ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపాధ్యాయ పర్వం-1: రామ్మోహన్ రావు తుమ్మూరి
November 12, 2020 • T. VEDANTA SURY • Memories

 నా జీవితంలో నేనూహించనిది నేను వలదనుకున్నది ఉపాధ్యాయ పర్వం.
1973 లో బి.యస్సీ పూర్తి కాగానే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది.ఇంటికి పెద్ద కొడుకుగా బాపు భారం కొంత తగ్గించాల్సిన అవసరం అది. మా తల్లితండ్రులకు మేము మొత్తం ఎనమండుగురం సంతానం ఆడా మగా కలిసి.ఒక అక్క,ఒక చెల్లె,మిగతా ఆరుగురం మగపిల్లలం.అందులో పెద్ద వాణ్ని నేను.
అప్పట్లో బాపు అభినవ కుచేలుడే.అవి బతకలేక బడిపంతుల రోజులు.నూరో నూటా యాభయ్యో జీతంతో ఇల్లు గడవాలి.ఏ చిన్న అవసరానికైనా అప్పులు చేయాలి,మళ్లీ తీర్చాలి.దాని కోసం చిట్టాలు వేయటం ఎత్తటం.ఆ పరిస్థితుల్లో నా ఉద్యోగం అవసరం కొంతగాకపోయినా కొంతైనా ఊరట నిస్తుందనేది వాస్తవం.
                     అప్పటికి బాపు ఉద్యోగం ఎలగందులలోనే చేస్తున్నారు. అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో పాత ఇల్లు పెద్దనాన్నకు పోవడంతో కిరాయ ఇంట్లో ఉండే వాళ్లం.మాకప్పటికి చింతకుంట దగ్గర కొంత భూమి ఉండేది.నేను వ్యవసాయం చేస్తానన్నాను.అప్పట్లో ఉద్యోగానికి ఉత్తర దక్షిణలు కావలసిన అవసరం చాలా ఉండేది.మనకవి ఉత్తర దక్షిణాలు కావటం ఉద్యోగం దొరకడమంటే అదో పెద్ద సమస్య.నేను టీచరుద్యోగం చేయాలని బాపుకుండేది. నాకది అస్సలిష్టం లేని ఉద్యోగం.ఏ ఆఫీసులోనో క్లర్కు గా దొరికితే చాలనుకునే వాణ్ని.ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఎందుకని రోజు పొలం వైపు వెళ్లి బర్రెకు గడ్డి కోసుకు వచ్చేవాణ్ని. ఓసారి నేను వ్యవసాయం చేస్తానని బాపుతో అంటే కోపానికి వచ్చారు.
మేడం చెడిపోయింది చాలు అని కసురుకున్నారు.అదిగో అలాంటి సమయంలో ఓ రోజు ఒక ఇన్లాండ్ లెటర్స్ వచ్చింది.తీసి చదివితే ముత్యాల వంటి అక్షరాలతో ఆ ఉత్తరం ఉత్తర దక్షిణలు అవసరంలేని ఉద్యోగం కోసం అవకాశం
మోసుకొచ్చింది.మిత్రునికి గుర్తుందో లేదో కాని నాగరాజు సురేంద్ర దస్తూరి అది.అప్పుడు వాళ్ల అన్నయ్య నాగరాజు రామస్వామిగారు కాగజ్ నగర్ లోని సర్సిల్క్ మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజనీయరుగా పని చేస్తున్నారు. ఆయన చెబితే ఈయన రాశారు.ఒక వేళ 
ఉద్యోగం చేయాలనుకుంటే రూ.150/-ఇస్తారు.అవసరమనుకుంటే అప్లికేషన్ పంపించగలవు అని.ఆయనకు వాళ్ల తండ్రి తిరుమలయ్యగారు చెప్పారని తరువాత తెలిసింది.తిరుమలయ్యగారు బాపుకు ప్రాణ స్నేహితులు.అది నా జీవితంలో అతి పెద్ద మలుపు.వెంటనే మిత్రుడు ఆకెళ్ల రామకృష్ణ శాస్త్రి సహాయంతో అప్లికేషన్ తయారు చేసి పంపాను.ఏప్రిల్ లో ఇంటర్వ్యూ పిలుపు రావడం,రామస్వామి గారి ప్రమేయంతో ఉద్యోగానికి సెలెక్టు కావడం జరిగిపోయాయి.7-7-1974 రోజున సర్సిల్కు మిల్లులో జనరల్ ల్యాబ్ కెమిస్టుగా ఉద్యోగపర్వం మొదలయ్యింది.(సశేషం)
నిరుద్యోగ రాముడు(1973)