ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇక సంతోషమెక్కడుంటుంది---రచన - యామిజాల జగదీశ్
October 15, 2020 • T. VEDANTA SURY • News

ఔను, ఈ ప్రశ్న ఇప్పుడెందుకేసుకున్నానో కదూ...సరే విషయానికొస్తాను. 

ఒక్కొక్కప్పుడు మన సంతోషం మన దగ్గరుండదు. ఇతరుల చేతుల్లో పెట్టి మనం బాధ పడుతుంటాం. 

ఎలాగంటారా?

నేనొక చొక్కా కొన్నాననుకోండి. నాకిష్టపడి నాకు నచ్చి కొనుక్కున్నాను. వేసుకున్నాను. బాగానే ఉంది. సంతోషంగానూ ఉంది. అక్కడితో ఉండిపోయుంటే ఆ సంతోషం నాతోనే ఉండేది. కానీ నేనేం చేస్తానంటే మనసుకి నన్ను అప్పగించి ఏరికోరి బాధపడతాను. ఎలాగనేగా మీ ప్రశ్న....

ఏముంది? నేను వేసుకున్న చొక్కాని ఎవరైనా చూసేరా...చూస్తే ఏమనుకుంటున్నారు....బాగుందంటున్నారా....బాగులేదంటున్నారా....నాకు సరిగ్గా సరిపోయిందంటున్నారా....రంగు బాగులేదంటారా...పొట్టిదైందంటారా....వదులుగా ఉందంటారా....ఇలా రకరకాల ప్రశ్నలు నాకు నేను అనుకుంటాను. ఎదుటివారికి ఈ ప్రశ్నలతో ఎలాంటి సంబంధమూ లేదు. కానీ నాకు నేనే ప్రశ్నలు వేసుకుని జవాబులు తెలీక మనసు బాధ పడుతుంది. అప్పుడు నాకిష్టమై నేను కొనుక్కుని వేసుకున్నప్పుడు సంతోషం నాలో నాతోనే ఉండేది. అక్కడితో ఊరుకోకుండా  అనవసరమైన ప్రశ్నలతో మనసుని ఆలోచనలో పడేసి సంతోషాన్ని కోల్పోవడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? 

ఎప్పుడైనాసరే మనకోసం కాకుండా పక్కింటివారికోసం బతకాలనుకుని అందుకు తగినట్లు మనల్ని మనం మార్చుకుంటూ పోతే ఎప్పటికీ సంతోషమనేదే ఉండదు. లేనిపోని ఇక్కట్లతో కష్టాన్ని కొని చెచ్చుకున్నట్లవుతుంది. కనుక మనకున్నంతలో మన బతుకు బతికితే అది ఆనందమూ. తృప్తీనూ....!!