచుకుని 

ఆనందించడానికి చుట్టాలూ పక్కాలూ లేరు

కన్నీళ్ళు తుడవడానికి మిత్రులు లేరు

ఆదరించేందుకు ఎవరూ లేరు

ఒక్కడుగా ఎండకు ఎండుతూ

వానకు తడుస్తూ రోజులు గడిపేస్తుంటాడు

చెప్పుకోవడానికేం ప్రాణముంది

కానీ సజీవ శవమైన అనాథ అతను