ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపాధ్యాయపర్వం-11: --రామ్మోహన్ రావు తుమ్మూరి
November 22, 2020 • T. VEDANTA SURY • Memories


నేను ఉద్యోగంలో చేరిన తొలిరోజున నాగరాజు రామస్వామి గారు మా డిపార్టుమెంటుకు వచ్చి మా ఇంఛార్జ్ శ్రీధరన్ గారిని కలిసి నా కేమైనా అవసరముంటే చూసుకొమ్మని చెప్పినట్లున్నారు.వారిద్దరూ డిపార్టుమెంటు హెడ్స్ హోదాలో ఒకరనొకరి గౌరవించకోవడమే గాక అతి సౌమ్యుడు,మితభాషి అయిన శ్రీధరన్ గారు మంచి స్నేహితులుగా కూడా ఉండటం తరువాత గమనించాను. ఇంఛార్జ్ రూం నుండి బయటికి వచ్చి ల్యాబొరేటరీ స్టాఫ్ లో ఆయనకు పరిచయమున్న ఆదినారాయణ గారి దగ్గరికి వచ్చి నన్ను ఆయనకు అప్పజెప్పారని చెప్పవచ్చు. ఆదినారాయణ గారు మా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి దగ్గరి ఎలిగేడు గ్రామవాసి. అలా ఏకజిల్లా వాసులం అనే అభిమానం కొంచెం ఉండటం సహజం.అన్నట్టుగానే ఆదినారాయణ గారు నాకు ముందుగా ధైర్యాన్నిచ్చారు.
మరో ముఖ్యమైన విషయం ఆయన మా ఇంఛార్జ్ గారికి బాగా సన్నిహితుడు. ఆయనకు ఏ అవసరం పడినా ఆయన సహాయమందించేవారు.మా శ్రీధరన్ గారి గురించి ఆదినారాయణ గారే చెబితే తెలిపింది.ఆయన భార్య కు కండ్లు కనపడవు.ఈయనే అన్ని ఏర్పాట్లు చేసి డ్యూటీకి వచ్చేవారు.ఆమెను గాజు బొమ్మలా చూసుకొనే వారు.ఆ విషయం తెలిసిన తరువాత నేను అప్పుడప్పుడూ ఆయన ఇంటికి వెళ్లి ఏవైనా అవసరాలుంటే తీర్చే వాడిని.ఆ తరువాత ఏర్పడిన చనువుతో ఆయన సాంగ్ లావు మీద కేరళ వెళ్లినపుడు వాళ్ల ఇంటిని కాపాడటానికి
ఆయన క్వార్టర్ లో ఉండేవాణ్ని ఇంకో మిత్రుడు ఫ్రాన్సిస్ తో పాటు.ఇద్దరం బ్యాచిలర్లం.ఫ్రాన్సిస్ మలయాళీ. మా ఇద్దరిదీ ఒకేసారి అపాయింట్ మెంట్.ఆయన మా ఇంఛార్జ్ ఫ్రెండ్ వర్గిస్ క్యాండిడేట్.ఫ్రాన్సిస్ కు కూడా  ల్యాబ్ లోనే పోస్టింగ్ నాతో పాటే. అప్పట్లో  సర్సిల్క్ లో ఇంటర్వ్యూలు జరిగిన తరువాత క్యాండిడేట్స్ ని ప్లాంట్ సైడు కానీ ల్యాబ్ లోకానీ తీసుకునేవారు.అలా మా బ్యాచ్ లో మేమిద్దరం ల్యాబ్ లో చేరాం.
     ఆదినారాయణ గారు నేను చేరిన సమయంలో సొల్యూషన్ బెంచ్ పని చేసేవారు.ముందు ఒక వారం రోజులు జనరల్ షిఫ్ట్ లో వెళ్లాను.ఆ వారం రోజులు ఆయన దగ్గరే గడిపాను.టూకీగా ల్యాబ్ కు సంబంధించిన విషయాలు తెలిపి నా బెరుకును తీసేశారు.వారం తరువాత గురువారం ఆఫ్ లో ఫాలో కమ్మన్నారు. అది ట్రెయినింగ్ పీరియడ్ గనుక ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వరు.
అందులో పని చేసే షిఫ్ట్ కెమిస్టుల వర్క్ అబ్జర్వ్ చేస్తూ వారి వద్ద పని నేర్చుకోవాలి.వారు చేసిన సాంపిల్స్ మనం కూడా చేస్తూ రిజల్ట్ చాలా చేసుకుంటూ వారి చేత మనం వర్క్ లో శిక్షణ బాగా పొందామనే విషయం ఇంఛార్జ్ కు తెలిస్తే అప్పుడు మనకు ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తారు.అలా నేను మొదటిసారి థర్స్డే ఆఫ్ లో చేరినపుడు షిఫ్ట్ ఇంఛార్జ్ గా వెంకటేశ్వర్లు గారున్నారు.మొదట్లో అందరూ ఆయన షిఫ్ట్ లోనా జాగ్రత్త అని హెచ్చరించారు కానీ ఆయన నా తరువాతి జీవితంలో అత్యంత ప్రధానమైన వ్యక్తిగా ఈనాటికీ అత్యంత ఆప్తులుగా మారటం కేవలం విధివిలాసం.ఆయన గురించిన వివరాలు తరువాత వివరిస్తాను. ప్రస్తుతం మిత్రులు ఆదినారాయణ గురించి చెబుతాను.ఆయన ఒక రోజు నన్ను వేరుగా పిలిచి అడిగారు.నీకు ఎన్ని డ్రెస్సులున్నాయి అని. చెప్పాను రెండు ప్యాంట్లు రెండు షర్టులు.మిత్రులారా మీకు పేదరికం అంటే ఏమిటో తెలిసే అవకాశం తక్కువ.కాలికి చెప్పులు లేక చదువుకున్నవాళ్లం.అరిగిన స్లిప్పర్లకు పిన్నీసులు పెట్టి అడ్జస్టయిన వాళ్లం. సైకిలు తొక్కటం వల్ల ప్యాంట్లు వెనుకవైపు చిరిగితే రఫ్ చేయించుకుని తొడుక్కున్న వాళ్లం.నేనిప్పుడు చెప్పడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు.నా కున్న ఆ రెండు డ్రెస్సులు కూడా ఎవరో దయా దాక్షిణ్యాల వల్ల పొందినవే.వాటినే ఉతుక్కుని ఒకటి మార్చి ఒకటి తొడుక్కునే వాణ్ని.అవి కూడా నా లేమిని దాచే విధంగా లేకపోవడంతో ఆయన అలా అడిగారు.వెంటనే నా పరిస్థితి గమనించి (అప్పట్లో చాలమంది నా పరిస్థితిలో ఉన్నవారే) మొదానీవాళ్లింట్లో రెండు డ్రస్సులకు బట్టలిప్పించి అప్పట్లో కాగజ్నగర్ లో పేరున్న టైలర్ ఈశ్వరి సా దగ్గర కుట్టించారు.ఇదే ఈశ్వర్ సా మళ్లీ ఉపాధ్యాయ జీవితంలో ఒక ముఖ్యవ్యక్తి అవుతాడని అప్పుడు తెలియదు.ఆ విషయం కూడా ముందు ముచ్చట్లలో వస్తుంది.అది ప్రక్కన పెడితే ల్యాబ్ లో ఆయన ఆదినారాయణ గారిది జనరల్ షిఫ్ట్ నాది థర్స్ డే ఆఫ్ గనుక శుక్ర శని మధ్యాహ్నం బి షిఫ్ట్ లో అయిదింటి దాకా మండే ఏ షిఫ్ట్ లో కలిసిన సమయంలో అటు బెంచి వర్క్ చేస్తూ ఇటు ఈయన చేసే పని గమనించేవాణ్ని.మూడు నెలల తరువాత ఇండిపెండెంట్ షిఫ్ట్ ఇవ్వటం రెండేళ్లపాటు వివిధ షిఫ్టుల్లో పనిచేయటం,దీనితో పాటు సొల్యూషన్ బెంచ్ వర్క్ పూర్తిగా ఆదినారాయణ గారిదగ్గర నేర్చుకోవటం ఆయన భరోసా మీద మూడో సంవత్సరమే నాకు ఆ బెంచి అలాట్ చేశారు.ఆ తరువాత ఆదినారాయణ గారు ఎందుకో ప్రింటింగ్ డిపార్టుమెంటుకు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లారు. ఆయన గురించే మరో విషయమేమంటే ఆయన మ్యాథమాటిక్స్ ట్యూషన్ చెప్పేవారు.బ్యాచిలర వారీగా ఆయన కాగజు నగర్లో ఉన్నన్ని రోజులు మ్యాథ్స్ ట్యూషన్లు కొనసాగాయి.ఆయనే నా పరిస్థితి గమనించి నాకు ట్యూషన్లు చూపించారు. కాబోయే ఉపాధ్యాయ వృత్తికి అలా బీజం పడిందన్న మాట.
ఈ ముచ్చట్లు రాస్తుంటే అనేక విషయాలు గుర్తుకు వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆదినారాయణ గారు హనుమకొండలో స్థిరపడ్డారు. మొన్నామధ్య వాళ్ల మనుమరాలి పెళ్లికి పిలిస్తే వెళ్లి వచ్చాను. మొదానీ బట్టల కొట్లో డబ్బు మూడు వాయిదాల్లో తీర్చాను.పెళ్లి అయిన తరువాత మా ఇంటి వెనుక ఇల్లే మొదానీ వాళ్ల ఇల్లుండేది.ఆ తరువాత ఎన్ని సార్లు వాళ్ల దగ్గర బట్టలు కొన్నామో.(సశేషం)