ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపాధ్యాయపర్వము-9: -- రామ్మోహన్ రావు తుమ్మూరి
November 20, 2020 • T. VEDANTA SURY • Memories

ఎంతమేరకు చెప్పాలనేది నన్ను కొంచెం సంధీగ్ధంలో పడేస్తున్నది.ఒక శిథిల యంత్రాలయం ముచ్చట్లు, ఆవగింజం తైనా ఆనవాళ్లు మిగలని విషయాలు ఏవి చెప్పాలి,ఏవి వదలి వేయాలి అన్న మీమాంసలో పడ్డానిప్పుడు.తెలిసినవి చాలా ఉన్నాయి.గుర్తున్నవి కూడా చాలానే ఉన్నాయి.అందులో  వేటిని వదలి వేయాలనే విచికిత్స కలుగుతున్నది. ఎందుకంటే ఒక వ్యవస్థ  వెనుక ఎన్ని విషయాలుంటాయి అనే విషయాన్ని గనుక పరిశీలిస్తే చాలా విషయాలు వివరించాలి.గాలివానకు కూలిపోయిన చెట్టు వలె మూతబడిన సర్సిల్కు అనేక మందిని నిరాశ్రయులను చేసింది.ఎలా చేసిందో ఒకసారి పరిశీలిద్దాం.
     ఒక మిల్లు లేదా కర్మాగారము పని చేయాలంటే కేవలము మూలపదార్థా లైన  ముడిసరుకులు,తయారు చేసే యంత్రాలు మాత్రమే సరిపోవు. ఉదాహరణకు నీరు తీసుకుందాం.
కాగజ్ నగర్ పక్కనే ఉన్న పెద్దవాగు ఏ కాలంలో నైనా ఎండిపోకుండా నీరు ప్రవహించేది.అయితే అది ఫ్యాక్టరీకి ఎంత లేదన్నా రెండు మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది.అక్కడి నీరు ఇక్కడి దాకా రావాలంటే దానికి తగిన ఏర్పాట్లు కావాలి.అందుకు రెండు మిల్లులకు కలిపి పెద్దవాగు ఒడ్డునే ఒక పంప్ హౌజ్ నిర్మాణం చేయబడింది. అత్యధికంగా నీటి వాడకం ఉన్న రెండు ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద వాటర్ ప్లాంట్లున్నాయి. నిరంతరం వచ్చే నీటి నిలువలకోసం పెద్ద పెద్ద వాటర్ టాంకుల నిర్మాణం.వారు నీటిని నేరుగా బాయిలర్ హౌజులో గాని ఇతర చోట్ల గాని వాడటానికి వీలు లేదు.దాన్ని స్వాదువు జలంగా మార్చాలి. అలా మార్చడానికి పద్ధతి ప్రకారంగా నిర్మించబడిన వేలలీటర్ల కెపాసిటీ టాంకులు,పంపులు. అలా అదో పెద్ద వ్యవస్థ.అందులో పనిచేసే వర్కర్లు, ఆపరేటర్లు,సూపర్ వైజర్లు, ఇంజనీర్లు , వీరందరినీ అజమాయిషీ చేసే డిపార్ట్మెంటు ఇంఛార్జ్ .
ఇలాగే బాయిలర్ హౌజు అందులో కంపెనీ అవసరాన్ని బట్టి పది పదహేను బాయిలర్లుండేవి.దానికి ఇటు వాటర్ సప్లై,అటు బొగ్గు సప్లై అవసరం.బొగ్గు సింగరేణి,బ్లాక్‌లా ఇతర ప్రాంతాల నుండి వ్యాగన్లలో వచ్చేది.అలాగే రైల్వే వ్యవస్థ.అది బొగ్గు,ముడి కాటన్,ఆల్కహాలు,పలు యంత్ర భాగాలు వంటివస్తువులను దిగుమతి చేసుకోవడం,తయారైన వస్తాలు కొన్ని బైప్రాడక్ట్స్ గా తయారైన రసాయన పదార్థాలను ఎగుమతి చేయడం ఇలా అదో పెద్ద వ్యవస్థ.షిఫ్టుకు ఎంత లేదన్నా వెయ్యి మంది పనిచేసే మిల్లు గనుక ఎనిమిది గంటల వ్యవధిలో ఉపాహారాల శాల క్యాంటీన్ నిర్వహణ అతి పెద్దది.మా సర్ సిల్కు క్యాంటీన్ దాదాపు ఒక సినిమా హాలంత పెద్దది.టైముల ప్రకారంగా పెద్ద ఎత్తున టీ టిఫిన్ల తయారీ ఏర్పాట్లు,సబ్సిడీ రేట్లకు సప్లై చేయటం అదో పెద్ద వ్యవస్థ.
అలాగే సెక్యూరిటీ వ్యవస్థ.కర్మాగారం గనక అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి.కనుక ఫైర్ సర్వీసు .
యంత్ర సంబంధమైన రిపేర్లు వగైరాల వంటి వాటికి పెద్ద వర్క్ షాపు,కంపెనీ మొత్తానికి కావలసిన అన్ని సరుకులు తెప్పించడ నిలువ చేసి అవసరానుగుణంగా సప్లై చేయడానికి అతి పెద్ద స్టోర్స్ డిపార్టుమెంటు ఉండేది.తయారైన వస్త్రాలు స్థానికంగా అమ్మడానికి ఒక షోరూమ్, కార్మికులకు న్యాయపరమైన సమస్యల నిమిత్తం లేబర్ ఆఫీసు,పర్మనెంట్ కార్మికులు,క్యాజువల్ కార్మికపు వాళ్ల హాజరుకు సంబంధించిన టైం ఆఫీసు,
అలాగే ఇంకో ముఖ్యమైనది ఎలక్ట్రికల్ డిపార్టుమెంటు.ఇందులో కొంత పవర్ సప్లై రామగుండంల పవర్ స్టేషన్ నుండి వస్తే,కొంత కంపెనీ జనరేటర్ల ద్వారా ఉత్పత్తి అయ్యేది.
కంపెనీ లోపల బయట కాలనీ కి సంబంధించిన ఏ సివిల్ పనులకైనా ఓ పెద్ద సివిల్ డిపార్ట్ మెంటు, ఉద్యోగస్థులకు కావలసిన ఫర్నిచర్ తయారీకి కార్పెంటరీ డిపార్ట్మెంట్,అలాగే చాలా చోట్ల అవసరమయ్యే శీతల జలాలకై చిల్లింగ్ ప్లాంట్,మరియు బ్రైన్ వాటర్ ప్లాంట్,ఉత్పత్తికి కావలసిన ప్రొడ్యూసర్ గ్యాస్ ప్లాంట్ ఇలా ఒక మిల్లు వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఆధారపడి ఉంటారు.చెప్పటం మరిచాను.ఇంత ఫ్యాక్టరీ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడానికి సానిటేషన్ డిపార్టుమెంటు ఉండేది.ఇవన్నీ చేయడానికి ఎంతమంది ప్రతిరోజూ పనిచేయాలి ఆలోచిస్తే ఒక వ్యవస్థ వెనుక ఉండే అవస్థ తెలుస్తుంది.ఇప్పుడు చెప్పండి ఇదంతా చెప్పలృవలసినదే కదా.ఇంకా ఏమైనా మరచిపోయినా ఆశ్చర్య పడనవసరం లేదు.(సశేషం)