ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అలా కూర్చుని ఉన్నా.- మల్లిక పూలగుర్త ఉన్న బాధ్యతలను పక్కకు నెట్టి, లేని బాధలను వొడిలోకి తెచ్చుకుంటూ. బండెడు సంతోషాలను మూసేయగల, సన్నటి బాధ పొరను అల్లి కప్పుకుని ఉన్నా. చుట్టూ జరిగే విషయాలేవీ అక్కర్లేదని, తెచ్చుకున్న నా చిరాకుబాధలలో మునిగిపోయాను. ఏవో చప్పుళ్ళు, మాటలు, హడావిడి. చప్పుళ్ళు కళ్ళను, మాటలు చెవులను, హడావిడి దృష్టిని, ఒక్కొక్కటిగా ఇంటి బయటకు బలవంతంగా లాగాయి. మా ఎదురింటి పిల్లాడు కనపడ్డాడు ఆ చప్పుళ్లేమో తాను మా ఇంటి గేటు కదుపుతున్న చప్పుడు, ఆ మాటలేమో ' గేతేచుకో ' అనే తన ముద్దు హెచ్చరికలు, ఆ హడావిడేమో ఆ రెండడుగుల పిల్లాడు, పదడుగుల మా గేటు వేయడానికి పడుతున్న తపన, పాట్లు. చాలా ఆలస్యంగా తన ' గేతేచుకో ' వెనుక, ' గేటు వేసుకో ' అన్న మాటలు ఉన్నాయని గ్రహించాను. అదేదో తన బాధ్యత అయినట్టు, నాతో మీ గేటు తెరిచేసుంది, వేసుకోమని చెప్పి దానితో పాటు, తెర వెనుక సృష్టించుకున్న బాధలను వదిలి, నా ముందున్న బాధ్యతలను చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు!
July 28, 2020 • T. VEDANTA SURY • News