ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అనువు గాని చోట..--- వురిమళ్ల సునంద-భాషా ఉపాధ్యాయిని, ఖమ్మం
September 22, 2020 • T. VEDANTA SURY • Story

"బామ్మా! బామ్మా! వీళ్ళు చూడు వాళ్ళ జట్టులో నన్ను కలుపుకోవడం లేదు " ఏడ్చుకుంటూ 
హాల్లో ముచ్చట్లు పెడుతున్న బామ్మ దగ్గరకు వచ్చింది సంజన.
"ఏం జరిగింది బంగారూ! ముందు నీ ఏడుపు ఆపి విషయం చెప్పు" .. ఓదారుస్తూ అంటున్న బామ్మ మాటలకు మరింత దుఃఖం వచ్చింది సంజనకు.
"మరేమో. .. మరేమో గౌరీ,శౌరీ,చింటూ,పింటూ ,
బబ్లూ వాళ్ళు  ఆటలు ఆడుకుంటుంటే నేను కొత్త కొత్త ఆటలు నేర్పుతానని చెప్పాను బామ్మా!
బోడి నీ ఆటలెవరికి కావాలి .మేమే ఆడుకుంటాం.నీ ఆటలు వద్దు, నువ్వు వద్దని జట్టులో చేర్చుకోలేదు బామ్మా!" గుక్కతిప్పు కోకుండా విషయమంతా చెప్పి ,మళ్ళీ భోరుమని ఏడ్చింది సంజన.
"మన ఊరికి వెళ్ళి పోదాం . అక్కడైతే రాజి,దేవి,బుజ్జీ వాళ్ళంతా ఎంచక్కా నేను చెప్పినట్టు వింటారు.నాతో మంచిగా ఆటలాడుతారు. ఛీ! వీళ్ళసలే మంచోళ్ళు కారు. మనూరు వెళ్దాం బామ్మా!" అంటూ పేచీ పెడుతున్న మనవరాలికి ,ఎలా నచ్చచెప్పాలో ఆలోచించింది..
వెంటనే వేమన శతకం లోని పద్యం గుర్తొచ్చి.."బంగారూ! నీకు పద్యాలంటే ఇష్టమేగా అంది..
ఓ.. తాతయ్య పాడే పద్యాలేనా"..అంది సంజన. 'అవునురా బంగారూ! అలాంటిదే నేను ఇప్పుడు చెప్పేది.  "అనువు కాని చోట అధికులమనరాదు పద్యం గుర్తుంది కదా ! మరి కథ చెబుతా విను"..
నందగిరి రాజ్యాన్ని విజయ సింహుడనే రాజు పరిపాలించేవాడు.
ఆయనకు రాజు ననే గర్వం చాలా ఉండేది. మంత్రి సుమంతుడు రాజు గర్వం వల్ల చాలా ఇబ్బందులు పడే వాడు. 
ఒకరోజు రాజు మంత్రి సుమంతుడితో కలిసి వేటకు వెళ్ళి అడవిలో దారి తప్పాడు.. అలా అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాడు..ఓ చోట కొన్ని గుడిసెలు కనిపించగానే గబగబా అక్కడికి చేరుకున్నాడు.అక్కడెవరూ రాజును పట్టించుకోకుండా తమ పని తాము చేసుకోసాగారు.. "ఎవరక్కడ !నేను రాజును నాకు మర్యాద చేయాలని తెలియదా" నాకు వెంటనే  మంచినీళ్ళు,తేనీటిని సిద్ధం చేయండి" అని హుంకరించాడు.
ఎవరూ అతని మాటలకు భయపడలేదు.పైగా అదిగో అక్కడే  తీయని మంచినీటి చెలిమ ఉంది.తాగి రండి అన్నారు
."నీవు వచ్చి నా పనిని చేస్తూ వుంటే నీకు తేనీటిని కాచి తెస్తాను అంది ఓ నడివయసు మహిళ దారాలు చిక్కులు తీస్తూ.. 
"ఎంత గర్వం మీకు.నేను రాజ్యానికి వెళ్ళగానే మీ అందరినీ బంధించి జైల్లో వేస్తా" అనగానే
ఇది మీ రాజ్యం కాదు మహారాజా మేం భయపడటానికి..ఇక్కడ మేమంతా పెద్దా చిన్నా తేడా లేకుండా అందరం కలిసి పనులు చేసుకుంటూ హాయిగా బతుకుతున్నాం.అని సమాధానం చెప్పేసరికి తన తప్పు తెలిసివచ్చింది రాజుకు.ఇక్కడ తన ఆజ్ఞలు చెల్లవని తెలిసి,తనే వెళ్లి నీళ్ళు తాగి వచ్చాడు.
ఇంతలో రాజును వెతుక్కుంటూ సుమంతుడు వచ్చే సరికి రాజు చిరునవ్వుతో దారాలు చిక్కులు తీస్తూ కనబడ్డాడు.
అయ్యో! మీరు ఇలాంటి పనులు చేయడమేమిటని సుమంతుడు బాధ పడుతుంటే.. వీళ్ళు నన్ను మార్చేశారు.అనువు గాని చోట అధికులమనరాదు"అనే సత్యం తెలిసి వచ్చింది" అంటున్న రాజును చూసి, రాజులో వచ్చిన  మంచి మార్పుకు చాలా సంతోషించాడు సుమంతుడు..
"బాగుందా బంగారూ కథ! అనగానే బాగుంది బామ్మా! నాకూ అర్థమయ్యింది.నేనిక ఏడవను.వాళ్ళు ఆడుతుంటే చూస్తా.పిలిస్తే ఆడుతా" అంటూ తువ్వాయిలా గంతులేస్తూ అక్కడినుంచి వెళ్ళిన మనవరాలిని తృప్తిగా చూసింది బామ్మ..