ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అల్లరి కోతి:--డా.. కందేపి రాణీప్రసాద్.
November 18, 2020 • T. VEDANTA SURY • Story

అనగనగా ఒక కోతి. దాని పేరు పండు. కోతి అంటేనే అల్లరి కదా! అందులోనూ ఇది చిన్నపిల్ల. ఇంకా అల్లరి ఎక్కువ. ఇది మంచి, ఇది చెడు అన్న విచక్షణ ఉండదు. ఎప్పుడు ఆకతాయి పనులే. ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని ఆటపట్టిస్తుంటుంది. అలా ఆట పట్టించటంలో అవతలివారు బాధపడిన పట్టించుకోదు. జరిగే నష్టం గురించి కూడా తెలియదు. అందుకే స్కూళ్లల్లో, కాలేజీల్లో ఆకతాయి పనులు చేసేవారికి కోతిమూక అని పిలుస్తారు.
 ఈ పండు ఒక మామిడి చెట్టు మీద నివాసం ఉంటుంది. దారినపోయే వాళ్ళను గిల్లడమో, తొయ్యడమో ఏదో ఒకటి చేస్తుంటుంది. గబగబా చేట్లెక్కుతుంది. మరలా అక్కడ్నుంచి దూకుతుంది. కొమ్మల్ని ఊపి పుతంతా రాల్చెయ్యడమో, ఆకుల్ని తెంపడమో, పండ్లను కొరికి పారెయ్యడమో చేస్తూ ఉంటుంది. దీని అల్లరికీ అంతే లేదు. ఉడుత వెళ్తూ ఉంటే దాని తోక పట్టుకొని లాగింది. అది వెనక్కి తిరిగి చూసేసరికి ఇది ఎటో చూస్తూ నిలబడింది. ఉడుత వెళ్లిపోయింది. పిచ్చుకలు తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చి చల్లగాలికి ఆదమరచి నిద్రపోతుంటే ఆకునొకదాన్ని తీసుకొని వళ్లంతా గిలిగింతలు పెడుతుంది. దాంతో అవి ఉలిక్కిపడి నిద్రలేవగానే హిహ్హిహ్హిహ్హి అంటూ నవ్వి వెళ్లిపోయేది.
 ఆ చెట్టు మీద ఒక కాకి పుల్లలతో ఒక గూడు కట్టుకుంది. ఆ గూట్లో దాని గుడ్లను పెట్టుకొని జాగ్రత్తగా వేయి కళ్ళతో కాపాడుకుంటున్నది. ఆహారం కోసం బయటకు వెళ్ళినా మాటిమాటికి వచ్చి చూసుకుని పోతూ ఉండేది.
 రోజులాగే పండు ఆ చెట్టుక్కున్న పళ్లు తెంపి కోరుక్కు తింటూ మరికొన్ని కింద పారబోస్తూ, పైకి క్రిందికి ఎగురుతూ ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదికి ఉయ్యాలలూగుతూ, రెండు చేతుల్తో కొమ్మని పట్టుకొని వేలాడుతూ ఉంది. పండు దూకుళ్లకు కొమ్మ మీదున్న కాకి గూడు కదిలిపోయి దాంట్లో ఉన్న గుడ్లు కింద పడ్డాయి. అంతా ఎత్తునుంచి కింద పడటం వలన గుడ్లన్ని పగిలిపోయాయి. ఏదో శబ్దం వచ్చిందని కోతి కిందకి చూసి ‘ఆ ఏముందిలే’ అనుకుంటూ ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా వెళ్లిపోయింది మరో చెట్టు మీద ఊయలూగటానికి.
 కాకి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గుడ్లన్ని పగిలిపోయి ఉన్నాయి. అది చాలా బాధపడింది. కన్నీరు మున్నీరుగా ఎడ్చింది. ‘ఎలా జరిగింది’ అనుకున్నది. ఉడత వచ్చి జరిగిన విషయం చెప్పింది. ఈ పండుగాడి ఆగడాలకు అంతేలేకుండా పోయింది. ఎలాగైనా దీనికి బుద్ది చెప్పాలనుకుంది కాకి. సమయం కోసం వేచి చూడసాగింది.
 కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టుకు తేనెటీగలు తేనె పట్టును పెట్టాయి బాగా పెద్దదయింది తేనెతుట్టె. ఒకరోజు కోతి మద్యాహ్నం వేళ కొమ్మపై తలాన్చి నిద్రపోతుంది. ఇక చెట్టు మీద ఎవరు లేరు. ఇదే మంచి సమయమని తలచి కాకి మెల్లగా వెళ్ళి తేనె తుట్టెను కడిపింది. తేనె తయారీలో ఉన్న తేనెటీగలు తమ పనికి ఆటంకం కలగడంతో కోపంతో పైకి లేచాయి. ఎదురుగా కొమ్మ మీద నిద్రపోతున్న కోతి కనిపించింది. ఎప్పుడూ ఈ పండునే అందర్నీ విసిగిస్తుంటుంది. ఇప్పుడు మన పని మధ్యలో కూడా ఈ కొతే అడ్డు తగిలి ఉంటుందనే కోపంతో అన్నీ కలసి దాని మీద దాడి చేశాయి. కోతి నిద్రపోతూ ఉండటంతో రాబోయే ప్రమాదాన్ని గ్రహించలేకపోయింది.
 ఒక్కసారిగా తేనెటీగలు తన మీదికి దాడి చేసే సరికి పండు ఉక్కిరిబిక్కిరైంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఒళ్ళంతా వాతలు తేలిపోయింది. ఒళ్ళంతా కారం రాసినట్లు మంటలు, పోట్లు పుట్టసాగాయి. లబోదిబోమంటూ అడవి అంతా ప్రతిధ్వనించేలా ఏడ్వసాగింది. ఎవరూ సహాయం చేయలేదు. పైగా అయ్యోపాపం అని కూడా అనలేదు. దీనికి తగిన శాస్తి జరిగింది అని ఎవరి మనసులో వారు అనుకున్నారు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి పలకరించేవాళ్లు లేక అలాగే పడుకొని నిద్రపోయింది. ఒళ్ళంతా మంటలు వల్ల ఆహారం కూడా తెచ్చుకోలేక పోయింది. శరీరం కదిలించే స్తితిలో లేదు. ఆ రాత్రికి అలాగే పడుకుంది. నిద్రపోతూ తన మనసులో ఇలా నిర్ణయించుకున్నది. “రేపటి నుంచి ఎవరిని బాధ పెట్టకూడదు” అని.
 పిల్లలూ! చూశారుగా సరదాగానైనా ఎవరినీ ఏడిపించకూడదు. సరేనా!