ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉప్పు బండి.: --అమెరికా వెళ్ళినప్పుడు అక్కడో షాపింగ్ మాల్ లో మూడు నాలుగేళ్ళ పిల్లవాడిని భుజాల మీద కూర్చో బెట్టుకుని వాడి రెండుకాళ్ళూ తన రెండు చేతులతో పట్టుకుని కలయదిరుగుతున్న తండ్రిని చూసాను. మా కోటప్పకొండ తిరునాళ్ళలో పిల్లల్ని అలా ఎక్కించుకొని ప్రభలు చూపుతూ తిరిగే మా పల్నాటి పల్లెటూరి తండ్రులు గుర్తుకు వచ్చారు.చిన్నప్పుడు ఉప్పు ఆట ఆడని పిల్లలు ఉంటారని నేను అనుకోను.మొత్తం మా అక్కయ్యల పిల్లల్ని అందరినీ వీపుకెక్కించుకుని ఉప్పు మూటల ఆటలు ఆడించాను.మా పిల్లల్ని ఎక్కుంచుకుని ఆడించే సమయానికి ఉప్పు మూట ఇంగ్లీష్ లో ధర చెప్పేది త్రీ రూపీస్ అని.ఉప్పుమూటను ఎవరూ కొనకపోతే పిల్లలకు ఎంత ఉక్రోషమో.అలాగే ఊరికే ఇవ్వండి తీసుకుంటాం అన్నా విలువ తగ్గిపోయినట్లు ఫీల్ అయ్యేవాళ్ళు.అసలు పిల్లల్ని ఉప్పు మూటలుగా ఎక్కించుకుని ఉప్పమ్మా ! ఉప్పు అని అమ్ముతుంటే పెద్ద షావుకార్లలాగా ఫీల్ అయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. నా చిన్నప్పుడు ఉప్పు బండి ఒకటి మా ఇంటి దగ్గరికి అమ్మడానికి వచ్చేది.చెక్క చక్రాల తోపుడు బండి.షోడా బండి తోసుకుని వచ్చినట్లుగా ఉప్పు బండి తోసుకుని ఓ అతను వచ్చేవాడు.ఉప్పు,ముగ్గు కలిపి అమ్ముతుండే వాడు ఒక్కోసారి.వీధి అంతా "ఉప్పు ఉప్పమ్మా ఉప్పు"అని అరుచుకుంటూ వచ్చి.మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి "బామ్మగారి మనవరాల్ ఉప్పు " అని అరిచేవాడు.మొదట్లో కోపం వచ్చేది.తర్వాత నవ్వు వచ్చేది.అతను ఉప్పు బండితో లేకపోయినా బజారులో ఎక్కడైనా కనపడినా సరే బామ్మగారి మనవరాల్ బాగున్నావా ?అని పలకరించేవాడు.నాకు పెళ్ళయి నరసరావుపేట నుంచి కనిగిరికి వెళ్లిపోయినా మా బజారుకు , మాఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అతను అలానే చాలా ఏళ్ళ పాటు కేకేసే వాడని అమ్మ చెప్పేది.ఇప్పుడా ఉప్పు బండ్లు లేవు,పిల్లలకి ఉప్పుమూటల ఆటలూ లేవు.మీ టూత్ పేస్టులో ఉప్పుందా?అని అడగటం తప్పిస్తే.-వసుధారాణి.
July 28, 2020 • T. VEDANTA SURY • Memories