ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆమె ఒక ప్రభుత్వ టీచర్.--పేరు విజయ భాను .--విశాఖ పట్నం జిల్లా పాయకరావు పేట లో ఉన్న ప్రభుత్వ పాఠశాల లో పనిచేస్తున్నారు. మొన్న ఎప్పటిలాగానే పాఠశాలకు వెళ్లినప్పుడు ఆవరణ లో పడిఉన్న బ్రాందీ , విస్కీ,బీరు బాటిళ్లను చూసి విసుగెత్తిపోయి ఫోటో తీసి తన ఫెస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఫెస్ బుక్ లో పోస్ట్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు? అని మీకు నవ్వు రావచ్చు. ఇలాంటివి చాలా చూసాం అనికూడా అనుకోవచ్చు. కానీ మీ భావన తప్పు. నిన్నవిజయవాడ నుంచి పాఠశాల విద్య కమిషనర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ఐ.ఏ.ఎస్, గారు ఆ పాఠశాల కు ఆకస్మికం గా వెళ్ళారు.సాయంత్రం వరకు అక్కడే ఉండి గ్రామస్థులతో , పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు . 'మన ఊరు -మన పిల్లలు -మన బడి' దీన్ని మనమే కాపాడుకోవాలి. అని అవగాహన కల్గించారు.ఆ స్కూల్ కు ప్రహారీ గోడ మంజూరు చేసారు. “నేను వచ్చాను, చూసాను, ఏదో చెయ్యమని చెప్పాను అని కాదు. నేను వచ్చానంటే సమస్యకు పరిష్కారం రావాలి. నేను వచ్చినందుకు ఇక్కడ మార్పు రావాలి”అని చెప్పి పాఠశాల పరిరక్షణ లో గ్రామస్థులను , గ్రామాధికారులను భాగం చేస్తూ వారికీ బాధ్యత ను గుర్తుచేశారు. వారందరితో 'బడి బాధ్యత మా అందరిది ' అని మాట తీసుకున్న తర్వాతే అక్కడినుంచి కదిలారు. వాచ్ మెన్ ను పెట్టుకోవడానికి సిద్ధ పడ్డారు . స్థానిక పోలీసుల దృష్టికి కూడా విషయం చేరింది.నిఘా కూడా పెట్టేలా చేసారు.నిజానికి ఇది ఒక పాయకరావు పేట పాఠశాల సమస్య మాత్రమే కాదు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ దాదాపు గా ఉన్న సమస్య . ఉదయాన్నే బడికి వెళ్ళగానే అక్కడ పడిఉన్న ఖాళీ సీసాలను తీయించే దృశ్యాలు మనకు కొత్త కాదు. బడి మైదానాల్లో పగిలిన ఖాళీ సీసాలు పిల్లల కాళ్ళకు గుచ్చుకున్న సందర్భాలు అనేకం.దీనికి ఎక్కడ మార్ఫు ఎక్కడ రావాలి ? 'మన ఊరు -మన పిల్లలు -మన బడి' అనే సామజిక స్పృహ ను గ్రామస్తుల్లో తెచ్చిన రోజే మార్ఫు సాధ్యం అవుతుంది. అందుకు ముందుకు మొదటి అడుగు వేద్దాం. ఆ తర్వాత జత కలిసే చేతులు అవే వస్తాయి. 'మన బడి -మన పరిరక్షణ ' కూడా మన బాధ్యతల్లో ఒకటి.పేస్ బుక్ లో పోస్ట్ పెడితే దాన్ని ఎవరు చూస్తారు ? ఎవరొస్తారు? ...అని జనం అనుకుంటున్న ఈ రోజుల్లో ఎక్కడో విశాఖ పట్నం జిల్లా పాయకరావు పేట లో ఉన్న ప్రభుత్వ పాఠశాల కు ఆకస్మికం గావెళ్లి స్ఫూర్తి నింపిన మార్గదర్శకులు పాఠశాల విద్య కమిషనర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ఐ.ఏ.ఎస్,గారికి హృదయ పూర్వక అభినందనలు .విద్యా వ్యవస్థ బలోపేతం కోసం కొత్త దారుల అన్వేషణ లో నిరంతరంగా శ్రమిస్తున్న మీకు ధన్యవాదాలు సర్ . -డాక్టర్ వేంపల్లి గంగాధర్
July 31, 2020 • T. VEDANTA SURY • News