ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇంటి దీపం :--కె ఎస్ అనంతాచార్య.
October 13, 2020 • T. VEDANTA SURY • Poem

ముగ్గును చూసి మురిసిపోతాం కడప మీది పసుపు కుంకుమలు చూసి 
కవిత్వమై కదులుతాం

చేతి గాజుల గల గలలు వింటే హృదయంఉప్పొంగి పోతుంది !
కాలిపట్టిల సవ్వడిలోoచి నవ్వుల నాదం ప్రతిధ్వనిస్తుంది!

తులసి కోట దగ్గర దీపం 
 జోతిని పంచే శాంతి కిరణం 

అక్క,చెల్లెలుగా రాకీకట్టి ప్రేమ పంచే
 అమృత తత్వం

పచ్చటి పరికిణి
 నెత్తిన  తెల్లని మల్లెలు
 పండుగలో సందడి చేసే ఆడతనం

ఆలిగా అల్లుకు పోయి  తరాలను
 తరింప జేసే
ఉభయ గోదావరి

ప్రకృతి పురుషునితో కలిస్తేనే కదా ప్రపంచం ఉనికి చాటేది జాతి క్రమం పురుడుపోసుకొనేది

రక్తాన్ని పాలుగ మార్చి
 బోసి నవ్వులకు పంచి
 పురిటి నొప్పుల మరిచిపోయే అమ్మతనం

ముదితల్ నేర్వగ రాని విద్య కలదే......చిటి కెడు ధైర్యం మిస్తే కోటివిద్యలను సాధించి చరిత్రను తిరగ రాస్తారు 

అమ్మాయoటే
పూల గుత్తుల పై వాలిన గoడు తుమ్మెదల ఝoకారం
ఎదురు తిరిగిందంటే విచ్చుకత్తుల వీర విహారం 

అనునయిస్తే ఆకాశానికి ఎత్తేసే అవనీజాత
అవహేళన చేస్తే అధః పాతాళానికి తొక్కే కాళీమాత

ఏ ఇంట అమ్మాయిలు
పారాడుదురో ఆనందం తెప్పల్లోంచి
ఉత్సహo వానై కురుస్తుంది
ఉద్వేగం తోక ముడుస్తుంది
ఉల్లాసం ప్రతి మోమున మెరుపై మెరుస్తుంది

ఇల్లు అనే దీపానికి అణుకువ వత్తిని వేసి 
ఆనందం నూనె పోసి
వెలిగించే వెలుతురు దివిటీ అమ్మాయoటే