ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి విమర్శుకునిగా పేరొందిన సాహితీవేత్త, కవి,రచయిత,విమర్శకులు అద్దేపల్లి రామ్మోహన్‌ రావు జయంతి నేడు- మాడిశెట్టి గోపాల్
September 6, 2020 • T. VEDANTA SURY • News

సమాజమే కుటుంబంగా, అభ్యుదయమే ప్రమాణంగా జీవిస్తూ ప్రాపంచిక కవితా దృక్పథాన్ని ప్రగతిశీల దృక్పథంతో మేళవించి అద్భుతమైన రచనలు చేశారు అద్దేపల్లి రామ్మోహన్ రావు.  1936, సెప్టెంబరు 6న బందరు శివార్లలోని చింతగుంటపాలెంలో పుట్టాడు. చింతగుంటపాలెంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు  జవారుపేట హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి సుందరరావు బందరు హిందూ కాలేజీలో గుమాస్తాగా పనిచేసేవారు. ఈయన కవులు, పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ కుటుంబంలో పెరిగిపెద్దవాడయ్యాడు.  సతీమణి అన్నపూర్ణ. సంతానం నలుగురు మగపిల్లలు.
మానవీయ విలువలు క్రమంగా మాయమైపోవడాన్ని ఆయన చాలా శక్తిమంతంగా కవిత్వీకరించారు. జీవితాంతం ప్రేమను పంచడానికీ, సమానత్వం ప్రబోధించడానికి జీవించారు. దాని కోసం సాహిత్యాన్ని ఆలంబనగానూ  ఆయుధంగానూ చేసుకున్నారు.   ఆయన అందుకున్న అవార్డులు, సత్కారాలే ఆయన రచనా పటిమ గురించి తెలియజేస్తాయి. తెలుగులో ప్రగతిశీల సాహిత్యం పరిఢవిల్లడానికి మూల పురుషులుగా నిలబడ్డ వాళ్లలో అద్దేపల్లి ప్రముఖులు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను రెండిటినీ సంపూర్ణంగా అధ్యయనం చేశారు. ఆధునిక కవితా రూపాల మాధుర్యాన్ని అందజేయడంలో చురుకైన పాత్ర పోషించారు. మినీ కవిత, వచన కవిత, దీర్ఘ కవిత, గజల్లు...ఇలా అనేక ప్రక్రియల లో రచనలు చేశారు.  కవులందరినీ ప్రేమించారు. ఈ తరం కవులు ఎందరో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని రచనలు చేస్తున్నారు.

సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ లెక్కకు మిక్కిలిగా బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. ఉమర్‌ అలీషా అవార్డు, సరసం, తిలక్‌ అవార్డు, ఆంధ్ర సారస్వత సమితి జీవన సాఫల్య పురస్కారం, తంగిరాల, జాషువా, పులికంటి, మద్రాసు చిన్నప్ప భారతి సాహిత్య పురస్కారం అందుకున్నారు. ‘సాహితీ సంచార యోధుడు’ బిరుదునూ పొందారు.

రచయితలకు నిబద్ధత ఉండాలి. తాము రాసిన భావాలను కవులు ఆచరించాలి. ఆచరించినదే చెప్పాలి అని పదే పదే చెప్పేవారు. సాహిత్యంలో కమిట్‌మెంట్‌ అంటే ఒక సిద్ధాంతబద్ధమైన అవగాహన. ఆ సిద్ధాంత దర్శకత్వంలో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, అవగాహన అయినదానినే చెప్పడం అవసరం అని చెప్పేవారు. కాలంతో పాటు వచ్చిన ప్రతి సాహిత్యోద్యమాన్ని వెనకేసుకొచ్చేవారు. ఫెమినిస్టు సాహితీ వేత్తలను ప్రచారం చేసేవారు. దళిత, మైనారిటీ, అన్ని సాహిత్యోద్యమాలనీ, ప్రక్రియలనీ ఉత్సాహంతో ఆహ్వానించి విశ్లేషించేవారు.కృష్ణశాస్ర్తీని కొత్త కోణంలో పరిశీలించాడు. స్ర్తివాదంలోని మంచీ చెడు రెండింటినీ సంయమనంతో బేరీజు వేశాడు.
మచిలీపట్నం, నందిగామ కళాశాలల్లో అధ్యాపకుడుగా పనిచేసి కాకినాడ వచ్చి ఎంఎస్‌ఎన్ చారిటీస్ కళాశాలలో స్థిరపడ్డాడు.  సాహిత్యాభిమానుల్ని తయారుచేశాడు. కాకినాడలో సాహిత్యానికి మరో పేరయ్యాడు. ‘అభ్యుదయ విప్లవ కవిత్వాల్లో వస్తువు-శిల్పం’ మంచి సిద్ధాంత వ్యాసం రాశాడు.

 నాకు కవిత్వం వారసత్వంగా రాలేదు. బహుశః కవిత్వం వలన నేను పొందిన అనుభూతి మాత్రమే నన్ను కవిగా మలిచి ఉంటుంది’’ అన్న విశిష్ట కవి అద్దేపల్లి. కుహనా రాజకీయాలన్నా, ఉద్యమాల పేరుతో పదవులూ, పురస్కారాలు పొందేవారన్నా ఈసడించుకునేవాడు.

దాదాపు 13 కవితా సంపుటాలు, 25 విమర్శ పుస్తకాలు,  ఆరువందలకు పైగా పుస్తకాలకు ముందుమాటలు రాశారు. సాహితీస్రవంతి సంస్థను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 

*అద్దేపల్లి రచనలు*

మధుజ్వాల
అంతర్జ్వాల
గోదావరి నా ప్రతిబింబం
రక్తసంధ్య
సంఘం శరణం గచ్ఛామి
మెరుపు పువ్వు
అయినాధైర్యంగానే
పొగచూరిన ఆకాశం
శ్రీశ్రీ కవితాప్రస్థానం
విమర్శ వేదిక సాహిత్య సమీక్ష
జాషువా కవితా సమీక్ష
కుందుర్తి కవిత
మినీకవిత
దృష్టిపథం
స్త్రీవాద కవిత్వం
అభ్యుదయ విప్లవ కవిత్వాలు - సిద్ధాంతాలు, శిల్పరీతులు
గీటురాయి
విలోకనం
కాలంమీద సంతకం
తెరలు
ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళ
ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల
తెలుగు కవిత్వంలో ఆధునికత
అల్లూరి సీతారామరాజు (వచన కవితా కధా కావ్యం)

*ఆయనకు వచ్చిన పురస్కారాలు*

2001లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీవిమర్శకు గాను ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాడు.
తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రగతిశీల రచయిత చిన్నప్ప భారతి ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ఆయన రాసిన "పొగచూరిన ఆకాశం" కవితా సంపుటికి గానూ పొందారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం
ఉమర్ ఆలీషా అవార్డు
సరసం అవార్డు
తిలక్ అవార్డు
ఆంధ్రసారస్వత సమితి జీవన సాఫల్య పురస్కారం
తంగిరాల అవార్డు
జాషువా అవార్డు
పులికంటి సాహితీ పురస్కారం
బోయిభీమన్న సాహితీపురస్కారం
2002లో అయినా ధైర్యంగానే పుస్తకానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
2016 జనవరి 13న కన్నుమూశారు. వీరి సతీమణి అన్నపూర్ణ, పిల్లలు ఉదయభాస్కర్‌, ప్రభాకర్‌, రాధాకృష్ణ, రాజశేఖర్‌ అందరూ తండ్రి చూపిన బాటలోనే నడువడం విశేషించి చెప్పుకోదగ్గది. తమ తండ్రి పేరు మీద వీరు పురస్కారాలు, బిరుదులు అందజేస్తూ సాహితీ లోకానికి తమ వంతు సేవ చేస్తున్నారు. 
అద్దేపల్లి, సామల సదాశివ గారలతో నేను.. ఒక కార్యక్రమం లో..