ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అవి చదవకు:-- యామిజాల జగదీశ్
November 23, 2020 • T. VEDANTA SURY • News

అవి విజయవాడలో గుడిపాటి వెంకటచలంగారు ఉన్న రోజులు. 

ఓరోజు అబ్బూరి వరదరాజేశ్వరరావుగారు 
చలంగారిని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడికి చింతా దీక్షితులుగారు కూడా వచ్చారు. అప్పటికే చింతావారికి చలంగారితో సాన్నిహిత్యముంది. 

చింతా దీక్షితులను పరిచయం చేస్తూ ఆయన కథలు చదవమని చలంగారు వరద రాజేశ్వరరావుగారితో చెప్పారు. దీక్షితులుగారు మంచి కథకులనీ అన్నారు.

అదలా ఉంటే, అప్పట్లో అబ్బూరివారికి చలంగారి సాహిత్యంకన్నా చలంగారే ముఖ్యులుగా తోచారు. 

వెంకటచలంగారు చలంగారిగా కాని కాలం. అప్పట్లో అందరూ ఆయనను వెంకటచలం అనే పిలిచేవారు. 

రోజులు గడిచే కొద్దీ అబ్బూరివారికి చలంగారి రచనలు చదవాలనే కోరిక కలిగింది. చలంగారు ఏ పత్రికలలో రాస్తున్నారో ఆయనకు తెలీదు. 

ఓరోజున ఆయన సౌరీస్ ని అడిగారు "మీ నాన్న ఏ పత్రికకు రాస్తారని, చదివేవా" అని.

"అయితే నాన్న ఎందులో రాస్తున్నారో నాకూ తెలీదు. కనుక్కుని చెప్తాను" అన్నారు సౌరీస్.

ఓరోజు సాయంకాలం అబ్బూరివారు చలంగారితో షికారుకెళ్ళారు. 

ఇద్దరి మధ్య మాటలు సాగాయి. 

"ఇకనుంచి మనం పద్యాలు మానేసి పాటలు రాద్దాం" అన్నారు చలంగారు.

అయితే అబ్బూరివారు తనకు పాటలు రాయడం రాదన్నారు.

కానీ చలంగారు "ఎందుకు రావూ. ప్రయత్నిస్తే అవే వస్తా"యన్నారు నవ్వుతూ.

ఇదే తగిన సమయమనుకుని అబ్బూరివారు "మీరు పత్రికలకు రాస్తుంటారట కదా? నాకు చదవాలని ఉంది" అన్నారు.

అయితే చలంగారు "తెలుగులో కథలు నవలలూ చదవద్దు. పద్యాలు చదువు" అని సలహా ఇచ్చారు.

చలంగారెందుకు అటువంటి సలహా ఇచ్చారో అబ్బూరివారికి అర్థం కాలేదు.