ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మా,----నేను ఎక్కడ ఉన్నానో తెలీడం లేదు. నా చుట్టూ నీరే. అంటే నేను నీటిలో ఉన్నాననే నుకుంటున్నాను. ఆ నీటిలో నేను తేలియాడుతూనే ఉన్నాను. కళ్ళను తెరచి చూడలేకపోతున్నాను. కానీ కళ్ళు తెరచి చూడాలనే ఆరాటం మాత్రం తగ్గ లేదమ్మా. నా పొట్టలో నుంచి ఏదో ఓ తాడు లాంటిది కట్టి ఉంది. అది దేనికి కట్టబడి ఉందో అర్థం కావడం లేదు. నీకు తెలిస్తే చెప్పమ్మా.... ఆ తాడులాటిదాన్ని పట్టుకుని నేను అటూ ఇటూ ఊగుతున్నాను. ఇక్కడ ఎటువంటి శబ్దమూ వినిపించడం లేదు. చాలా కాలంగా ఒకటే శబ్దం వినిపిస్తోంది. అది గుండె చప్పుడు. అదెలా తెలిసిందంటావా...నువ్వు నాకు రహస్యంగా చెప్పినట్లే అనిపిస్తోంది. అప్పుడప్పుడూ నన్ను ఎవరో వెతుకుతున్నట్లు, నాతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఆ వెతుకులాటలోని స్పర్శ, మాటా ఎంత మృదువుగా ఉందో తెలుసామ్మా....వెచ్చగా గొప్పగా అనిపిస్తుంటుంది. ఏదో తెలియని ఆనందం. ఆ మాటకు ఏదో జవాబు చెబుతన్నట్లు చాలా సార్లు చేతులూ కాళ్ళూ కదుపుతుంటానమ్మా.అప్పుడప్పుడూ మరొక గొంతు కూడా వినిపిస్తుంటుంది. కానీ అది కాస్త మోటుగా అనిపిస్తుంటుంది. ఎన్ని రకాల శబ్దాలు వినిపిస్తున్నా ఎప్పుడూ మారకుండా ఉండేది గుండె చప్పుడే. అది ఎక్కడి నుంచి వస్తుందో ఏదో ఒక రోజు కచ్చితంగా చూసి తీరాలమ్మా....ఏమిటో తెలీడం లేదమ్మా. రెండు మూడు రోజుల నుంచి బయటకు వచ్చెయ్యాలనిపిస్తోంది. కాళ్ళూ చేతులూ ఎంతగా కొట్టుకుంటున్నా ఎప్పుడు బయటకు వచ్చెస్తానో తెలీడం లేదు. నా ప్రయత్నానికి ఎప్పుడు జవాబు లభిస్తుందో తెలీలేదమ్మా. నీకేదన్నా తెలిస్తే చెప్పమ్మా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. కొంతకాలంగా నేనుంటున్న చోటు మారుతూనే ఉంది. ఎటో అటు కదులుతోంది. నేను తలకిందులుగా మారిపోయాను. ఆ గుండె చప్పుడు కూడా మెల్లమెల్లగా తగ్గుతోంది. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మరెక్కడికో పోబోతున్నానని అనిపిస్తోంది. నీకేదన్నా తెలిస్తే చెప్పమ్మా నేను ఎక్కడికి పోబోతున్నానో అని. ఏదో తెలీని భయమమ్మా. నాకు వినిపిస్తూ వచ్చిన ఆ మృదునైవ గొంతు ఇప్పుడు నొప్పులతో అరుస్తోందమ్మా. ఎందుకో నాకు కష్టంగా ఉంది. ఆ బాధంతా నా వల్లే కదమ్మా నీకు. పొట్టలో ఉన్నప్పుడే నా వల్ల ఆ ప్రాణం ఎంతగా కష్టపడుతోందో కదమ్మా. నేనే నా చేతులూ కాళ్ళతో ఆ ప్రాణాన్ని కొడుతున్నానని బాధగా ఉందమ్మా. ఉన్నట్లుండి నేను ఈ నీటి తొట్టికి చిల్లు పడిందమ్మా. ఎన్ని పరీక్షలో.... నీటితో కొట్టుకుని పోతున్నానమ్మా. ఎటంటావు... అలా నీటికి కొట్టుకుపోతున్న నేను మధ్యలో ఎక్కడో చిక్కుకున్నానమ్మా....ఎవరో నా తలను పట్టుకుని లాగుతున్నారమ్మా....అదే సమయంలో ఆ గొంతు ప్రాణంపోతున్నంతగా అరస్తోంది. నాకు బాధ కలుగుతోందమమ్మా....పాపం కదమ్మా... ఎట్టాగో చివరికి నేను బయటకు వచ్చేసానమ్మా....నాకు ఆ ప్రపంచంతో ఉన్న చివరి బంధమైన ఆ తాడును కత్తిరించేశారమ్మా.ఇన్ని రోజులూ నేను వింటూ వచ్చిన గుండె చప్పుడు పూర్తిగా ఆగిపోయిందమ్మా. ఏడ్చిన ఆ గొంతూ వినిపించలేదమ్మా. అది నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. మొదటిసారిగా నోరు తెరచి ఏడుస్తున్నానమ్మా. కానీ నా చుట్టూ ఉన్న వారందరూ నన్ను చూసి నవ్వుతన్నారమ్మా ఆనందంగా.అప్పుడు తెలిసిపోయిందమ్మా....ఇదొక సిగ్గు లేని ప్రపంచమని. నీటిలో స్నానం చేయస్తున్నారు. కానీ ఏడుస్తున్నాను. ఏదో గుడ్డలో చుట్టి అందరికీ నన్ను చూపిస్తున్నారు. నా నడుం కింద ఉన్నదేదో చూసి అందరూ నవ్వుతున్నారు. నాకు కోపం వచ్చిందమ్మా. కానీ ఏడుస్తున్నాను. వాళ్ళు మాత్రం నన్ను పదే పదే ముట్టుకుంటూ పళ్ళు ఇకిలిస్తున్నారు. ఆ గుండె చప్పుడూ, మృదువైన మాట నాకు వినిపించలేదు. దాంతో ఈ ప్రపంచం నాకు నచ్చలేదమ్మా. నన్ను తీసుకుపోయి ఎవరి పక్కనో పడుకోపెట్టారు. నేను ఏడ్పు ఆపేశాను. కారణం ఆ గుండె చప్పుడు నాకు మళ్ళీ వినిపించడం మొదలైందమ్మా. చేతులతో నన్ను స్పృశిస్తున్నారు. అవును, నా ప్రపంచంలో ఉన్నప్పుడు పొందిన అనుభూతేనమ్మా అది. వారిలాగానే ఉన్నాను కదూ....అని మాటలు వినిపించినప్పుడు ఆ గొంతులోని అదే మృదుత్వాన్ని అనుభవించానమ్మా. అదెవరో చూసెయ్యాలని తహతహ. కానీ చేతులూ కాళ్ళూ మాత్రమే కదపగలుగుతున్నాను. తిరగలేకపోతున్నాను. ఎలాగైనాసరే చూడాలని అనుకుంటున్నప్పుడు రెండు చేతులు నన్ను ఎత్తుకుందమ్మా. తన ముఖానికి నేరుగా ఉంచిందమ్మా. మరణం వరకూ వెళ్ళి వచ్చిన బాధకు మధ్య ఆనందం నిండిన నవ్వుని ఆ ముఖాన చూసానమ్మా. ఆ ముఖాన చూసినప్పుడు నాలో కలిగిన సంతోషాన్ని పరవశాన్ని వివరించడానికి ఏ భాషాలోనూ మాటలు లేవమ్మా.అది నా తల్లి అని తెలుసుకున్నాను. కానీ ఎందుకో నేను ఏడుస్తూనే ఉన్నాను. నేను ఏడ్చినప్పుడు అమ్మ మాత్రం నవ్వుతోంది. నాకు కోపం వచ్చింది. కానీ నాకప్పుడు తెలీలేదమ్మా. నా మొత్తం జీవితంలో నా ఏడుపు చూసి నా తల్లి నవ్విన ఆ ఒక్కరోజే అప్పుడు మాత్రమేనమ్మా....- యామిజాల జగదీశ్
June 26, 2020 • T. VEDANTA SURY • Story