ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరుపొందిన అనేకమంది కవులు గలరు. వారిలో పరవస్తు చిన్నయ్య సూరి, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, శ్రీ .శ్రీ., గుంటూరు శేషేంద్ర శర్మ,ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణ రెడ్డి వంటి వందలకొలది కవులు ఉన్నారు. వీరందరు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తునే ఉన్నారు. తెలుగు సాహిత్యంలో కూడా వివిధ ప్రక్రియలు ఉన్నాయి. ఆధునిక యుగంలో కూడా సాహిత్యకావ్యాలు, ప్రబంధాలు, గద్య, పద్య రూపాలలో నేటికీ కవులు కొనసాగిస్తున్నారు. ఇవి గాక నాటకములు, నాటికలు, ఏకాంకికలు, నవలలు, నవలికలు, కథలు,గేయాలు, కవితలు, పాటలు, గజల్సు, నానీలు మున్నగు అనేక ప్రక్రియలతోశాఖోపశాఖలుగా నేటికిని విస్తరిల్లుతుంది.తెలుగు సాహిత్యంలో పద్య కవిత్వం నన్నయకు ముందు కాలంలో కూడా వున్నా, అది గాసటబీసటగ ఉండేది. దానిని సంస్కరించి, వాగనుశాసనుడు, శబ్దశాసనుడు అనే బిరుదులతో పాటు నన్నయ ఆది కవిగా కీర్తి కెక్కాడు. గద్య సాహిత్యానికిఆద్యుడు పరవస్తు చిన్నయ సూరి. ఈయనకు ముందు తెలుగు సాహిత్యములో గద్యము ఉండవచ్చును. కానీ, ఈ గద్యానికి రూపురేఖలు దిద్ది మహోన్నతమైన వన్నె తెచ్చిన వాడు చిన్నయ్య సూరి అందుకే తెలుగులో "పద్యమునకు నన్నయ్య గద్యమునకు చిన్నయ్య"అనే నానుడి ఉంది.చిన్నయ్య వంశీయులు పూర్వము బ్రతుకు తెరువు కోసం ఉత్తరాంధ్ర నుండి తమిళనాడుకు వలస వెళ్లారు. చిన్నయ్య తండ్రి పేరు పరవస్తు రంగ రామానుజాచార్యులు. ఈయన వైష్ణవుడయి ఈ మతం ఆచారములను సాంప్రదాయ సిద్ధముగా అవలంబించే వ్యక్తి. ఈయన చెన్నై నగరంలో ఉంటూ వైష్ణవ మత ప్రచారకుడిగా జీవితం సాగించేవాడు.ఆనాటి మత పెద్ద అయిన ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు అక్కడి నుండి దగ్గరలో గల పెరంబదూర్ అనే గ్రామం పంపించి వేసారు.అచట రంగ రామానుజాచార్యులు శ్రీనివాసాంబలకు చిన్నయ సూరి జన్మించాడు. ఈ బాలుడికి 15 ఏళ్ళు పైబడినప్పటికీ, అక్షరజ్ఞానం లేదు. వారినే చూడడానికి వచ్చిన రామానుజాచార్యులు నెమ్మదిగా మందలించాడు. చిన్నయకు చదువులు నేర్పమని హెచ్చరించాడు. ఆ బాధ్యతలను రామానుజాచార్యు లకే అప్పగించడం జరిగింది. చిన్నయ సూరి ఆయన వద్ద తెలుగు తమిళ భాషలు చదివి మెప్పు పొందాడు. వ్యాకరణం మాత్రమే తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. వేదాద్య యనము చేసి పండితుడు అనిపించుకున్నాడు. ఆనాడు చెన్నై లో గల మంజుల లక్ష్మి నరసింహ శెట్టి అనే వ్యాపారస్తుడు పాండిత్యము గుర్తించే ఈస్టిండియా కంపెనీ సుప్రీంకోర్టులో చిన్న ఉద్యోగము ఇప్పించాడు. అప్పుడు తండ్రితోపాటుగా చెన్నై రావలసి వచ్చింది.ఆనాడు భారతదేశానికి పరిపాలకులుగా వచ్చిన ఆంగ్లేయ అధికారులు స్థానిక భాషలు నేర్చుకోవలసిన అవసరం ఉండేది. అప్పట్లో ఆంగ్లము పరిచయమైన తెలుగు పండితులు అంతగా లేరుఆ పరిస్థితులలో చిన్నయ్యసూరి ఆంగ్ల అధికారులకు తెలుగు నేర్పుతూ వారి మెప్పు పొందాడు. 1836 లో తండ్రి మరణంతో చిన్నయ్యపై కుటుంబ భారం పడింది. 1840సం.లో ఆయన తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా పనిచేసి, విద్యార్థుల మన్ననలను అందుకున్నాడు. తరువాత కాలంలో పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పాఠ్యాంశాలు బోధించడమే కాక ప్రాచీన సాహిత్యాన్ని కూడా బోధించాడు. వారిలో ఉత్తమ గుణములు పొందునట్లు తీర్చిదిద్దాడు.తరువాత చిన్నయ్య ఆంగ్ల భాషను కూడా స్వీయ అధ్యయనం చేశాడు. సి. పి బ్రౌన్ తో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత కాలంలో మద్రాసు కళాశాలలో చీన్నయ్య అధ్యాపక వృత్తి చేపట్టాడు.అచట గల ఆంగ్లేయ అధ్యాపకులకు కూడా వ్యాకరణ బోధన చేశాడు. ఆ సంస్థ అధ్యక్షుడు అర్బనాట్ మెప్పు పొందాడు. అర్బత్ నాట్ , లండన్ నుంచి స్వర్ణ కంకణం తెప్పించాడు. దానిపై చిన్నయ్య సూరి అని రాయించి బహుమతిగా ఇవ్వడం జరిగింది. సూరి అనగా పండితుడని అర్థం కదా! అప్పటి నుండి చిన్నయ్య, చిన్నయసూరి అయ్యాడు. 1857లో మద్రాసు విశ్వవిద్యాలయం ఏర్పడింది. దాని అనుబంధ కళాశాలలో చిన్నయ్య సూరిని అధ్యాపకునిగా నియమించడం జరిగింది. (సశేషం) ( ఇది 85వ భాగం ) - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 7, 2020 • T. VEDANTA SURY • Serial