ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆత్మ జ్ఞానము---సుజాత.పి.వి.ఎల్.
September 16, 2020 • T. VEDANTA SURY • Story

శరీరం రథం లాంటిది. ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథాన్ని నడిపే సారధి. మనసు కళ్లెము, ఇంద్రియములు రథ చక్రాలు. ఎవరి మనసు చంచలమైనదో, ఎవరికి గ్రహింపు లేదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనములో లేవో, మనస్సు నిర్మలమైనది కాదో అలాంటి వారు అనుకున్న గమ్య స్థానాన్ని ఎప్పటికి చేరుకోలేరు. చావు, పుట్టుకలు చక్రముల మధ్యలోనే పడి నలిగిపోతుంటారు. ఎవరైతే తమ మనసును పగ్గంతో గట్టిగా లాగి పట్టుకుని అదుపులో పెట్టుకోగలుగుతారో, ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోగలుగుతారో వారు అనుకున్న గమ్య స్థానాన్ని సులభంగా చేరుకోగలరు.ఆత్మకు సంబంధించిన బుద్ధి, జ్ఞానము చాలా సున్నితమైనవి, అగోచరమైనవి. సన్మార్గంలో నడుచుకునే వారు మాత్రమే వాటిని పొందగలరు.ఎవరి పట్ల భగవంతుడు సంతుష్టి చెందునో, వారికి వివేకము, వైరాగ్యము లభిస్తాయి. ఈ ప్రపంచమనే మహా సముద్రాన్ని సులువుగా,సురక్షితముగా దాటిస్తాయి. వేదములు పఠించడం వల్ల గానీ, మేధాశక్తి వల్ల గానీ, గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం వల్ల గానీ, ఆత్మ జ్ఞానాన్ని పొందలేరు. ఆత్మ ఎవరిని ఎంచుకొనునో వారే దానిని పొందగలరు. అటువంటి వారికే ఆత్మ స్వభావము బోధ పడుతుంది.ఆత్మజ్ఞానమును తెలుసుకోకుండానే చాలామంది తమ జీవితములను ముగించు చున్నారు. ఒక్క మానవ జన్మ లో మాత్రమే ఆత్మజ్ఞానమును తెలుసుకొను అవకాశము కలదు. ఇతర ఏ జన్మలోనూ మనము తెలుసుకోలేము. ఏ జీవికి ఈ అవకాశం లేదు. మరల మరల జన్మలు ఎత్తుతూ ఉండవలెను.  కర్మలను అనుభవించుచూ కొట్టుమిట్టాడుతుండవలెను. మానవునకు మేధాశక్తి కలదు. ప్రజ్ఞా శక్తి కలదు. ఏ ఇతర జీవికీ లేని  విచక్షణ కలదు. కనుకనే ప్రపంచాన్నంతటినీ  వశమచేసుకుంటున్నాడు. కానీ తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఎంత మేధాశక్తి ఉన్నా ఆత్మజ్ఞానము తెలుసుకోకుండా చనిపోయినచో ఏమి ప్రయోజనము?!. ఇతర జీవులకు మానవునికి తేడా ఏమున్నది. కనుక ఉచితముగా అత్మజ్ఞానము తెలుసుకుని మీ జీవితములను  సాఫల్యము చేసుకోండి. జన్మరాహిత్యమును  చేసుకొని, కైవల్య ప్రాప్తి పొందండి.