ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉత్తమ జీవన విధానం యోగ: - డాక్టర్ రాయారావు సూర్య ప్రకాశ్ రావు--ఆధునిక జీవనంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం లేకుండా క్షణం కూడా గడవదు. రోజంతా నిరంతరాయంగా పనిచేస్తున్న టీవీలు దాదాపు అన్ని ఇళ్లలోనూ కనబడతాయి. ప్రతి ఒక్కరి చేతిలోనూ అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు ప్రజా జీవితంలో సమాచార విప్లవాన్ని తీసుకొచ్చాయి. ఏ వార్త అయినా క్షణంలో అరచేతిలోకి చేరిపోతోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లేనిదే క్షణం గడవని ఈ రోజుల్లో వాటివల్ల అనేక ఉపద్రవాలు పొంచుకుని ఉన్నాయి. ఫేస్ బుక్, వాట్స్ అప్ ల నిరంతర వినియోగం కళ్లపై, గుండెపై ఒత్తిడి పెంచుతోంది. నిరంతరం టెన్షన్ కు గురయ్యేలా చేస్తున్నాయి ఆధునిక స్మార్ట్ ఫోన్లు. ఆధునిక జీవన విధానం తీసుకొచ్చిన ఈ మార్పుల పర్యవసానంగా ఆరోగ్యపరంగా, సామాజికపరంగా అనేక నష్టాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతిక విప్లవం పైన పేర్కొన్న సమస్యలను సృష్టిస్తే, ఆధునిక భోజన అలవాట్లు మరిన్ని సమస్యలకు దారితీస్తున్నాయి. మనిషి జీవితంలోని వేగాన్ని ప్రతిబింబించే ఫాస్ట్ ఫుడ్ వాడకం ఆరోగ్యపరమైన సమస్యలను తీసుకొస్తోంది. ఎసిడిటీ, మలబద్దకం, కడుపునొప్పి తదితర ఆరోగ్య సమస్యలు పనిపై ఏకాగ్రతను నిరోధిస్తున్నాయి. ఉత్పత్తి పై కూడా పరోక్షంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. పైన పేర్కొన్న సమస్యలన్నింటికీ ఉత్తమ పరిష్కార విధానం యోగ. అందువల్లే జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవం నిర్వహించాలని 2014 డిసెంబరు 11న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. యోగ వ్యాప్తి లక్ష్యంగా 2015 నుండి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ‘యోగ’ అనే పదం ‘యుజ్’ అనే సంస్కృత పదజన్యమని కొందరు పండితుల భావన. ఐక్యం కావడం, కలవడం మొదలైన అర్థాలు దీనికి ఉన్నాయి. ‘అష్టాధ్యాయి’ కర్త పాణిని అభిప్రాయం ప్రకారం ‘యుజిర్ యోగ’, ‘యుజ్ సమాధౌ’ అనే పదాలనుండి ‘యోగ’ అనే పదం పుట్టింది. పాశం, బంధం, ఏకాగ్రత మొదలైన అర్థాలు ఈ పదాలకు ఉన్నాయి. వీటిలో ‘యుజ్ సమాధౌ’ అనే పదమే సరైనదని అధికుల భావన. పతంజలి కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. లక్ష్య సాధనకు అవలంబించే ప్రక్రియనే యోగగా మరికొందరు పేర్కొంటారు. శరీరాన్ని, మనసును అదుపులో ఉంచే అత్యుత్తమ విధానంగానూ భావిస్తారు. యోగను ఒక తత్వ శాస్త్ర శాఖగా భావించేవారు కూడా ఉన్నారు. పదివేల సంవత్సరాలకు పూర్వమే యోగ ఉందని కొందరు చరిత్ర కారుల అభిప్రాయం. రుగ్వేదంలో కూడా యోగ ప్రసక్తి ఉంది. భగవద్గీత, ఉపనిషత్తులలోనూ యోగ ప్రస్తావన ఉంది. పాణిని విశ్లేషణ ప్రకారం యోగకు ఎనిమిది అంగాలున్నాయి. మొదటిది యమం. నిబంధనల గురించి చెప్పే అంగమిది. అహింస, సత్యం, అస్తేయం (దొంగతనానికి పాల్పడకపోవడం), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (భౌతిక వస్తువులను కలిగి ఉండకపోవడం) అనే ఐదు ఈ అంగంలోని నిబంధనలు. రెండో అంగం నియమం. వివిధ అలవాట్లు, ప్రవర్తనల గురించి ఈ అంగం తెలియజేస్తుంది. శౌక (శారీరక, మానసిక స్వచ్ఛత), సంతోషం, తపస్సు, స్వాధ్యాయం (వేదాధ్యయనం), ఈశ్వర ప్రాణి ధాన (ఈశ్వరుని గురించి, వాస్తవికత గురించి తెలుసుకోవడం) అనే ఐదు అంశాలు నియమం కిందికి వస్తాయి. యోగలో మూడో అంగం ఆసనం. సౌకర్యవంతంగా నిలిచి ఉంచే భంగిమగా ఆసనాన్ని పేర్కొంటారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందజేసేందుకు పలు ఆసనాలు దోహదం చేస్తాయని ప్రాచీన యోగాచార్యుల విశ్వాసం. వీటిలో పద్మాసనం, వీరాసనం, స్వస్తికాసనం, దండాసనం, సోపశ్రయాసనం, పర్యాంకాసనం, క్రౌంచ- నిషాదాసనం, హస్త నిషాదాసనం, ఉష్ట్ర నిషాదాసనం, సమ సంస్థాపనాసనం, స్థిర సుఖాసనం అనే పన్నెండు ఆసనాలు ప్రధానమైనవిగా భాష్యకారుడు పేర్కొన్నారు. యోగలో నాలుగో అంగం ప్రాణాయామం. ‘ప్రాణ’, ‘ఆయమ’ అనే రెండు పదాల నుండి ఈ పదం ఏర్పడింది. శ్వాసను క్రమబద్దీకరించడమని ఈ రెండు పదాలకర్థం. ఉచ్చ్వాస, నిశ్వాసల ఆధారంగా ప్రాణాయామం చేస్తారు. ఐదో అంగం ప్రత్యాహారం. తనను గురించి తాను తెలుసుకోవడం. భౌతిక అంశాల పట్ల మమకారాన్ని తొలగించడం ఇందులో ప్రధానమైనవి. ఆరో అంగం ధారణం. ఏకాగ్రతను పెంపొందించడమని దీని అర్థం. ఏడో అంగం ధ్యానం. ధారణ చేసే పద్ధతే ధ్యానం. మనసుకు విశ్రాంతిని ఇవ్వడం దీని లక్ష్యం. ఎనిమిదో అంగం సమాధి. అలౌకిక ఆనందంలో తేలియాడే పరిస్థితి ఇది. ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితి ఇది. స్వీయ అస్తిత్వాన్ని సైతం మర్చిపోయే స్థితిగా దీన్ని పేర్కొంటారు. యోగను ఒక జీవన విధానంగా ఆచరించడం వల్ల అనేక లాభాలున్నాయి. శరీర భాగాల పటుత్వాన్ని పెంచడంలో యోగ ఎంతో ఉపకరిస్తుంది. ఆధునిక జీవన శైలిలో మనిషి ఎక్కువకాలం ఏదో ఒక పనిపై, వ్యాపకంపై దీర్ఘకాలం కూర్చోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగ చాలా ఉపకరిస్తుంది. యోగను ఆచరించడం వల్ల శరీరానికి ఎంతో శక్తి వస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో సమతుల్యత కూడా యోగ వల్ల సిద్ధిస్తుంది. కీళ్లలో దృఢత్వానికి యోగ దోహదం చేస్తుంది. వివిధ శరీర భాగాల్లో నొప్పికి దివ్యౌషధం యోగ. మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నివారణకు యోగ ఎంతగానో ఉపకరిస్తుంది. శరీర సంబంధమైన, మానసిక సంబంధమైన రుగ్మతలను ఎదుర్కోవడంలో యోగ పాత్ర అనిర్వచనీయం. ఆత్మవిశ్వాసాన్ని అందించడంలోనూ యోగ దోహదకారి. శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మలచడంలో యోగ ఎంతో మేలు చేస్తుంది. అందుకే యోగను కేవలం వ్యాధి వచ్చినప్పుడు ఉపయోగించే ఔషధంలా కాకుండా ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోవాలి. జీవితంలో యోగ ఒక భాగం కావాలి.
June 24, 2020 • T. VEDANTA SURY • News