ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆ రోజులు..--టీవీలో ఏదైనా కార్యక్రమం నచ్చనప్పుడు ఛానల్ మార్చేసుకునేలా నా ప్రాయాన్ని మార్చుకునే అవకాశముంటే నేను వెళ్ళిపోవాలనుకునే ప్రాయం పన్నెండేళ్ళలోపు జీవితాన్నే. అందులోనూ మద్రాసు టీ. నగర్లో 14 బజుల్లారోడ్డు, 8బి తిలక్ స్ట్రీటు. పుట్టి కొన్నేళ్ళున్నది బజుల్లా రోడ్డయితే ఊహొచ్చి గడిపింది తిలక్ స్ట్రీట్లో.మేము అద్దెకుండిన ఈ రెండిళ్ళూ మరాఠీ వాళ్ళదే. ఇద్దరు యజమానులూ బంధువులే. ఇంకా చెప్పాలంటే వీధి పేర్ల మార్పు తప్ప రెండిళ్ళూ ఓ పెద్ద కాంపౌండ్లో ఉండేది. తమిళం, కన్నడం, మరాఠీ, ఇక మేము తెలుగువాళ్ళం....భాషలేవైనా అందరం కలిసినప్పుడు మాట్లాడే భాష తమిళమే. అన్ని ఇళ్ళ వాళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. నాకు ఊహ తెలిసి ఎవరి మధ్యా గొడవలు వచ్చిన సందర్భాలు లేవనే అంటాను. పిల్లలందరం రకరకాల ఆటలు ఆడుకునే వాళ్ళం. దాగుడుమూతలు , పాండి, గోళీలు, బొంగరాలు, నొండి, వామనగుంట, రెండు జట్లయి ఒకరు ఒకరికి కళ్ళు మూస్తే ప్రత్యర్థి జట్టులోని ఒకరొచ్చి ముక్కు గిల్లి పోతే అది ఎవరో చెప్పడం, గిల్లీదండా, ఉయ్యాల ఇలా ఎన్ని ఆటలో...మా కాంపౌండ్ నుంచి ఎవరం బయటకు వెళ్ళవలసిన అవసరం లేకుండా పిల్లలందరం ఒక్కటిగా ఆడుకునేవాళ్ళం. పైగా అమ్మాయిలూ ఆబ్బాయిలూ అనే తేడా లేకుండా కలసిమెలసి ఆడుకున్న ఆ రోజులు ఎప్పటికీ మరువలేను. చంద్రు, కుమార్, రేవతి, ముఖేష్, గీత, ఉష, కణ్ణా, రామకృష్ణ, శ్రీను, కన్నమ్మా, హేమా, కుట్టి కుమార్‌, గణ్ణి, ఆంజీ, కళ, తారక్ తదితరులతో కలిసి నేనూ....మా మధ్య ఆటలే ఆటలు. చదువులన్నీ ఆ తర్వాతే. ఆటలు, మాటలతో ఇట్టే రోజులు గడిచిపోయేవి.పాండి అని ఓ ఆట. నిజానికి ఇది అమ్మాయిల ఆటంటారు. కానీ అమ్మాయిలతో కలిసి ఆడేవాళ్ళం. తెలుగులో తొక్కుడు బిళ్ళ. నిన్న రాత్రి తెలుగులో ఈ ఆటను ఏమంటారోనని మా ఆవిడను అడిగితే చెప్పింది తొక్కుడు బిళ్ళ అని. ఈ కాలంలో పిల్లలు ఈ ఆటలు ఆడటం నేనైతే చూడలేదు. ఒకవేళ పిల్లలతో చెప్పినా నవ్వుతారేమో నన్ను చూసి "ఇదీ ఓ ఆటేనా" అని. స్మార్ట్ ఫోన్లలో వాళ్ళాడుకునే ఆటలు ఒకటా రెండా కుప్పలుతెప్పలు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఆటలేవీ శారీరక వ్యాయామానికి పనికొచ్చేవి కానే కావు. పాండీలో నేల మీద ఎనిమిది గళ్ళు గీసుకోడం. అటు నాలుగు ఇటు నాలుగు గళ్ళు. ఓ నల్చదరం (చిన్నపాటిది) రాయి ఒక్కో గడిలోకి విసురుతూ ఆడటం...బలే ఉండేదీ ఆట.పుల్లాంగుయి ( తెలుగులో వామనగుంట)వరండాలో కూర్చుని ఆడుకునే వాళ్ళం. ఈ ఆటకు కావలసిన వామనగుంట రేవతీ వాళ్ళింట్లోగానీ గీతా వాళ్ళింట్లోగానీ ఉండేది. అలాగే చింతపిక్కలు. ఇంట్లో గింజున్న చింతపండు కొనుక్కొస్తే అందులోని పిక్కలన్నీ వేరుచేసి కడిగి ఎండబెట్టి వామనగుంట ఆడుకునేవాళ్ళం.గోళీలు...పేరుకే అబ్బాయిల ఆటైనా అమ్మాయిలూ మాతో కలిసి ఆడటమూ లేదా మేము ఆడుతుంటే చూసి చప్పట్లుకొట్టి ఆనందించేవారు. ఓ చిన్న గుంట చేసి అందులో గోళీలు వెయ్యడం, గోళీలోనే బేందా (తెలుగులో ఏమంటారో తెలీలేదు) అని ఒక ఆట ఆడేవాళ్ళం. రెండు వైపులు గీతలు గీసుకుని ఒకవైపు నుంచి మరొక గడీలోకి మోచేత్తో గోళీని నెట్టుకుంటూ వెళ్ళడం. ఈ థెండు ఆటలూ కాకుండా గోళీలతోనే మరొక ఆట ఆడేవాళ్ళం. ఓ గోడ దగ్గర మూడు వైపులా గీతలు గీసి ఆ గడిలోకి కొన్ని గోళీలు విసిరి వాటిలో ఏది కొట్టాలో ప్రత్యర్థి చెప్తే కొట్టడం. ఈ గోళీలు కొనడం కోసం ఇళ్ళల్లో అమ్మల్ని కాకాపట్టి అయిదు పది పైసలు తీసుకుని దుకాణానికి వెళ్ళి రంగు రంగుల గోళీలు కొనుక్కురావడం. అదొక తంతు. ఇక బొంగరాలాటైతే చెప్పక్కర్లేదు. చిన్నవీ పెద్దవీ బొంగరాలు కొనుక్కురావడం, వాటికున్న మేకులను షార్ప్ నెస్ కోసం గోడకో నేలమీదో రాయడం. నలుపు , ఎరుపు తాళ్ళు కొనడం. ఇద్దరం లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఆడటం. ముందుగా మట్టి నేలలో ఒక వృత్తం గీయడం.ఆ వృత్తంలోకి అందరం ఒక్కసారే బొంగరాలు విడిస్తే ఆ వృత్తంలో ఎవరి బొంగరమైతే మిగిలిపోయేదో ఆ బొంగరాన్ని లక్ష్యంగా చేసుకుని మిగిలిన వాళ్ళు బొంగరాన్ని విడిచి దాన్ని బయటకు తీసుకురావడం. చాలా బాగుండేది. ఇవికాకుండా పులీ - మేకా ఆట, మ్యాచస్ (అగ్గిపెట్లపై ఉండే బొమ్మలు చేర్చటం. షాపుల్లో రకరకాల బొమ్మలు అమ్మేవారు. అయిదు పైసలకు), కర్రాబిళ్ళా, దాయం (అష్టాచెమ్మ), దాగుడుమూతలాట. వీటితోపాటు క్రికెట్టు. మా కాంపౌండలోనే మూడు మామిడి చెట్లతోపాటు ఓ పెద్ద తూంగు మూంజి మరం (తెలుగులో ఏమంటారో తెలీదు. అయితే ఒకటి చెప్పగలను. మనం తాకడంతోనే ఆకులు ముడుచుకుపోయేవి, సాయంత్రం కావడంతోనే ఆకులు ముడుచుకుపోయేవి) ఉండేది. వీటిలో ఏదో ఒక చెట్టుకో గోడకి చాక్ పీస్ తో మూడు గీతలు గీసి వాటినే స్టంప్స్ గా ఊహించుకుని క్రికెట్ ఆడేవాళ్ళం. పడక్కుర్చీలో చెక్కతో బ్యాట్ తయారు చేయించుకుని ఓ రబ్బరు బంతి కొనుక్కు తెచ్చుకుని ఆడేవాళ్ళం. లేదా సైకిల్ రిపేర్ షాపుకెళ్ళి అరిగి పోయిన ఓ రబ్బర్ ట్యూబ్ తీసుకొచ్చి వాటిని వలయాకారంలో కొన్ని ముక్కలు కత్తిరించి ఎండిపోయిన నారింజ కాయకో లేదా కాగితం ఉండగా చుట్టి వాటికి కత్తిరించుకున్న సైకిల్ ట్యూబ్ ముక్కలను చుట్టి బంతి ఆకారం తెప్పించి ఆడుకునేవాళ్ళం. శివరాత్రులు, వైకుంఠ ఏకాదశి రోజున పరమపదసోపానం ఆడేవాళ్ళం.ఇన్ని రకాల ఆటలతో సాగిన బాల్యస్మృతులెప్పటికీ మధురజ్ఞాపకాలే.హాయిగా గడిచిపోయేది కలం. అందుకే ఆ ప్రాయంలోకెళ్ళే అవకాశముంటే ఎంత.బాగుంటుందో కదూ....- యామిజాల జగదీశ్
July 23, 2020 • T. VEDANTA SURY • Memories