ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆధునిక యుగంలో కందుకూరి వీరేశలింగం చేసిన సాహిత్య సామాజిక సేవలు అనన్య సామాన్యమైనవి. ఆయన "వివేకవర్ధని" పత్రిక ద్వారా సామాజిక సంస్కరణలు చేపట్టారు. స్త్రీల కోసం "సతీహిత బోధిని" అనే పత్రిక ప్రచురించారు. స్త్రీలకు ప్రయోజనకరమైన కథలు, వ్యాసాలు, పద్యాలు గాక అనేక శీర్షికలను నిర్వహించారు. ఆ రోజుల్లోనే చందాలు వసూలు చేసి రాత్రి పాఠశాలలను నిర్వహించారు. పగటి వేళ కష్టం చేసి బ్రతికే పేదల కోసం, రాత్రివేళలందు విద్య నేర్పించారు.అక్షర జ్యోతులు వంటి కార్యక్రమాలు, వయోజన విద్యావ్యాప్తికి రాత్రివేళల చదువులు బోధించేవారు.వీటి బీజాలు ఆనాడే పడ్డాయి. వీరేశలింగంగారి ప్రార్థన సమాజ కార్యక్రమాల్లో అందరూ పాల్గొన డానికి ఉత్సాహం చూపేవారు.వీరేశలింగం గారికి ఏకేశ్వరోపాసన అంటే విశ్వాసం ఉండేది. రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్ర సేన్, పండిత శివ నాథ శాస్త్రి వంటి మహనీయుల అడుగుజాడల్లో ఉద్యమించారు. బ్రహ్మసమాజ ఆశయాలను నడిపించే ప్రముఖ వ్యక్తుల అడుగుజాడలలో సాగారు. తర్వాత కాలంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారితో పరిచయం ఏర్పడింది. వీరి మార్గదర్శకత్వంలో బ్రహ్మసమాజ మత వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు, వీరిద్దరూ సంఘ సంస్కరణోద్యమ కార్యక్రమాలలో ధ్రువ తారకలై నిలిచారు.వీరేశలింగంగారి జీవిత కాలంలో రాజమండ్రి, కాకినాడ,‌ గుంటూరు, మచిలీపట్నం పట్టణాలలో బ్రహ్మసమాజ మందిరాలు నెలకొల్పారు. ఈయన బెంగుళూరులో కూడా బ్రహ్మసమాజ మందిరాన్నిఏర్పాటు చేశారు. వీరేశలింగంగారి సంస్కరణలలో ముఖ్యమైనది వితంతు వివాహాలు. ఈయన తన స్నేహితులతో అనేక సమావేశాలలో చర్చించి వితంతు వివాహాలు జరిపించడానికి నిశ్చయించు కున్నారు. అవి బాల్య వివాహాల రోజులు, అందుచేత వితంతు వివాహాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఆ రోజుల్లో అగ్ర కులాలలో వితంతువులు ఉండేవారు.వృద్ధులు భార్య చనిపోతే తన వయసు ధర్మాన్ని మరచి పోయి చిన్న వయస్సులో ఉండే ఆడపిల్లలను పెళ్లి చేసుకునే వారు. పెళ్లి అయిన కొద్ది మాసాలకే హరీయనడం, భార్య వితంతువుగా మిగలడం కనిపించేది కాదు. ఆనాటి సమాజంలో ఇదొక దయనీయ పరిస్థితి. భార్య మరణించిన మగవాడికి పునర్వివాహ యోగ్యత ఉన్నప్పుడు విధవకు మళ్లీ పెళ్లి చేసుకునే హక్కు ఎందుకు ఉండకూడదు? ఇలా ఆలోచించి తన మిత్రులతో చర్చించి వితంతు వివాహాలు జరపాలనే నిర్ణయం తీసుకున్నారు.వివేకవర్ధని సమాజం బ్రహ్మ వివాహాలు ప్రకటించింది.అవి బాల్య వివాహాలు, స్త్రీ అవిద్య, కన్యాశుల్కంమొదలైన సామాజిక దురాచారాలు, వాటి వలన కలిగే దుష్ప్రభావాలు ప్రజలకు తెలియజేశారు.కానీ కార్యాచరణ సాధించలేక పోవడం జరిగింది.ఉపన్యాసాల ద్వారా, పుస్తక ప్రచురణల ద్వారా ప్రచారం చేస్తే ఫలితం ఉంటుందని భావించారు.1872సం.లో వితంతు వివాహ ఆవశ్యకతను గూర్చి విశ్లేషిస్తూ పురుషార్ధ ప్రదాయినిలో నిర్మాణాత్మకమైన వ్యాసాలు వెలువరించారు. బాల వితంతువులు ఉన్నచోటు తెలుసుకుని, సమాచారం చెప్పడానికి మనుషులను పంపించే ఏర్పాటు చేశారు.వారి ద్వారా విషయం సమాచారం అందించే కృషి చేశారు. తిరిగి వచ్చేందుకు ఆ మనుషులకు తగిన డబ్బులు కూడా ఇచ్చే వారు. విషయం తెలిసిన వెంటనే అమలా పురం, మండపేట, తాళ్లపూడి, కాకినాడ, దొడ్డిపట్ల, పాలకొల్లు, రామచంద్రపురం విజ్జేశ్వరం మొదలైన ప్రాంతాలకు మనుషులను పంపించడమే కాక ఆయా చోట్లకు స్వయంగా వెళ్లేవారు. అలా వెళ్లేటప్పుడు కంటికి నిద్ర గాని, కడుపుకు తిండి గాని ఉండేది కాదు. గొడ్ల పాకల రొచ్చు దుర్గంధంలో నిద్రింప వలసి వచ్చేది. వితంతు యువతులు దొరికితే వారిని వివాహమాడతామని చదువుకుంటున్న యువకులు ముందుకు వస్తే, వీరేశలింగం పంతులు గారు వారిలో కొంతమందికి పాఠశాల చదువులకు జీతాలు సాయం చేస్తూ వచ్చేవారు. ( ఇంకా ఉంది ) - ఇది 94 వ భాగము - బెహరా ఉమామహేశ్వరరావు- 9290061336
August 16, 2020 • T. VEDANTA SURY • Serial