ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమరుడు కాళోజి : రామ్మోహన్ రావు తుమ్మూరి
September 9, 2020 • T. VEDANTA SURY • Poem

విప్లవ శంఖారావం కాళోజీ- చండ్ర
నిప్పుల ఘంటారావం కాళోజీ

నిండుతెలుగుజాతి వరం
నిఖార్సైన తెలుగు స్వరం
మనసంతా ప్రేమ జ్వరం
మనిషంతా ప్రజల పరం. /విప్లవ/

తెలుగు భాష రుచి చూపిన
తేనెపట్టు కాళోజీ
రాజ్యహింస నెదిరించగ
ఉడుము పట్టు కాళోజీ /విప్లవ/

ప్రజల గొడవ నాగొడవని
పల్లెపల్లె దిరిగినాడు
రాజకీయ రాకాసుల
ఎదలలోన ఉరిమినాడు /విప్లవ/

పుటుకనీది చావునీది
బతుకంతా దేశానిది
అని తానే అన్నమాట
కతనే ఋజువయ్యినాడు /విప్లవ/

ఎందరినెదిరంచినా
ఎనుబదేండ్లు వచ్చినా
అన్న చంక ఎక్కి దిగని
తమ్ముడు కాళోజీ. /విప్లవ/

తెలంగాణ కలలు గన్న
సాధువు కాళోజీ
తెలంగాణ పోరాటపు
యోధుడు కాళోజీ. /విప్లవ/

నమ్మిన సిద్ధాంతానికి
కట్టుబడిన వాడు
కల్లాకపటం ఎరుగని
కర్మయోగి అతడు. /విప్లవ/

తెలుగు వారి గుండెల్లో
అమరుడు కాళోజీ
తెలంగాణ నుడికారపు
భ్రమరుడు కాళోజీ