ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మమ్మ వూళ్లో బతుకమ్మ...: డా.హారిక.నాంపల్లి,--కరీంనగర్.
October 27, 2020 • T. VEDANTA SURY • Memories

నాకు అత్యంత ఇష్టమైన పండుగలలో బతుకమ్మ పండుగ  ఒకటి.సంప్రదాయాలకు పుట్టినిల్లయిన తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన స్థానం వుంది. అందులోనూ మా కరీంనగర్ జిల్లాలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటాము.
సాధారణంగా గవర్నమెంటు దసరా పండుగకు స్కూల్లకు ఎక్కువ సెలవులు ప్రకటిస్తుంది. అందుకే నా చిన్నతనంలో దసరా సెలవులు ఎపుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేదానిని. సెలవులు ప్రకటించగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేళ్ళేవాళ్లము.అమ్మమ్మ,తాతయ్య కూడా మేము పండుగకు ఎప్పుడు వస్తామా అని ఎదురు చూసేవాళ్ళు. పండుగ సెలవులు కావున పిన్ని వాళ్లు,తమ్ముళ్లు,చెల్లెళ్ల రాకతో ఇళ్లoతా సందడి వాతావరణం ఉండేది.
అలాగే అమ్మమ్మ పండగ సందర్భంగా గారెలు, కారప్పూస,లడ్డు వంటి పిండి వంటకాలు, బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా చేసే పెసర,బియ్యం,పల్లి,నువ్వులు,మొక్కజొన్న లతో రకరకాల సత్తుపిండిలు చేసేవారు. మరియు అమ్మమ్మ గారి ఇంట్లో మామిడి,జామ,రేగు,సపోట,సీతాఫలం వంటి రకరకాల పండ్ల చెట్లు వుండేవి.అది సీతాఫలాల సీజన్ అయినందున మేము వెళ్ళేసరికి కాయలను తెంపి,మాగబెట్టి ఉంచేవారు. ప్రతిరోజూ పిల్లలందరం  అన్నానికి బదులుగా సీతాఫలాలు,పిండి వంటకాలను ఆరగించే పనిలోనే ఉండేవాళ్ళం.
మా రాకతో ఆ వీధిలో వుండే స్నేహితులు కూడా చాలా సంతోష పడేవారు.అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడం వలన పిల్లలందరం కలిసి అక్కడ ఆడుకునేవాళ్ళము.మా స్నేహితులు కూడా వచ్చి మాతో చేరి ఆడేవారు.మాకు రోజంతా ఆటపాటలతో అనందంగా గడుస్తుండేది.
ఇక అమ్మమ్మ వంట పనిలో నిమగ్నమైతే; అమ్మ,పిన్ని వాళ్ళు పండుగ కోసం కొత్త బట్టలు కొనుగోలు చేయడం మరియు బతుకమ్మకు అవసరమైన గునుగు, పట్టుకుచ్చులు వంటి పూలను తీసుకొచ్చి బతుకమ్మకు కావాల్సిన  ఏర్పాట్లు చేసేవారు.
పండుగరోజు అందరం తెల్లవారుజామునే లేసి,స్నానాధికాలు ముగించుకొని, బతుకమ్మను పేర్చే పనిని మొదలు పెట్టేవాళ్ళము. పిల్లలందరం పూలను అందిస్తూ, వారు పేర్చడాన్ని గమనిస్తూ ఉండేవాళ్ళము. 
సాయంత్రం కాగానే అందరం కొత్త బట్టలు ధరించి,బతుకమ్మ ఆడడానికి తయారయ్యేవాళ్లం. అమ్మమ్మ వాళ్ల ఇంటి వాకిలి విశాలంగా వున్నందున చుట్టుపక్కల వాళ్లు అందరూ వచ్చి అక్కడే ఆడేవారు. అందులో అమ్మమ్మ పాడే బతుకమ్మ పాట ప్రత్యేకమైనది మరియు అందరూ అమ్మమ్మనే పాడమనేవారు. ఒక్కో పాట సుమారు గంటపాటు సాగుతుండేది.
పిల్లలందరం కాసేపు బతుకమ్మ ఆడుతూ,మరికాసేపు బంధువులు , స్నేహితులతో కలిసి టపాకాయలు కాలుస్తూ అల్లరి చేస్తుండేవాళ్ళం. ఈ క్రమంలో అల్లరి ఎక్కువైతే దెబ్బలు తిన్న సందర్భాలుకూడా ఉన్నాయి. 
రాత్రి కాగానే దగ్గరే ఉన్న చెరువుకు అందరం కలిసి వెళ్లేవాళ్లము. బతుకమ్మల నిమజ్జనం తర్వాత పెద్ద వాళ్లందరూ పసుపు బొట్టు , సత్తుపిండి వాయనాలు ఇచ్చి పుచ్చుకొనేవారు. పిల్లలందరం మాకు ఎపుడెపుడు పెడతారా అని ఎదురుచూసేవాళ్ళము. ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత అందరం కలిసి ఇంటికి వచ్చి భోజనాలు చేసేవారము.
మరుసటి రోజు దసరా పండుగ జరుపుకొనేవాళ్లము. ఆ రోజు సాయంత్రం జరిగే వేణుగోపాల స్వామి వారి రథోత్సవం ప్రత్యేకమైనది. ఊరి చివర ఉండే చెరువు దగ్గర జమ్మి కొమ్మను పాతి ఉంచేవారు. అక్కడికి స్వామి వారిని ఊరేగింపుగా తీసుకెళ్లేవాళ్లు. అక్కడ శమీ పూజ చేసి,అందరూ ఒకరికొకరు జమ్మి ఇచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని,రథంతో పాటు ఊరేగింపుగా దేవాలయానికి తిరిగి వెళ్లేవాళ్లు.
తర్వాత జమ్మి ఇచ్చి,శుభాకాంక్షలు తెలపడానికి అక్కడ ఉండే బంధుమిత్రులందరు వచ్చేవారు. మా తాతయ్య గారికి ఆ ఊర్లో మంచి వ్యక్తిగా పేరుండటం వల్ల ఆయనను కలవడానికి చాలామంది వచ్చేవాళ్లు. మేము కూడా పెద్ద వాళ్లందరికీ జమ్మి ఆకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకునేవాళ్లము.
ఇలా పండుగ రోజులు చాలా అనందంగా గడిచిపోయేవి.
పండుగ తర్వాత సెలవులు ముగియనుండడంతో అమ్మమ్మ వాళ్ల ఇంటి నుండి వెళ్ళిపోవడానికి బెంగగా వుండేది.కానీ తప్పనిసరి పరిస్థితుల్లో, మళ్ళీ సంక్రాంతి సెలవులు ఎపుడొస్తాయా అని అనుకుంటూ, ఎవరి ఇళ్లకు వాళ్లము వెళ్ళిపొయేవాళ్లము.
ఈ విధంగా మా బాల్యం అనేక మధుర స్మృతులతో గడిచిపోయింది.
ఈ క్రమంలో పై తరగతులకు వెళ్తున్నకొద్దీ, చదువుల ఒత్తిడిలో పడి అక్కడికి వెళ్ళి ఉండలేకపోయినా, ఏ మాత్రం అవకాశం వున్నా ఒకటి, రెండు రోజులైనా వెళ్ళి వస్తుంటాము.