ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇదీ చందమామ శంకర్ ప్రస్థానం :-రచన - యామిజాల జగదీశ్
September 30, 2020 • T. VEDANTA SURY • News

చందమామ చిత్రకారులైన కె.సి. శివశంకరన్ నిన్న (2020 సెప్టెంబర్ 29) కన్నుమూశారు.  విక్రమాదిత్యుడు తన భుజంమీద బేతాళుడిని మోసుకుంటూ "చందమామ"లో చిన్నా పెద్దా అందరినీ కట్టిపడేసేలా చెప్పిన కథలను ఎవరు మరచిపోగలరు. ఇంతకూ ఆ కథలకు బొమ్మలు వేసిన శివశంకరన్ చందమామ శంకర్ గానే పాఠకులందరికీ పరిచయం.
మొదటి నుంచి బొమ్మలమీదున్న ఆసక్తితోపాటు అందుకు అవసరమైన కృషి చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న శంకర్ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఎంతో పొందికగా రాస్తుండేవారు. ఆయన చేతిరాతకు టీచర్లు క్లాసులో బోర్డుమీద రాయించేవారు. పుస్తకాలలో ఉన్న బొమ్మలను అచ్చు గుద్దినట్లు వేయడాన్ని చూసి డ్రాయింగ్ టీచర్ ఆశ్చర్యపోయేవారు.అంతేకాదు,  ఆదివారాలు డ్రాయింగ్ టీచర్ విడిగా శంకర్ గారితో బొమ్మలు గీయడంలోని మెలకువలు నేర్పేవారు.
హైస్కూల్ చదువు ముగియడంతోనే డ్రాయింగ్ మాస్టర్ సూచన మేరకు ఆర్ట్స్ స్కూల్లో చదువుకున్న శంకర్ కళైమగల్ అనే ఓ తమిళ పత్రికలో నూటయాభై రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరారు. అనీతరం ఆయనకు చందమామలో పని చేసే అవకాశం వచ్చింది. చందమామలో మూడు వందల యాభై రూపాయలు ఇస్తారనే విషయం తెలిసి కళైమగల్ యజమాని శుభాశ్శీసులు చెప్పి పంపించారు. 
చందమామలో విక్రమార్కడు - బేతాళుడు కథలకు వేసిన బొమ్మలతో పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఆయనకన్నా ముందు ఈ బేతాళుడి కథలకు చిత్రాగారు బొమ్మలు వేసేవారు. 
రామకృష్ణా మిషన్ వారి తమిళ మాసపత్రిక రామకృష్ణ విజయంలోనూ బొమ్మలు వేసిన శంకర్  1953లో అంబులిమామ (తమిళ చందమామ) లో మొదటీసారిగా మనకణక్కు అనే కథకు బొమ్మలు వేశారు.
1964 మార్చి నుంచి బేతాళుడి కథలకు బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. 
 ఆయన స్వస్థలం తమిళనాడులోని ఈరోడు పరిధిలోని దారాపురం సమీపంలో గల కాలత్తొయువూర్ గ్రామం. 1924 జూలై 19న జన్మించిన శంకర్ తండ్రిగారి పేరు చంద్రశేఖర దీక్షిత శివ. అప్పయ్య దీక్షితుల వంశపారంపర్యానికి చెందినవారు. తండ్రి ఓ స్కూల్ మాస్టారు. ఆ స్కూల్లోనే శంకర్ చదువుకున్నారు. 1934 లో మద్రాసులో సమీపబంధువు ఒకరు మరణించినప్పుడు ఆ కుటుంబానికి తోడుండటం కోసం శంకర్ తల్లి వచ్చారు. ఆమెతోపాటు శంకర్, ఆయన తమ్ముడు కూడా మద్రాస్ వచ్చారు.
బ్రాడ్వేలో ఓ స్కూల్లో శంకర్ కు ప్రవేశపరీక్ష పెట్టారు. 'George V is our King' అనే మాటలను రాసి చూపమంటే ఈయన తప్పుల్లేకుండా అందంగా రాశారు. దాంతో ఆయనకు ఆ కార్పొరేషన్ స్కూల్లో సరాసరి అయిదో క్లాసులో సీటిచ్చారు.ఆ తర్వాత లింగచెట్టి వీధిలో ఉన్న ఓ స్కూల్లోన, ముత్యాలపేట హైస్కూల్లోనూ చదువుకున్న శంకర్ కి చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయడమంటే మహా ఇష్టం. డ్రాయింగ్ టీచర్ ఆశీస్సులు ఫలించి ఓ స్థాయికి ఎదిగిన శంకర్ ని బిఏ, ఎంఏ వంటివి చదవొద్దని చెప్పి ఆర్ట్స్ స్కూల్లో చేరమని చెప్పి బొమ్మలు గీయడంలో ఎంతగానో ప్రోత్సహించింది ఆ మాస్టారే. ఆర్ట్స్ కాలేజీలో చదువైన తర్వాత చిత్రకారుడు శుభ (అముదసురభి అనే తమిళపత్రిక) ద్వారా కళైమగల్ పత్రికలో చేరిన శంకర్ కు మొదట ఇచ్చిన జీతం ఎనభై అయిదు రూపాయలు. 
ఇక్కడ నూటయాభై రూపాయలవరకూ ఆయన జీతం పెరిగింది. ఇంతలో ఆయనకు చందమామ ఆఫీసు నుంచి పిలుపు రావడంతో శంకర్ వెళ్ళారు. అక్కడ నాగిరెడ్డిగారినీ, చక్రపాణిగారినీ కలిసి తాను కళైమగల్ మ్యాగజైన్ లో పని చేస్తున్నానని, కావాలంటే పీస్ వర్క్ కింద కొవాలంటే బొమ్మలు వేసిస్తానని శంకర్ చెప్పారు. అప్పటికే కుముదం‌, కల్కండ్, పేసుంపడం తదితర పత్రికలకు తానిలాగే బొమ్మలు వేస్తున్నట్లుకూడా చెప్పుకున్నారు. అయితే నాగిరెడ్డి గారు తమకు స్టాఫ్ ఆర్టిస్టుగా కావాలనుకుంటున్నామని చెప్పి ఎక్కువ జీతానికి ఒప్పించి పనిలోకి తీసుకున్నారు.
చందమామలో బేతాళుడి కథలకు వేసిన బొమ్మలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన శంకర్ ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మలు గీస్తున్నది మీరేగా అంటూ గౌరవించేవారు. 
1981లో రామకృష్ణవిజయం సంపాదకులు స్వామి కమలాత్మానంద. ఆయన ఓమారు నాగిరెడ్డిగారి వియ్యంకుడైన రమణారెడ్డిగారితో మాట్లాడుతూ చందమామ సంస్థకు చెందిన ఎవరైనా చిత్రకారుడితో తమ పత్రికకు బొమ్మలు వేయించుకోవాలనుందని చెప్పారు. అప్పుడు రమణారెడ్డిగారు శంకర్ తో మాట్లాడి స్వామి కమలాత్మానందను కలవమన్నారు. అలాగేనని శంకర్ రామకృష్ణామఠానికి వెళ్ళి కమలాత్మానందను కలిశారు. స్వామీజీ కర్ణుడి కథ ఇచ్చి బొమ్మలు వేసి తీసుకురమ్మన్నారు. అయితే శంకర్ చందమామ నిర్వాహకులలో ఒకరైన నాగిరెడ్డిగారి కుమారుడు విశ్వనాథరెడ్డిగారి దగ్గర స్వామీజీ విషయం చెప్పి ఆయన అనుమతితో రామకృష్ణవిజయంలో బొమ్మలు గీయడం మొదలుపెట్టారు.
శంకర్ కి చిత్రకారులందరి బొమ్మలూ ఇష్టమే. ఎవరి స్టయిల్ వారిదనేవారు. ముఖ్యంగా తమిళ చిత్రకారుడు గోపులు బొమ్మలంటే ఆయనకు మరీ మరీ ఇష్టం. బొమ్మలంటే శంకర్ కు ప్రాణం. పూర్వజన్మసుకృతం వల్లే తాను దశాబ్దాలపాటు బొమ్మలు గీయగలిగానని చెప్పుకునే శంకర్ తనకు రామకృష్ణపరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద తనకు మానసిక గురువులనికూడా అంటుండేవారు.
ఆయనకు అయిదుగురు కొడుకులు. ఒక కుమార్తె. కుమారులలో ఒకరు పోయారు. ఒకతను కెనడాలో ఉన్నాడు. మిగిలిన ముగ్గురు కుమారులూ కూతురూ మద్రాసులోనే ఉన్నారు. వీరందరూ బొమ్మలు వేస్తారు. కొడుకులకంటే కూతురు బాగా బొమ్మలు వేస్తుంది. కానీ తండ్రిలాగా వారెవరూ చిత్రకళనే జీవితంగా మలచుకోలేదు.
చిత్రకళే కాదు, ఏ కళైనా దైవసంకల్పమని శంకర్ అభిప్రాయం. నిజమే అది.