ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపాధ్యాయ పర్వం-10:- రామ్మోహన్ రావు తుమ్మూరి
November 21, 2020 • T. VEDANTA SURY • Memories


1974 నుండి 1985 లో మిల్లు మూతపడే దాకా ఏడేళ్లు ల్యాబ్ కెమిస్టుగా,నాలుగేళ్లు ప్లాంట్ సూపర్వైజరుగా సర్సిల్కులో పనచేయడంతో చాలా మంది మిత్రులయ్యారు.ప్రతీ డిపార్టుమెంటుతో సహసంబంధా లుండటంతో వారితో కలిసి పనిచేసినప్పుడు వారి వారి ఆచారాలు,అభిరుచులు,అంతరంగాలు
తెలిసికొనే అవకాశం దొరికింది.నిజం చెప్పాలంటే నాకు చాలామంది మిత్రులు గురు స్థానంలో నిలుస్తారు.అందులో పెద్దవాళ్లు సరే కొందరు నాకన్నా చిన్న వాళ్లు కూడా కావచ్చు. 74 నుండి 78 దాకా బ్యాచిలర్ హాస్టల్ సెల్ఫ్ కుకింగ్ చేసుకునే వాణ్ని.సర్సిల్క్ బ్యాచిలర్ హాస్టల్ సర్ సిల్క్ కాలనీకి ఉత్తర దిశలో చివరలో ఉండేది.T ఆకారంలో ఉండే రెండతస్తుల హాస్టల్ పై భాగంలో వెనుక వైపు నా రూము.రూం అలాట్ చేసే జోషీ అనే అతను నాకు సింగిల్ రూం అలాట్ చేయడంతో నా రూములో ఒకవైపు కిరోసిన్ స్టవ్ మిగతా వంట సామానులు సర్దుకొని బ్యాచిలర్ పర్వం ప్రారంభించాను.కింద మెస్ ఉండేది.హాస్ట్లర్స్ కొందరు అందులో తినేవారు.నేను అందులో తింటే నా జీతం లో మిగుల్చుకోవటం కష్టం అవుతుందని నేను స్వయం పాకం చేసుకునేవాణ్ని.మొదటి మూడు నెలలు ట్రెయినింగ్ పీరియడ్లో 6రూపాయలు హాస్టల్ రెంట్ పోగా రూ.144/- వచ్చేవి అందులో రూ.75/- ఇంటికి M.O.చేసి 
మిగతా డబ్బులతో సర్దుకునే వాణ్ని. మూడు నెలల తరువాత ప్రొబేషన్ పీరియడ్ ఆరునెలలు రూ.175/-అ తరువాత జాబ్ కన్ఫర్మేషన్ అయ్యింది. రూ.210/- బేసిక్ తో స్కేల్ మొదలైంది.
జీతం నా అవసరాల మట్టుకు ఉంచుకుని మిగతావి ఇంటికి పంపడం.మధ్య మధ్యలో ఇంటికి వెళ్లి రావడం చేస్తుండే వాణ్ని.ఒక ఏడాది తరువాత మూడో తమ్ముడు టెన్త్ పాసయితే నా దగ్గరికి తెచ్చుకొని నా తో పాటే బ్యాచిలర్ హాస్టల్ రూములో పెట్టుదును ఇంటర్మీడియేట్ లో చేర్పించాను.అలా ఉన్న సమయంలో సర్కిల్ ఇన్స్పెక్టరుగా రిటైరైన ఓ పెద్ద మనిషి ఖాళీగా ఉండలేక మా కంపెనీలో అసిస్టెంటు సెక్యూరిటీ ఆఫీసరుగా వచ్చారు.ఆయనకు హాస్టల్ లో ఓ రూము ఎలాట్ చేశారు.అందులో ఉంటూ మెస్ లో తినేవారు.కొన్ని రోజులకే ఆయనకు నా స్వయంపాకం సంగతి తెలిసింది.నేనూ మీతో కలుస్తాను అన్నారు.సరే అన్నాను.
పక్కనే ఉన్న వేరే రూములోకి మారి కంబైన్డ్ కుకింగ్ చేసుకున్నాము.ఆయన వంటల్లో ఆరితేరిన వారు.కొంత కాలం ఆయనతో సరదాగా గడిచింది.ఆయన కు ముచ్చట్లు చెప్పటం సరదా.నాకు వినడం సరదా.ఆయన పోలీసు జీవితంలో ఎదురైన అనేక విషయాల ను, పూసగుచ్చినట్లుగా,కనులకు కట్టినట్లుగా చెప్పేవారు.అలా మౌఖిక కథలు ఎన్ని విన్నానో.వాటిని ధారణకు నిలుపుకోవాలన్న ఆలోచన అప్పుడు కలిగి ఉంటే ఈ సరికి ఓ అయిదారు కథా సంపుటాలు వెలువడేవి మిత్రుడు చెప్పిన సత్రపు కథలు అని.సత్రపు అని అనటం లో ఓ ఉద్దేశం ఉంది.ఆయన చేసింది పోలీసు ఉద్యోగమే కాని చాదస్తపు బ్రామ్మడు.ఎక్కడికి వెళ్లినా ఏర్పాట్లు చేసించుకొని కమ్మగా వండుకొని తినేవారు.కనుక ఏయే ఊళ్లో ఎలాంటి వంట అనుభవాలు కలిగాయో చెప్పేవారు.కనుక ప్రతి ఊరూ ఆయనకు సత్రమే.అందులో క్రైము థ్రిల్లర్లు అన్నీ కలిసి ఉండేవి.ఆయన ఎక్కువ రోజులు పని చేయలేదు.నా పెళ్లి కావడానికి ముందే అయన రిజైన్ చేసి వెళ్లి పోయారు.చివర్లో ఆయనకు ఓ హాఫ్ టి ఆర్ టి (TRT అంటే two room tenment అని ఎకామొడేషన్ క్యాటగిరీ)
అలాట్ చేస్తే అందులో ఆయనతో పాటు నేనూ ఉన్నాను.ఆయన నేనెక్కడికి వెళితే నాతో పాటు ఆయన కూడా వచ్చేవారు.రిహార్సల్స్ కీ క్లబ్ కీ ఇద్దరం ఏక్ బూఢా ఏక్ లడ్ కా అన్నట్లు. వృద్ధాప్యంలో కూడా సరదాగా ఉండడం ఎలాగో ఆయన నుండి నాకు తెలిసి వచ్చిన విద్య.ఆయన రిజైన్ చేసి వెళ్లిన తరువాత ఒకసారి దిల్ శుక్ నగర్ దగ్గర కమలానగర్ లో ఉన్న వారింటికి వెళ్లి  వాళ్లింట్లో బొగ్గులపొయ్యిమీద వాళ్లావిడ వండిన కమ్మటి భోజనం తిని ఇద్దరం కలిసి గోల్కొండ చూడటానికి వెళ్లాం.ఆ తరువాత ఆయన వాళ్లింటికి నేను వాపస్ మా ఊరికి వచ్చాం.ఇది జరిగింది 1977లో.ఆ తరువాత ఒకటి రెండు ఉత్తరాలు రాసుకున్నాం. ఇంతలో నా జీవితంలోకి మా ఆవిడ  వచ్చింది.
అంతకు ముందు నేను ఆయనా కలిసి ఉన్న హాఫ్ టి ఆర్ టి లో నేను కంటిన్యూ అయ్యాను.ఒకసారి మాటల సందర్భంలో వారి అల్లుడు కళాకృష్ణ అనీ ఆకాశవాణిలో పని చేస్తారని చెప్పటం గుర్తున్నది.మొన్న మొన్న ఆకాశవాణిలో జరిగిన ఓ కార్యక్రమంలో అనుకోకుండా కళాకృష్ణ గారు తారసపడ్డారు.నాకు  ఆయనే గుర్తుకు వచ్చారు.చెప్పాను .ఇలా మీ మామగారు నేను కలిసి కొంత కాలం కలిసి ఉన్నాం అని.ఇంతకీ ఆ పెద్దమనిషి పేరు తులసి గంగాధర రామారావు గారు.ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అప్పుడు ఆయన అలా ఉండేవారు.(సశేషం)