ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపాధ్యాయ పర్వం-4: - రామ్మోహన్ రావు తుమ్మూరి
November 15, 2020 • T. VEDANTA SURY • Memories

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.కాగజ్ నగర్లో దీపావళికి అత్యంత ప్రాధాన్యత ఉండేది.దానికి ముఖ్యకారణం ఉత్తర భారతీయులు అక్కడ అధిక సంఖ్యలో ఉండటం మరియు యాజమాన్యం మార్వాడీలు కావటం.
ఇక్కడ సందర్భం వచ్చింది కనుక యాజమాన్యం గురించి చెప్పాలి.కాగజ్ నగర్ లో ముందు కాగితాల మిల్లు తరువాత బట్టల మిల్లు ఏర్పడటానికి కారణం నైజాం ప్రభుత్వమే అయినా నిర్వహణా బాధ్యతలు మాత్రం బిర్లాల చేతిలోక వెళ్లింది.అందుకే మిల్లులకు హెడ్డాఫీసు కలకత్తాలో మరియు మరో ఆఫీసు హైదరాబాదులో ఉండేది.బిర్లా కుటుంబం తరఫున రెండు మిల్లులకు వాళ్లకు సంబంధించిన వారు కాగజ్నగర్ లో ప్రెసిడెంట్ ,వైస్ ప్రెసిడెంట్ లు గా ఉండేవారు.నేను కాగజ్ నగర్ లో ప్రవేశించేనాటికి పేపరుమిల్లు ప్రెసిడెంట్ గా కే.యం.భాంతియా సర్సిల్కు మిల్లు ప్రెసిడెంట్ గా లకోటియా ఉన్నారు. ఎప్పుడైన బిర్లా వచ్చి వెళ్లే వారు.వారి కోసం అప్పట్లో హెలికాప్టర్ దిగటానికి
విమానాశ్రయం ఉండేది.
      అయితే దీపావళి పండుగ మాత్రం పేపరు మిల్లులో ఘనంగా ఏర్పాటు చేసేవారు.చాలా ఖర్చు తో దీపాలంకరణ ఏర్పాటు చేసి చూడటానికి లోపలికి అనుమతించేవారు.అక్కడ ఉన్న నలభై సంవత్సరాలలో దాదాపు ప్రతిసారీ ఆ ప్రదర్శన తిలకించిన పులకించిన అనుభవం మరపురానిది.బ్రహ్మచారిగా,దంపతులుగ,పిల్లలతో,బంధుమిత్రులతో అనేక సార్లు సందర్శించడం జరిగింది.ఆ మరుసటి రోజు ఏ మిల్లు వారు ఆమ్లాలు క్లబ్బులలో ప్రీతి మిలన్ ఏర్పాటు చేసేవారు.సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అనేక రకాల స్వీట్లతో మంచి విందు ఏర్పాట్లుండేవి.
తొలిదశకు మలిదశకు కొంత తేడా ఉన్నా ఆనవాయితీ మాత్రం యధావిధిగ కొనసాగేది.ఈ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే నేను చేరిన కొత్తలో యాజమాన్యం దృక్పథం కార్మికులు అన్ని విధాలా సంతోషంగా ఉండాలి అన్నట్టు ఉండేది.తరువాత యాజమాన్యం దృక్పథం జీతాలు ఇస్తున్నాం పనిచేయాలి అన్నట్టు మారింది.దానికి కారణాలు ఏవైనా కావచ్చు కానీ మొదట్లో కార్మికసంక్షేమం
మనస్ఫూర్తిగా ఉంటే తరువాతి కాలంలోయాంత్రిక వాణిజ్య పరంగా మారింది.ఇది కొంత యూనియన్ల ప్రభావం వల్ల కూడా కావచ్చు.ఇది విశ్లేషించాల్సిన విషయం.
      కంపెనీకి ఎవరైనా గెస్ట్ లు వస్తే వారికి కంపెనీ చూపించే ఆనవాయితీ ఉండేది.వారిని కాటన్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ దగ్గరనుండి పవర్ లూమ్స్ దాకా అన్ని డిపార్టుమెంటులకు తీసుకుని వెళ్లి
ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్లకు వివరించి చెప్పేందుకు ఒక గైడులాగా మా లేబొరేటరీనుండి ఎవరినైనా పిలిపించేవారు.అలాంటి అవకాశం నాకు చాలా సార్లు కనిపించారన మా ఇంఛార్జ్ శ్రీధరన్ గారు.ఆయన మలయాళీ.నేనంటే ఆయనకు మంచి అభిప్రాయం ఉండేది.ఆయన ఎప్పుడైనా దీర్ఘకాలిక సెలవు మీద కేరళ వెళితే ఆయన క్వార్టర్ లో నన్నుంచి వెళ్లేవారు. మా డిపార్టుమెంటులో దాదాపు 35 మంది స్టాఫ్ ఉండేవాళ్లు.వాళ్లలో ఐదారుగురు బ్యాచిలర్స్ ఉన్నా న్నుంతి పోవడం కొందరికి మింగుడు పడేది కాదని కూడా అర్థమయేది.సరే అలా ఆయన అనేక సార్లు కంపెనీ చూపించడానికి పంపించింద వల్ల ఏ డిపార్ట్మెంటులో ఏం జరుగుతుందో చెప్పగలిగేవాణ్ని.
    ఇక్కడే మరో విషయం తెలియ జేయాల్సిన అవసరం ఉంది.అది నా ఆంగ్ల భాషలో మాట్లాడే అనుభవం గురించి.దీనికి మాత్రం నేను ‘సహవాసదోషేణ గుణానుభవంతి’అన్న వాక్యాన్ని సమర్థిస్తాను.ఎందుకంటే  మా కంపెనీలో దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లుండటం వల్ల కంపెనీ కామని లాంగ్వేజ్ హిందీ.అలాగే మా డిపార్ట్మెంటులో అందరూ గ్రాడ్యుయేట్లు కనుక ఆంగ్లంలోనే సంభాషణ జరిగేది.
చేరిన కొత్తలో రెండు మూడు నెలల దాకా నోరు పెకిలేది కాదు.జవాబులన్నీ ఏక పదాలే.ఎస్ నో ఆల్ రైటన్నట్లుండేది.
ఎప్పుడైనా చేయి జారి కోనికల్ ఫ్లాస్క్ పగిలిపోతే ఏడుపు మొహంతో ఇంఛార్జ్ దగ్గరికి వెళ్లి నిలబడే వాణ్ని.ఆయన 
Yes tell me what do you want అనేవారు.నేను ఫ్లాస్క్ అనేవాణ్ని.దాని కాయన 
What happened?Have you broken the flask? అనేవారు తలూపడం మాత్రమే మన పని.
yOu know this is Corning flask. Very costly.You must be very careful I say.అనే వారు I Say ఆయన ఊతపదం.ఇంతకీ అప్పట్లో కార్నింగ్ అంటే కంపెనీ పేరు అది ఇంపోర్టెడ్ అని మాత్రమే తెలుసు.కాని తరువాతి కాలంలో నేను మా ఆవిడా అమ్మాయి దగ్గరకు వెళ్లినపుడు మమ్మల్నిద్దర్నే నయాగరా జలపాత సందర్శనకు ట్రావెల్ బస్ లో పంపితే తెలిసింది.ఆ ట్రావెల్ లో భాగంగా నయాగరా చూపించిన తరువాత కార్నింగ్ అనే చోటికి తీసుకు వెళ్లి అక్కడి గ్లాస్ ఫ్యాక్టరీ తాలూకు ప్రదర్శనశాలను చూపినప్పుడు మా ఇంఛార్జ్ గారి మాటలు గుర్తుకు వచ్చాయి.ఆయన ఎందుకు Corning అనే వాడో.అది ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లాస్ ఇండస్ట్రీ గల ప్రదేశం.
     సరే నా ఆంగ్ల భాష అవగాహన గురించి చెప్పబోతూ మధ్యలో శాఖాచంక్రమణం చేశాను.మరి ఆ ముచ్చట్లు చాలా చెప్పాలి గనుక రేపటికి వాయిదా వేసి మరోసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలతో సశేషం.
Corning glass museum U S A