ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అవహేళన: --డా.. కందేపి రాణీప్రసాద్.
November 15, 2020 • T. VEDANTA SURY • Story

మా తరగతిలో అఖిల్ అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయంటే చాలా ఇష్టం నాకు. చాలా మంచివాడు. నిదానంగా ఉంటాడు. మా క్లాసులోని మిగతా స్నేహితుల్లా ఈర్ష్య పడకుండా ఉంటాడు. నాకు ఫస్ట్ర్యాంకు వస్తే ఆనందంగా చప్పట్లు కొడతాడు. తాను బాగా చదవలేడు. ఎప్పుడు 70 శాతం దాటవు మార్కులు. అయిన నాకిష్టమే. టీచర్ల దగ్గర పక్క పిల్లల మీద హితురీలు చెప్పాడు. తన లోకంలో తనుంటాడు.
 పెన్సిళ్లు, రబ్బర్లు, షార్పెనర్లు బయటకు తీసి వాడుకున్న వెంటనే బ్యాగులో పెట్టుకోడు. పక్క పిల్లలు పుస్తకాలు అడిగితే వెంటనే ఇచ్చేస్తాడు. మరలా తెచ్చిచ్చారా లేదా అని గుర్తు పెట్టుకొని అడగడు. ఇంటికి వెళ్లేటపుడు అన్నీ పుస్తకాలు, పెన్సిళ్లు బ్యాగులో పెట్టుకోవడం మర్చిపోతుంటాడు.
అందుకని టీచర్లు అందరూ వీడిని అమాయకూడని అంటుంటారు. దీన్ని అలుసుగా తీసుకొని మా ఫ్రెండ్స్ వాడి పుస్తకాలు పెన్సిళ్లు కొట్టేస్తూ ఉంటారు. అయినా వాడికది అర్థం కాదు. నేనున్తే మాత్రం వాడి పుస్తకాలు, పెన్సిళ్లు బ్యాగులో సర్దేసి పెడతాను. ఇంకా ఎవరూ దొంగిలించకుండా కూడా చూస్తుంటాను. ఎందుకంటే మంచి స్నేహితులకు సహాయం చేయాలని మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది.
 నాకు జ్వరం వచ్చి నిన్న స్కూలుకు రాలేదు. ఈరోజు వచ్చాను. ఈరోజు లంచ్ అవర్లో అఖిల్ వాళ్ల అమ్మ వచ్చింది. నిన్న అఖిల్ పాట్య పుస్తకాలు పోయాయట అడగటానికి వచ్చింది.
 ‘మా అఖిల్ పుస్తకాలు స్కూల్లోనే ఉండిపోయాయండి కొంచెం చూసి ఇవ్వండి’ అని ఆమె మాస్టారును అడిగింది. మా మాస్టారుకు బాగా చదవని వాళ్ళంటే ఇష్టం ఉండదు. ఆయనకసలే ర్యాంకుల పిచ్చి, ర్యాకులు వచ్చిన వాళ్లనే తెలివిగల వాళ్లంటూ పొడుగుతాడు.
 ‘ఇంకా ఎక్కడుంటాయమ్మా! బ్యాగులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడు. అసలే మందమతి. మేం కాబట్టి స్కూల్లో చేర్చుకున్నాం గాని వేరే స్కూల్లో అయితే చేర్చుకునే వల్లే కాదు” అని కాస్త అసహనంగా అన్నాడు.
 ఆ మాటలకు అఖిల్ వాళ్ళమ్మకు కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి. వెంటనే తెరుకుని “ మా అబ్బాయి తెలివి తక్కువ వాడయి పుస్తకాలు పారేసుకుంటే మాకు నష్టం కానీ మీకేం కష్టం. మా అబ్బాయి పుస్తకాలు ఇప్పించండి సార్” అన్నది.
 ‘మీరు భలే వారమ్మా! ఎవరైనా పుస్తకాలు మరిచిపోతే ఇంకా అక్కడే ఉంటాయా? ఎవరో తీసుకెళ్లి ఉంటారు. వాళ్లేమైన మీ అబ్బాయి లాగా మందమతులా?’ కాస్త అవహేళనగా అన్నాడు మాస్టారు.
 అప్పుడు అఖిల్ వాళ్లమ్మ ఇలా ‘చూడండి మాస్టారూ! విద్యార్థులకు మంచి చేదులు నేర్పించాల్సిన మీరే ఇలా మాట్లాడుతున్నారు. మా అబ్బాయిని మందమతని, తెలివి తక్కువవాడని, తన వస్తువులు తాను తీసుకెళ్లటం మరిచిపోతాడని ఎగతాళి చేస్తున్నారు. ఇలాంటి తెలివి తక్కువ వాళ్లు తమ వస్తువులను పోగొట్టుకుంటారు తప్ప, మీరు పొగుడుతున్న తెలివికల వాళ్లలాగా ఇతరుల వస్తువులను తీసుకెళ్లరు. మా అబ్బాయిలాంటి వారి వల్ల సమాజానికి ఏమి నష్టం కలగదు. కానీ పక్క పిల్లల వస్తువులను తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్న పిల్లల వల్ల సమాజనికి చాలా నష్టం. రేపు వాళ్ళు దొంగలుగానో, లంచగొండులుగానో, అవినీతిపరులుగానో తయారవుతారు. మా అబ్బాయిని ఎగతాళి చేయడం మాని మిగతా పిల్లల్ని మంచి దారిలో పెట్టె ప్రయత్నం చేయండి. మాస్టారంటే పిల్లలకు మార్గ నిర్దేశకుడిగా ఉండాలి గాని పిల్లల్లోని అవకారాలను ఎత్తి పొడవడం కాదు. మీలాంటి మాస్టార్లున్న ఈ స్కూలులో మా అబ్బాయిని నేను చదివించను’ అంటూ ఆమె అఖిల్ ను తీసుకొని వెళ్లిపోయింది.