ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆరోగ్యం ~సౌభాగ్యం (గేయకథ) రచన:బి.వి.పట్నాయక్,పార్వతీపురం
October 25, 2020 • T. VEDANTA SURY • Poem

పాలనలో సాయపడే
మంత్రి నొకటి నియమింపగ
అడవి నందు మృగరాజు
వేయించెను దండోరా!

అధికమైన జంతుగణం
ఇష్టపడే అడవి మృగం
మంత్రి అయ్యె అవకాశం
దండోరా సందేశం!

పదవి పట్ల మోజు ఉన్న
పొగరుబోతు పులి అంతట
తన శక్తిని ప్రదర్శించ
పోటీకై నిలిచెనంత!

మంత్రి పదవి చేజిక్కిన
నచ్చినంత ఆహారం
మెక్కేందుకు నక్క ఒకటి
పోటీకై ఎత్తు వేసె!

తిక్క ఉన్న తోడేలుకు
ఆశ కలిగె పదవిపైన
గర్వంతో విర్రవీగి
అడుగు వేసి పోటీనకు!

కల్ల బొల్లి మాటలతో
జంతువులను కలసి మరీ
మంచి నటన చేయుచుండె
పోటీపడె ఆ మృగములు!

ఎన్ను కొనే రోజు వచ్చె
పోటీపడు మృగములతో
జంతుగణం వచ్చి చేరె
మృగరాజు ముంగిటందు!

మంచి కోరు మృగములార
ఎంచుకొనుము మంత్రి నిపుడు
ఆనతిచ్చె మృగరాజు
స్వేచ్ఛ పొందె జంతువులకు!

పదవి ఉన్న లేకున్నా
పరుల సేవ చేయు హితుడు
మర్కటమే మా మిత్రుడు
పలికెనంత మృగములన్ని!

పులి, నక్క, తోడేలకు
మృగములాడె మాటలన్ని
శూలాల్లా గుచ్చినాయి
కోపాన్నే పెంచినాయి!

కోతిబావ గొప్పతనం
మచ్చుకైన రుజువు చూపు
అక్కసుతో అడిగినంత
ఆశపడె మూడు మృగములు!

గబ్బు పట్టె ఈ అడవిని
శుద్ధి చేసి చూపె కోతి
అదియెగదా నిస్వార్ధం
వివరించెను మృగములన్ని!

స్వచ్ఛమైన అడవి కొరకు
కోతిబావ ముందడుగును
స్వాగతించి ఆ సింహం
నియమించెను మంత్రిగాను!

పదవి అంటె పిచ్చి ఉన్న
మూడు మూర్ఖ జంతువులకు
ముందుచూపు లేకపోయె
మంచి ముందు ఓడిపోయె!

పరిశుభ్రత ఆరోగ్యం
పచ్చదనమె సౌభాగ్యం
ఆచరించ చూపు వారు
అవనిలోని ఆదర్శులు!