ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపాధ్యాయపర్వం-2: - రామ్మోహన్ రావు తుమ్మూరి
November 13, 2020 • T. VEDANTA SURY • Memories

గతంలో వేరే సందర్భంలో వివరించినా ఈ వ్యాసపరంపరలో కూడా కొంత సర్సిల్కు మిల్లు గురించి చెప్పాలి.
     ఇంగ్లీషులో రాయటంతో  సిర్ కు బదులు సర్ అయింది.సిర్పూర్ పేపర్ మిల్లు లాగే సిర్పూర్ సిల్క్ మిల్లును క్లుప్తంగా సిర్+సిల్క్  అని నామకరణం చేశారు.M/S Sirsilk Ltd.మనకు Sir ను సర్ అనటం అలవాటు కనుక సిర్సిల్క్ కాస్తా సర్సిల్క్ అయింది.ఇంతకీ ఈ మిల్లులో తయారయ్యేది అసలైన సిల్కు (పట్టు) వస్త్రాలు కావు.కృత్రిమ సిల్క్ గుడ్డ.ఒక రకంగా ఇది రసాయనిక
పదార్థాలతో తయారయ్యే గుడ్డ.దానికి ముడి పదార్థం కాటన్ అయినా అక్కడ తయారయ్యే గుడ్డ కాటన్ గుడ్డ కాదు. కాటన్ ను రసాయనిక పరిభాషలో సెల్యులోజ్ అంటారు.ఇక్కడికి దిగుమతి
అయ్యే కాటన్ చేనేతకు ఉపయోగపడని 
 వ్యర్థపదార్థం. అంటే పత్తి గింజలనుండి 
జిన్నింగ్ మిల్లుల్లో మొదటి సారి తీసిన ప్రత్తి(కాటన్)పొడవైన ఫైబర్ కలిగి చేనేతకు ఉపయోగ పడుతుంది.దీనిని ఫస్ట్ కట్ కాటన్ లింటర్స్ అంటారు.అలాగే సెకండ్ కట్ ,థర్డ్ కట్ కాటన్ లింటర్స్ కూడా ప్రత్తి గింజలనుండి తీస్తారు.అది పొడవులేని ఫైబర్ కనుక చేనేతకు పనికి రాదు.ఆ వ్యర్థ పదార్థం ఇక్కడ ముడి సరుకు.
ఈ సెల్యులోజ్ ను సెల్యులోజ్ ఎసిటేట్ చేయటం ఈ మిల్లు రసాయనిక విభాగంలో మొదటి మెట్టు.సెల్యులోజ్ ఎసిటేట్ ఎందుకు చేయాలో ముందు చెప్పి ఎలా చేస్తారో తరువాత చెబుతాను. 
సెల్యులోజ్ ఎసిటేట్  చూడటానికి మరమరాలలాగా తెల్లగా ఉండే పదార్థం.ఇది అసిటోన్ అనే రసాయనిక ద్రవంలో వేస్తే కరిగిపోతుంది. అది అలా కరిగినప్పుడు దానికి తళతళా మెరిసే గుణం వస్తుంది.ఈ అసిటోన్ అనే రసాయనిక ద్రవం గది ఉష్ణోగ్రతలో ఇగిరి పోతుంది.ఈ రసాయనిక లక్షణం ఆధారంగా సెల్యులోజ్ ఎసిటేట్ ను మెరిసే యార్న్ గా మార్చటం రెండవ మెట్టు.యార్న్ తో బట్టలు నేయటం మూడవ మెట్టు.
    ఇక మొదటిది వద్దాం.జిన్నింగ్ మిల్లులనుండి వచ్చిన షార్ట్ ఫైబర్ కాటన్ లింటర్స్ ను ముందుగా శుద్ధి చేయటం కాటన్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ (C.P.Plant ) జరుగుతుంది.దానిని కాస్టిక్ సొల్యూషన్ లో ఉండికించి దానినుండి అమలినాలన్నీ తొలగించి ఆ తరువాత బ్లీచింగ్ చేయటం జరుగుతుంది.ఇది రసాయనికంగా 100% సెల్యులోజ్.మీకు సులభంగా అర్థం కావాలంటే మనకు అనేక వస్తువులకు ప్యాకింగ్ చేసే తెల్లటి అట్ట నే సెల్యులోజ్.అది ముక్కలు ముక్కలుగా చేస్తే ఎలా ఉంటుందో అలాంటిది ఇక్కడ తయారవుతుంది.
సెల్యులోజ్ ను సెల్యులోజ్ ఎసిటేట్ గా మార్చాలంటే దాన్ని ఎసిటిక్ ఏసిడ్ మరియు ఎసిటిక్ ఎన్ హైడ్రైడు మిశ్రమంలో కలపాలి.ఇదంతా సెల్యులోజ్ ఎసిటేట్ ప్లాంట్ (Cellulose Acetate Plant) లో జరుగుతుంది.
ఇక ఎసిటిక్ ఏసిడ్,ఎసిటిక్ ఎన్ హైడ్రైడు,ఎసిటోను ఇవి మూడు కూడా ఇథైల్ ఆల్కహాలుతో తయారవుతాయి.
కనుక ఇథైల్ ఆల్కహాలును శుగర్ ఫ్యాక్టరీల నుండి తెచ్చి దానితో పైన చెప్పిన మూడు రసాయనిక ద్రవాలను
మూడు ప్లాంటులలో తయారు చేసేవారు.వాటిని  ఫేజ్ వన్,ఫేజ్ టు,ఫేజ్ థ్రీ అని పిలిచేవారు.Phase-I Acetic Acid plant, Phase-II Acetic Anhydride plant, Phase-III Acetone Plant .
ఫ్యాక్టరీ లోనికి వెళ్లగానే ఎడమ చేతివైపు 
పైన చెప్పిన ప్లాంట్లన్నీ ఒకదాని ప్రక్కన మరొకటి ఎత్తైన గోడలతో ఒక్కొక్కటి మూడు నాలుగు అంతస్తులు గల సిమెంటు రేకు కప్పుల బృహన్ని ర్మాణాలుండేవి.మరో వైపు యార్న్ తయారీ పర్న్ వైండింగ్,సైజింగ్, వీవింగ్ విభాగాలుండేవి. ఇవి కాకుండా వాటర్ ప్లాంట్ ,బాయిలర్ హౌజ్,వాటర్ చిల్లింగ్ 
గ్యాస్ ప్లాంట్,ఎలక్ట్రిసిటీ డిపార్టు మెంటు,ప్రింటింగ్ ,ఫోల్డింగ్ ,పర్చేజ్,స్టోర్స్ ,టైమాఫీసు,క్యాంటీన్  జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్,ఫైర్ డిపార్ట్మెంటు వీటన్నింటితో మా జనరల్ ల్యాబ్  తో ఆదో చిన్న ఊరే లోపలికి వెళ్లామంటే.(సశేషం)
[ఇది పేపరుమిల్లు ఫోటో సర్సిల్క్ కూడా ఇలాగే ఉండేది]