ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆదర్శ నాయకురాలు (కథ). రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
November 23, 2020 • T. VEDANTA SURY • Story
ఆ తరగతిలో శ్రావణి అనే అమ్మాయి ఎప్పుడూ మొదటి ర్యాంకు సాధించేది. అందుకే ఆమెను లీడరును చేశారు. 8వ తరగతిలోకి వచ్చేసరికి శ్రావణి మరింత గంభీరంగా ఉంటుంది. ఏ ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా ఆ సబ్జెక్టుకు సంబంధించిన పని చేయించేది. ఒకరోజు తెలుగు ఉపాధ్యాయులు సెలవు పెట్టారు. "శ్రావణీ! పి.ఈ.టి. గారు ఖాళీగా ఉన్నారు. పిలుచుకురా! ఆటలు ఆడుకుందాం." అని కొందరు అన్నారు. "నిన్న గణిత ఉపాధ్యాయులు చెప్పిన లెక్కలు కఠినంగా ఉన్నాయి. మళ్ళీ వినాలని ఉంది." అని లీజరుగా ఉన్న గణిత ఉపాధ్యాయుని పిలిపించింది శ్రావణి. మరోసారి మరో ఉపాధ్యాయులు సెలవు పెడితే నీతి కథలు చెప్పించింది శ్రావణి. మరోసారి గ్రూపులు చేసి, లెక్కలు చేయించింది. మరోసారి కఠినమైన ఇంగ్లీష్ పదాలు డిక్టేషన్ చెప్పింది. ఇలా ఏదో ఒకటి చేయించేది. 
 
         శ్రావణిని అర్థం చేసుకున్న విద్యార్థులు ఆమెతో స్నేహం చేస్తూ కలసి చదివేవారు. క్రమశిక్షణ లోపించిన వారు, చదవడమే ఇష్టం లేని వారు శ్రావణికి శత్రువులా చూసేవారు. వెనుక నుంచి తిట్టుకునే వారు. ఇవన్నీ తెలిసినా శ్రావణి పట్టించుకోలేదు. ఎవరినీ ఏమీ అనలేదు. క్రమశిక్షణ పెంచడంలో ఉపాధ్యాయులతో సమానంగా పాటుపడింది శ్రావణి. పదవ తరగతికి వచ్చేసరికి ఉపాధ్యాయుడు తరగతిలోకి రానప్పుడు విద్యార్థులను గ్రూపులుగా చేసి చదివించేది. గురువులకు చెప్పి, అప్పుడప్పుడు క్విజ్ పోటీలు పెట్టించేది. ఉపాధ్యాయుల కృషికి తోడు నాయకురాలిగా శ్రావణి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించినందున ఆ తరగతి అత్యుత్తమ బ్యాచ్ గా తయారైంది. 
 
        ‌9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఇస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. విద్యార్థులు తమ చిన్ననాటి నుంచి పాఠశాలతో, ఉపాధ్యాయులతో, తోటి విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. శ్రావణి మాట్లాడుతూ "తనకు అందరూ మిత్రులే అని, తోటి స్నేహితులంతా మంచిగా చదవాలి, వారి భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో తాను లీడరుగా కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని, ఎప్పుడైనా ఎవరినైనా బాధపెడితే మంచి మనసుతో తనను క్షమించమని కోరింది. తోటి విద్యార్థులు కంటతడి పెట్టారు. శ్రావణి పనితీరును మెచ్చుకున్న ఉపాధ్యాయులు ఆమెకు ప్రత్యేకంగా బహుమతిని ఇచ్చారు. చప్పట్లతో మార్మోగింది ఆ వాతావరణం.