ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అలా అనుకుంటే నేనేం చేయనూ: --- యామిజాల జగదీశ్
November 10, 2020 • T. VEDANTA SURY • Story

ముల్లాకి ఓ గాడిద ఉంది. ఆ గాడిదే అతని వాహనం. దానిమీద స్వారీ చేస్తూ పనులు కానిచ్చుకుంటాడు.

ఎప్పట్లాగే ముల్లా గాడిదమీద బయలుదేరాడు. దారిలో ఒకడు "ముల్లా! ఎటు పోతున్నావు?" అని అడిగాడు.

ముల్లా జవాబివ్వలేదు.

సాయంత్రం తిరిగొస్తున్నప్పుడూ ముల్లాని అతను అడిగాడు "ఎక్కడికెళ్ళొస్తున్నావు?" అని.

ముల్లా బదులివ్వలేదు.

ఇలా రెండు మూడు రోజులైంది. 

ఓ రోజు ముల్లా నడుచుకుంటూ వస్తుండగా ఆ మిత్రుడు ముల్లాను చూడటంతోనే "ఏంటీ నీకీ మధ్య పొగరెక్కువైంది? ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే జవాబే ఇవ్వలేదు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు....మూడు రోజులుగా అడుగుతున్నా నీ నుంచి జవాబే లేదు. ఏంటి నీ వాలకం?" అని నిలదీశాడు.

అప్పుడు ముల్లా చాలా ప్రశాంతంగా "నాకు పొగరని నువ్వనుకుంటే నేనేమీ చేయలేను. అసలు నా గాడిద మీద నేనెక్కడికి పోతున్నానో నాకే తెలీదు. అటువంటప్పుడు నీకు నేనేం చెప్పాలి ఎటు పోతున్నానో అని...." అన్నాడు.

"అదేంటీ, నీకు తెలీకుండానే ఇంట్లో నుంచి బయలుదేరేవా?" అడిగాడు మిత్రుడు.

"నిజమే. నేనొక చోటుకి అనుకునే బయలుదేరుతాను. కానీ నేనక్కడికి వెళ్ళలేను. కారణం నా గాడిదే. అది బొత్తిగా నా మాట వినదు. నేను రైల్వే స్టేషన్ వరకూ వెళ్ళాలనుకుంటాను. అదేమో బస్టాండుకి పోతుంది. నేను బస్టాండుకి పోదామనుకుంటే అది రైల్వే స్టేషన్ వరకూ తీసుకుపోతుంది. అందుకే అది ఎక్కడికి తీసుకుపోతే అక్కడ నా పనులు కానిచ్చుకుంటాను. అంతా దానిష్టమే" అన్నాడు ముల్లా.

"అవునా? నీ మాట వినని గాడిదనెందుకు భరించడం. దానిని అమ్మేసి మరొకటి కొనొచ్చుగా?" అడిగాడు మిత్రుడు.

అంతట ముల్లా "సరేగానీ, నేనొకటి అడగనా?" అన్నాడు ముల్లా.

"అడుగూ" చెప్పాడు మిత్రుడు.

"అన్నట్టు నీ పెళ్ళాం నీ మాట వింటుందా?" అడిగాడు ముల్లా. 

"వినదు. ఏం చేయను?" జవాబిచ్చాడు మిత్రుడు.

"మరి మాట వినని భార్యనెందుకు భరించడం? ఆమెను అమ్మేసే...." అని సలహా ఇచ్చాడు.

"అదెలా కుదురుతుంది?" అడిగాడు మిత్రుడు.

ముల్లా "నా పరిస్థితీ అదే. నువ్వన్నట్టు ఈ గాడిదను అమ్మేసి కొత్తది కొన్నాననుకో. అదీ నా మాట వింటుందని గ్యారంటీ ఏమిటీ?" అడిగాడు.

మిత్రుడు మరొక మాట మాటాడితే ఒట్టు.