ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఊరూ - పేరూ--చెన్నై (మద్రాసు) ఈరోజు మహానగరంగా ఉండటానికి కారణం అనేక గ్రామాలు ఒక్కటవడమే. చినుకు వరదైనట్లు పలు గ్రామాలన్నీ కలిసి బ్రహ్మాండమైన నగరంగా మారింది. చెన్నైలోని కొన్ని ప్రదేశాల పేర్ల వెనుకున్న కథను తెలుసుకుందాం.... చెన్నై...---చెన్నై నగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజుల పరిపాలనలో చెన్నై ఓ ప్రధాన ప్రదేశంగా ఉంటూ వచ్చింది. విదేశాల నుంచి వచ్చే వర్తకులూ మతబోధకులూ చెన్నైకి సముద్ర మార్గంద్వారా వచ్చారు.అప్పట్లో చెన్నై పట్టణం ఓ చిరు గ్రామంగా ఉండేది. చెన్నప్ప నాయకర్ అనే ఆయన స్మృత్యర్థం కొటకు ఉత్తరంగా ఉన్న ప్రదేశాన్ని చెన్నై పట్టణం అని పిలువనారంభించారు. చెన్నైలో సెయింట్ జార్జ్ కోటను ఆంగ్లేయులు నిర్మించారు. దీనికి కొనసాగింపుగానే చెన్నై నగరం ఏర్పడింది. 1639 లో ఈ కోటను నిర్మించారు. చెన్నై నగరంతో కలిసిన తిరువల్లిక్కేణి, మైలాపూర్‌, తిరువత్తియూర్, తిరువాన్మ్యూర్ వంటివన్నీ మద్రాసుకన్నా పురాతనమైన ప్రదేశాలుగా చరిత్ర పుటలు చెబుతున్నాయి.--కోడంబాక్కం--గుర్రాలకూ వాటిని పెంచేందుకు ఉన్న ప్రాంతమే కోడంబాక్కంగా మారింది. 17, 18.శతాబ్దాలలో ఓ నవాబు అధీనంలో ఈ ప్రాంతం ఉండేది. అతనికి సొంతమైన గుర్రాల మేతకోసం ఈ ప్రాంతం నందనవనమల్లే ఉండేది. అందుకే దీనిని గార్డన్ ఆఫ్ హార్సస్ అని అనేవారు. ఉర్దూలో ఘోడా బాగ్ అని పిలిచేవారు. తర్వాతి రోజుల్లో ఇదే కోడంబాక్కంగా మారింది.--మాంబళం--మాంలాన్ అనే ఆంగ్లేయాధికారి నివసించిన ప్రాంతమే ఈరోజు మాంబళమై పిలువబడుతోంది. దీనికే మరొక పేరుకూడా ఉండేది. ఒకానొకప్పుడు ఇక్కడ ఓ భారీ శివాలయం ఉండేదని, ఆ ఆలయం ఉన్న ప్రాంతాన్ని "మా అంబళం" అని పిలువబడినట్లు మరొక కథనం ప్రచారంలో ఉండేది. ఇక్కడ బిల్వ వృక్షాలు ఎక్కువగా ఉండేవని, దాంతో మహాబిల్వం అని పిలిచేవారని, కాలక్రమేణా మాంబళంగా రూపాంతరం చెందిందని కూడా అంటారు. అంతేకాదు, జస్టిస్ పార్టీ అధినేత సర్ పిట్టి త్యాగరాయ చెట్టి పేరుతోనే ఈ ప్రాంతాన్ని త్యాగరాయనగర్ (టీ.నగర్) అని పిలువబడింది.--సైదాపేట లేదా సదయు పురం--సదయు అనే రాజు 108 శివాలయాలను నిర్మించాడు. వాటిలో నూట ఎనిమదవది సదయు పురంలో ఉండేది. అయితే పలకడానికి తేలికగా ఉందని సైదాపేట అని పిలిచేవారు. --తండయార్ పేట--పల్లవుల రాజ్యంలో ఉన్న ఆలయాలకు ఎలాంటి ప్రతిఫలాపేక్షా లేకుండా సేవలు చేస్తూ వచ్చిన వారికోసం ఇక్కడ నివాసయోగ్యమైన ఇళ్ళను కేటాయించారు.ఆ ప్రాంతాన్ని తొండయార్ పురి అని పేరు పెట్టారు. కాలక్రమేణా అది తండయార్ పేటగా మారింది.--పరంగిమలై--ఆంగ్లేయ వీరులను పరంగియర్ అని కూడా పిలిచేవారు. సెయింట్ థామస్ మౌంట్ లో పరంగి దళాలు నివసించే వారు. దాంతో పరంగిమలై అనే పేరు వచ్చింది.--పూవిరుందవల్లి-మల్లె పూల తోటలు ఎక్కువగా ఉండేవిక్కడ. సంస్కృతంలో ఈ ప్రాంతాన్ని పుష్పగవల్లి అని, తమిళంలో పూవిరుందవల్లి అని చెప్పుకునే వారు. తర్వాతి రోజుల్లో ఇదే పూందమల్లిగా మారింది.-తిరువల్లిక్కేణి--తిరువల్లిక్కేణి అనే దానిని ఇంగ్లీషులో ట్రిప్లికేన్ అంటారు. మెరీనా బీచ్ కి దాదాపు అర కిలోమీటర్ దూరంలో ఈ ప్రాంతముంది. ఈ ప్రాంతంలోని పార్థసారథి ఆలయం సుప్రసిద్ధం. ఈ ఆలయాన్ని పల్లవుల కొలంలో ఎనిమిదో శతాబ్దంలో నిర్మితమైంది.క్రికెట్టుకి పెట్టిందిపేరు. అంతర్జాతీయ క్రికెట్ పోటీలు ఇక్కడి చేపాక్ మైదానంలో జరుగుతుంటాయి. --తిరు+అల్లి+కేణి = అనే మూడు మాటలు కలిపి తిరువల్లిక్కేణి అయింది. అల్లి అనేదొక పువ్వు జాతి. ఈ పువ్వులిక్కడ ఎక్కువగా సాగు చేసేవారు.- యామిజాల జగదీశ్
June 28, 2020 • T. VEDANTA SURY • News