ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆత్మవిశ్వాసం మితిమీరితే (కథ). రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
November 19, 2020 • T. VEDANTA SURY • Story
జూన్ నెలలో పాఠశాలలు పునః ప్రారంభం అయినాయి. వారం రోజులు గడిచాయి. ఆరోజు 9వ తరగతిలో అందరు విద్యార్థులు హాజరయ్యారు. తరగతి ఉపాధ్యాయులం వేంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ "ఇన్ని సంవత్సరాలు మీరు చదివింది ఒక ఎత్తు ‌ ఇప్పటి నుంచి చదివేది ఒక ఎత్తు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలంటే 9వ తరగతి ప్రారంభం నుంచే అతి శ్రద్ధగా చదవాలి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి కష్టపడితేనే రెండో సంవత్సరం పూర్తి అయ్యాక రెండు సంవత్సరాలు కలిపి మంచి మార్కులు సాధిస్తారు. 9వ తరగతి అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో సమానం. 10ప తరగతి అంటే ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంతో సమానం. 9వ తరగతి సిలబసుకు 10వ తరగతి సిలబసుకు చాలా సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే 10వ తరగతితో పోల్చితే 9వ తరగతి లోనే కొంత ఎక్కువ సిలబస్ ఉంటుంది. కాబట్టి 9వ తరగతిలో ఇప్పటి నుంచే బాగా కష్టపడి చదవండి. దాని కోసం శ్రద్ధగా ఏకాగ్రతతో చదవండి." అన్నారు. అందరూ అలాగే గురువు గారూ అన్నారు. 
 
     అప్పుడే అక్కడికి వచ్చిన ప్రధానోపాధ్యాయులు ఇదంతా విన్నారు. వారూ లోపలికి వచ్చాక విద్యార్థులతో ఇలా అన్నారు. "మనం ఉపాధ్యాయులు చెప్పే విషయాలు విని కేవలం తల ఊపి వదిలేయడం కాదు. ఆచరణలో పెట్టాలి. ముఖ్యంగా ఈ తరగతిలోనో విద్యార్థులకు పోటీతత్వం లేదు. మొదటి ర్యాంకు విద్యార్థి మార్కులకు, రెండవ ర్యాంకు విద్యార్థి మార్కులకు కనీసం వంద మార్కులైనా తేడా ఉంటుంది. మొదటి ర్యాంకు విద్యార్థి విజయేంద్ర కూడా చదువును తేలికగా తీసుకుంటున్నాడు." అన్నారు. అప్పుడు విజయేంద్ర లేచి "ఆచార్యా! 6వ తరగతి నుంచి ఇప్పటి వరకు నేనే మొదటి ర్యాంకు కదా! మరి అలా అంటున్నారేం?" అని అడిగాడు. 
 
       అప్పుడు వేంకటేశ్వర్లు గారు కలుగజేసుకొని "నీకు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మార్కులు 480 - 500 మధ్యనే వస్తున్నాయి. గొర్రె తోక బెత్తెడే అన్నట్లు ఆ మార్కులు పెరగవు, తగ్గవు. నీకు సరైన పోటీ లేక చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు‌." అన్నాడు. "నేను బాగానే కష్టపడుతున్నా గురువు గారూ! నేనెప్పటికీ నంబర్ వన్. 10వ తరగతి అయిపోయే వరకూ మార్కులలో నన్ను ఎవ్వరూ ఓడించలేరు." అన్నాడు విజయేంద్ర. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ "విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు అవసరం. దాని కోసం మనం పిల్లలకు అవసరమైన విషయాలను చెప్పడానికి, కథలు చెప్పి, చెప్పించడానికి, నీతి కథలను చదివించడానికి, రాయించడానికి వారానికి 3 అయినా ప్రత్యేక పీరియడ్స్ కేటాయిద్దాం. అటు విద్యార్థులకు మంచి గుణాలు అలవడుతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి, చదువు మరింత వృద్ధి చేసుకుంటారు." అన్నారు. అలా చెప్పి ఆఫీస్ రూముకు వెళ్ళిపోయారు.
 
      అప్పుడు వేంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ "విజయేంద్రా! నీకు కుందేలు తాబేలు పరుగు పందెం కథ తెలుసుగా!" అన్నారు. "అవన్నీ కాలక్షేపానికి చెప్పే కథలండీ! అయినా జంతువులు మాట్లాడుకోవడం ఏమిటి? కుందేలును తాబేలు ఎక్కడా ఓడించలేదు." అన్నాడు విజయేంద్ర. "జంతువులు మాట్లాడవు. కానీ జంతువులను పాత్రలుగా చేసి, మానవ స్వభావాన్ని, మానవులకు నీతిని చెప్పడం చాలా మంది కథకులకు పరిపాటి. నువ్వు కుందేలులా నన్ను ఎవరూ ఓడించలేరని విర్రవీగితే నువ్వు తప్పకుండా ఎవరి చేతిలోనో ఓడిపోతావు." అన్నాడు మాస్టారు. "సరే చూద్దాం గురువు గారూ!" అన్నాడు విజయేంద్ర.
 
       తమ తరగతి వెనుకబడింది అనే అపకీర్తిని తొలగించాలని అనుకుంది శారద అనే అమ్మాయి. 9వ తరగతి నుంచే కష్టపడాలి అని చెప్పిన గురువు గారి మాటలకు ప్రభావితురాలు అయింది. స్నేహితురాళ్ళు అయిన శ్రీలక్ష్మి, శివాని, అలివేలు తదితరులతో సమావేశం అయింది. "మనమంతా సెల్ ఫోన్, కంప్యూటర్, టి. వి. అనే వ్యసనాలకు ఈ రెండు సంవత్సరాలు దూరంగా ఉందాం. ఒక సమూహంగా పట్టుదలతో చదువుదాం. ఎక్కడ ఏ అనుమానం వచ్చినా గురువుల వద్ద నివృత్తి చేసుకుందాం. ఒకరికొకరు చర్చించుకోవడం ద్వారా మన చదువును వృద్ధి చేసుకుందాం. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన తరగతిలో టాప్ నుంచి వరుస ర్యాంకులు మనవే కావాలి. సరేనా?" అంది. వారంతా ప్రాణ స్నేహితులు. సరేనన్నారు. 
 
        9వ తరగతి వార్షిక పరీక్షల్లో శారదకు 510 మార్కులు రాగా విజయేంద్రకు 497 వచ్చాయి. శారద స్నేహితురాళ్ళకు 470 - 495 మధ్య వచ్చాయి. విజయేంద్ర తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. "నాయనా విజయా! వచ్చిన మార్కులతో ఎప్పుడూ తృప్తి చెందవద్దురా! మరింత పట్టుదలతో చదివి మార్కులు పెంచుకోవాలిరా! ఎప్పుడూ మార్కులలో నీ దరిదాపుల్లోకి కూడా రాని అమ్మాయిలు నీకు గట్టి పోటీ ఇచ్చారు." అన్నది తల్లి. "అమ్మా! వాళ్ళ సంగతి నీకు తెలియదు. పరీక్షలలో అందరివీ దగ్గర దగ్గర నంబర్లు. ఒక్కో సబ్జెక్టులో తలా కొన్ని పాఠాలు క్షుణ్ణంగా చదివి, ఒకరి దాంట్లో మరొకరు చూసి రాసుకున్నారు. చూడు కావాలంటే పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో వారంతా నా చేతిలో ఎంత చిత్తుగా ఓడిపోతారో." అన్నాడు. 
 
        పదవ తరగతిలో తల్లిదండ్రులు, గురువులు ఎంత చెప్పినా విజయేంద్ర మారలేదు. శారద బృందం మరింత పట్టుదలతో చదువసాగారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఆ స్నేహితురాళ్ళు అంతా 10కి 10 జి. పి. ఎ. పాయింట్స్ సాధించారు. విజయేంద్ర కేవలం 9.2 మాత్రమే సాధించాడు. మితి మీరిన ఆత్మ విశ్వాసం, పోటీ పడని చదువు ఎంత నష్టదాయకమో తెలుసుకున్నాడు. కానీ పోయిన సమయం మళ్ళీ రాదు కదా! ఇంటర్మీడియట్ నుంచి పోటీతత్వాన్ని పెంచుకున్నాడు.