ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆధునిక సాహిత్య వైతాళికుడు కందుకూరి వీరేశలింగం గారు చేపట్టిన సాంఘిక సంస్కరణలు దక్షిణ భారత దేశమంతా వేనోళ్ల కొని యాడింది. కాని ఆయన చుట్టుపక్కల ఉండే సమాజం మాత్రం హర్షించ లేకపోయింది. అంతేకాదు తీవ్రంగా దుయ్య బట్టి ఇబ్బందుల పాలు చేసి వ్యతిరేకించింది వీరేశలింగం గారు వితంతు వివాహాలు శాస్త్ర సమ్మతమేనని అనేక సభలలో ఉపన్యాసాలు ఇచ్చారు. కాని ఆయన ఉపన్యాసాలకు అడ్డు తగులుతూ, దుర్భాషలాడిన వారు కూడా ఉండేవారు. ఆయన ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తించారు. అనేకమైన కష్ట నిష్టూరాలు ఎదురైనా చలించలేదు, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు.కందుకూరి వీరేశలింగం గారు 1881 డిసెంబర్11వ తేదీన మొదటి వితంతు వివాహం జరిపించారు. ఆ వివాహం గౌరమ్మకు, గోగులపాటి శ్రీ రాములతో జరిపించడమైంది. వీరేశలింగం గారు వితంతు వివాహ సంఘానికి కార్యదర్శిగా ఉండేవారు. ఇతనికి వేశ్యల మేళం అంటే గిట్టేది కాదు, అందుకే, "వేశ్యల మేళానికి వెళ్ళను", అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. సాధారణంగా వివాహాలలో వేశ్యల మేళం ఉండేది. అది సాంప్రదాయబద్ధమైన వైభవం కూడా, అందుచేతఈ వితంతు వివాహానికి సభ్యులందరి మాటపై మేళం పెట్టవలసి వచ్చింది. పైడా రామకృష్ణయ్యగారు వెయ్యి రూపాయలను పెళ్లి ఖర్చుల కోసం పంపారు. పెళ్లి కూడా ఘనంగా చేయమని కబురంపారు. ఆనాటి తెలుగునాట మొట్టమొదటి వితంతు వివాహం కదా! అందుకే ఘనంగా జరపాలని, అందరూ ఆర్భాటంగా చేయాలని అనుకు న్నారు. వివాహానికి శోభ రావాలంటే భోగం మేళం తప్పదని సంఘ సభ్యుల పరిపూర్ణ అభిప్రాయం.అందుచేత వీరేశలింగం గారు అంగీకరించక తప్ప లేదు. పెళ్లి వీరింటే జరగడం చేత, వేశ్యలను తన ఇంటి ఛాయలకు రానివ్వలేదు. ఆ కారణం చేతనే ఊరేగింపు సమయంలో మేళంను పెళ్లి పల్లకి ముందు పెట్టించి ఊరేగించారు. ఆ విధంగా వీరేశలింగం గారు మేళం ఛాయలకే పోకుండా తన ప్రతిజ్ఞ నిలుపు కున్నారు. ఆప్తమిత్రుడైన గవలరాజు ఒక్కరే ఆయన ను అనుసరిస్తూ భోగం మేళంకి దూరంగా ఉండిపోయారు. ఏది ఏమైనా వితంతు వివాహం అందరి మధ్య ఆర్భాటంగా చేసి ఈయన చాంధసుల నోరు మూయించారు.మొత్తం మీద 40 వితంతు వివాహాలు కందుకూరి జరిపించారు. వేదికల మీద కేవలం ఉపన్యసించడమే కాదు, వీరేశలింగం గారు తన ఆశయ ఆదర్శాలను ఆచరించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.ఈయన గొప్పతనం వెనుక ఒక పుణ్యమూర్తి ఉంది. ఒక పురుషుడి ఆదర్శ ఆశయాల వెనక ఒక స్త్రీ ఉంటుందం టారు. స్త్రీ సహాయం లేకుండా విజయం సాధించింప వచ్చునేమో గాని, భార్య సహకారం లేనిదే ఇంతటి మహత్కార్యం సాధించడం మాత్రం అసాధ్యమే!వీరేశలింగం గారి భార్య పేరు బాపమ్మ, ఆ పేరునురాజలక్ష్మిగా మార్చారు. స్త్రీ విద్యను ప్రోత్సహించే వీరేశలింగం గారు ముందు తన భార్యకే విద్యాబుద్ధులు నేర్పి కృతకృత్యులయ్యారు. ఆమె కూడా కొంతమంది నిరక్షరాస్యులైన స్త్రీలను తన ఇంటికి పిలిపించి చదువుసంధ్యలు నేర్పేది. రాజమండ్రిలో మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించినది కందుకూరి వీరేశలింగం గారే! ఆయన చేసే ప్రతి సంఘ సంస్కరణ కార్యక్రమాలో రాజ్యలక్ష్మి గారు ముఖ్య పాత్ర వహించేవారు. ఈమె హృదయముతో ప్రోత్సహించి సహకరించేది. వీరేశలింగంగారు వితంతు వివాహాలను నిర్వహించడం మొదలు పెట్టింది లగాయతు ఇంట్లో వీరి సతీమణి రాజ్యలక్ష్మికి ఎనలేని కష్టాలు ఆరంభమయ్యాయి. ఒకసారి వీరేశలింగంగారు ఇంట్లో లేని సమయంలో ఆయన బంధువులు వచ్చారు. వారందరు ఇక వీరేశలింగం గారి మనసు ఎలాగూ మార్చలేము కదా, అందుచేత ఆయన భార్య అయిన రాజ్యలక్ష్మిచేత సాధించాలని అనుకున్నారు. ఆమెతో మాటలు కలిపి "సంఘ సేవ మీరుగాని విడిచి పెట్టక పోతే నూతిలో పడి చస్తాను" అని మొండిగా భర్తతో చెప్పమన్నారు. కానీ రాజ్యలక్ష్మమ్మ త్రికరణ శుద్ధిగా భర్తను నమ్మిన ఇల్లాలు. భర్త తోడిదే ఈ లోకమని ఆమె విశ్వాసం. అందుకే వారి మాటలను అంగీకరింపక, తిరస్కరించింది. 'కార్యేషు దాసి, కరణేషు మంత్రి' అనే సూక్తి, ఈమెకు నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది. పంతులు గారిది కోపస్వభావం ఈమె శాంత స్వభావం కలది.బంధువులు, పండితులు, నగరవాసులు మరికొంత మంది పెద్దలు, పంతులు గారు తలపెట్టిన వితంతు వివాహ కార్యక్రమాలు, ముందుకు సాగకుండా నిరోధించాలని ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. చాలా మంది పెద్దలు రాజ్య లక్ష్మమ్మ పై వత్తిడి తెచ్చి వీరేశలింగంగారి మనసు మార్చాలని విపరీతమైన ప్రయత్నం చేశారు కానీ సాగలేదు. రాజ్యలక్ష్మి గారి, ఆత్మీయ బంధువులైన, కన్న వారి ఇంటి నుండి చాలామంది వీరి కార్యక్రమాలు నిరోధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఒకసారి ఆమె మేనమామతో పాటు మరి కొందరు బంధువులు రోదిస్తూ వచ్చారు.వీరేశలింగం ఇంట్లో లేని సమయం కనిపెట్టి నెమ్మదిగా వచ్చి చేరారు. "నీ దారి మార్చుకోకపోతే నేను గోదావరిలో దూకి ఛస్తాను... మన పూర్వ సాంప్రదాయాలు మట్టిలో కలిసి పోతున్నాయి. వాటిని నువ్వే కాపాడాలి." అంటూ శతవిధాల వేడుకున్నారు. ఆమె కాళ్ళ వేళ్ళపడి బ్రతిమాలారు. కానీ ఆమె వారి మాటలకు గాని ఒత్తిడికి గాని లొంగనే లేదు. కనీసం చెలించ నైనా లేదు.పైగా రాజ్యలక్ష్మమ్మ "నా భర్త సర్వజ్ఞుడు, ఆయనెప్పుడూ మంచి పనులు చేస్తారు, వారిని నే కాదని నేను ఏదీ చేయను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన వెంటే తోడు నీడగా ఉంటాను. ఆయన తోడిదే నాకు ఈ లోకం. ఇటువంటి విషయాల్లో మీరు ఎటువంటి జోక్యం చేసుకో తగదు. ఇంకెప్పుడూ ఈ విషయం గురించి మా ఇంటికి రావద్దు" అని నిర్ధ్వందంగా చెప్పింది. చుట్టాలు, బంధువులంతా చిన్నబుచ్చుకుని వెళ్లిపోయారు. ( ఇంకా ఉంది ) - ఇది 97వ భాగం- బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 19, 2020 • T. VEDANTA SURY • News