ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆదర్శ గురువు సర్వేపల్లి :-సదానంద్ శ్రీమంతుల జర్నలిస్టు.
September 4, 2020 • T. VEDANTA SURY • News

అనాదిగా సమాజంలో తను ఒక సాధారణ వ్యక్తే కావచ్చు గాక.. అసామాన్యమైన ప్రతిభాశాలి. అద్భుతమైన మేధోసంపత్తితో ఎందరికో ఆదర్శం... మరెందరికో స్ఫూర్తి దాయకం.... వ్యక్తిని శక్తిగా తీర్చిదిద్దగల నేర్పరితనం వారి సొంతం.
ఆదిమయుగం నుండీ ఆధునిక శకం వరకూ అతడే ఋషి....జాతి జీవన వికాస మార్గదర్శకుడు...సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు.
సృష్టి - స్థితి - లయల నిర్దేశకుడు.
మాతృ దేవోభవ,పితృ దేవోభవ,ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు.
తల్లిదండ్రుల తరువాత అంతటి వారుగా గురువుని కీర్తించారు వారు...
"#గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది.
పూర్వకాలంలో గురువులను వెదుక్కొంటూ వెళ్లి, ఆయనను ప్రసన్నం చేసుకుని సకల విద్యలను శిష్యులు నేర్చుకునేవారు. విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ఆయన సహచర్యంలోనే గడిపి నిరంతరం గురువు పట్ల భక్తి శ్రద్ధలు కనబరిచేవారు.
అయితే నేటి ఆధునిక కాలంలో మాత్రం "గురువు" అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా సర్వేపల్లిని పేర్కొన్నారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1949లో తొలి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. పదేళ్లు ఉపరాష్ట్రపతిగా సేవలందించిన తర్వాత 1962లో రాష్ట్రపతి పదవి వరించింది. ఓ ఉపాధ్యాయుడు రాష్ట్రపతి పదవిలో కూర్చోవడం ఆ వృత్తికే గర్వకారణం. అందుకే 1962 నుంచి ఆయన పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
వాస్తవానికిరాధాకృష్ణన్‌కు పుట్టినరోజుజరుపుకోవడం ఇష్టం లేదు. అందుకే తన పుట్టిన రోజును టీచర్స్‌డేగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. సమాజానికి సేవలు చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఇది గౌరవంగా భావించారాయన..
ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది
సెప్టెంబర్ 5న పిల్లలు తమ తమ ఉపాధ్యాయులపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. బహుమతులు అందజేస్తుంటారు
సర్వేపల్లి రాధాకృష్ణన్ చాలామందికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన మొదట ఉపాధ్యాయుడు. విద్యావేత్త,తత్వవేత్తగా ఆయన ప్రపంచానికి ఎక్కువగా పరిచయం.
భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.
ఉపాధ్యాయుడిగా, తత్వవేత్తగా, రచయితగా,పరిశోధకుడిగా, రాజనీతిజ్ఞుడిగా సర్వే పల్లి ప్రయాణం బహుముఖాలుగా సాగింది.
బాల్యం - విద్యాభ్యాసం :
--------------------------------_
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
తమిళనాడులోని (అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని) తిరుత్తుణిలో 1888 సెప్టెంబర్ 5న తెలుగు బ్రాహ్మణ కుటుంబ బానికి చెందిన సర్వేపల్లి వీర స్వామి - సీతమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి. అందుకే ఇంటిపేరు కూడా సర్వేపల్లిగా మారింది. ఓ సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. కటిక పేదరికాన్ని అనుభవించిన సర్వేపల్లికి కనీసం చదువుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు కొనుక్కోగలిగిన స్థోమత ఉండి, కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయనను ‘అయ్యా..ఒక్క కాగితం నలగకుండా నేను పుస్తకం చదువుకుంటాను. దయచేసి నాకు పుస్తకం ఇప్పించండి’ అని ప్రార్థన చేసి తెచ్చుకుని చదువుకునేవారు,పుస్తకాలు ఉన్న వ్యక్తులు తనను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్లి, వాటిని తెచ్చుకుని చదివి గొప్ప తత్వశాస్త్రవేత్త అయ్యారు. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా మాస్టర్స్ డిగ్రీలో ‘ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత’ను థీసిస్‌గా ఎంపిక చేసుకుని 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి.
రచనలు :
భారతీయ తత్వాన్ని ప్రపంచానికి అందించేందుకు అనేక పుస్తకాలు రాశారు.
హిందూ ఫిలాసఫి,
హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, భగవద్గీత గ్రంథాలు ఇందులో ప్రధానమైనవి.
My Search for Truth‌ పేరుతో ఆత్మకథను రాశారు..
ఆధునిక కాలంలో విద్యార్థికీ, ఉపాధ్యాయుడికీ మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా ఆచార్య రాధాకృష్ణ జీవితం అనేక పాఠాలను నేర్పుతుంది. ఆచార్యుడిగా, ఉపకులపతిగా, దౌత్యవేత్తగా, స్వాతంత్ర భారతావని తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా అధిరోహించిన శిఖరాలు, ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను తెలియజేస్తున్నాయి.
గౌరవ పురస్కారాలు:
__________________

డాక్టర్ రాధాకృష్ణన్ మానవతావాది. యువతకు ఆదర్శమూర్తి.
ఆయనకు 1954లోనే భారతరత్న పురస్కారం లభించింది.
1975లో టెంపుల్టన్ బహుమతి లభించింది.
నోబెల్ శాంతి బహుమతికి ఏకంగా 11 సార్లు నామినేట్ కావడం విశేషం.
సాహిత్యం లో 16 సార్లు నామినేట్ కావడం మరో గొప్ప విశేషం.
రాధాకృష్ణన్ అన్నా, ఆయన బోధనలన్నా విద్యార్థులకు ఎంతో ఇష్టం. విద్యార్థులకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు.
మనం పుట్టినప్పటినుండి, జీవితం లో స్థిరపడే వరకు ప్రతి దశలోనూ, ఉపాధ్యాయుడి ముద్ర ఎంతైనా ఉంది.. అ ఆ ల నుండి, ఆర్కుట్ వరకు, భయభక్తుల నుంచి బ్లాగుల వరకు ఉన్న ఈ ప్రస్థానం లో, ప్రతి అడుగు చేయి పట్టుకుని మనల్ని నడిపించింది మన గురువులే. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండొచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదంటారు.
భారతీయ పరంపర గురువుకు గొప్ప స్థానాన్ని కల్పించింది. ఆ గౌరవాన్ని నిలుపుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకుని, బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న
ఆదర్శనీయులైన ఉపాధ్యాయ బృందానికి
శతకోటి వందనాలు తెలుపుకుంటూ.
రాధాకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా అక్షరాంజలి.