ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎంత బాగుణ్ను:- రామ్మోహన్ రావు తుమ్మూరి
September 16, 2020 • T. VEDANTA SURY • Poem

ఎక్కడో
ఎవరూ మెదలని చోట
కొండ వాలుపై రెల్లు గడ్డినై ఉంటే
ఎంత బాగుణ్ను

ఏ కీకారాణ్యం లోనో
ముసురుకున్న చెట్ల కొమ్మల కింద
గలగలా పారే గంగనైతే
ఎంత బావుణ్ను

ఏ నావలూ తిరుగనితోవలో
కెరటాలఉధృతి లేని నడి సంద్రాన
చిరుద్వీపాన్నైతే
ఎంత బావుణ్ను

మంచు పొగలు తప్ప
మట్టి పొగలు లేని మంచు మలలపై
మానవ పాదం సోకని
గిరిశిఖరాన్నైతే
ఎంత బావుణ్ను

ప్రణవ గీతం వినుకుంటూ
ప్రవిమల ప్రకృతి పదార్థాన్నై
పరవశిస్తూ ఉంటే
ఎంత బావుణ్ను

ఇలలో సాధ్యం కాకపోతేనేం
కలలోనైనా పొందే నిర్మల వైరాగ్యమా
నన్నావరించు ...వరించు