ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎందుకు చెప్పలేదు నాన్నా---మీ..బాలవర్ధిరాజు.మల్లారం
October 1, 2020 • T. VEDANTA SURY • Memories

నాన్నా!
నాకు
అవ్వ.. జన్మనిస్తే..
నువ్వు.. బతుకునిచ్చావు!
అవ్వ... నడక నేర్పిస్తే..
నువ్వు... నడత నేర్పించావు!
అవ్వ    నేను పడకుండ వేలందిస్తే...
నువ్వు... నేను చెడకుండ వేలు చూపించావు!

మీరు 
నా సంతోషాలకు సమిథలయ్యారు,
నా ప్రగతికి ప్రమిదలయ్యారు.
నాన్నా!
మన మల్లారం ఊరును ప్రేమించుమన్నావు
అక్కడ.. మమతానురాగాలు ఊరును అన్నావు
అనుబంధం,ఆత్మీయతలు సమకూరును అన్నావు
శాంతి సామరస్యాలు చేకూరును అన్నావు.

పుట్టిన పల్లెను మరువ వద్దన్నావు
పట్నాన్ని చూసి మురువ వద్దన్నావు
కష్టాలకు వెరువ వద్దన్నావు
కన్నీళ్ళను విడువ వద్దన్నావు
బాధలు వస్తే...  బెదర వద్దన్నావు
సమస్యలు వస్తే..చెదర వద్దన్నావు
 గెలిచే వరకు పోరాడుమన్నావు
విజయాలు వస్తే విర్రవీగకుమన్నావు
అపజయాలను పునాదులుగా చేసుకోమన్నావు
నిరాశా నిస్పృహలను సమాధి చేయుమన్నావు
ఊహల్లో బతుకవద్దన్నావు
వాస్తవంలో జీవించుమన్నావు
మనోధైర్యమే బలమన్నావు
జీవితమంటేనే సుఖదుఃఖాల నిలయమన్నావు
నువ్వు
 నాకు పెద్దగా ఆస్తి అంతస్తులనివ్వకపోయినా..
అంతులేని ఆత్మస్థైర్యాన్ని అందించావు
అంతగా ధనాన్నికూడగట్టకపోయినా....
మన ఊరి ప్రజల అభిమాన ధనాన్ని సంపాదించి ఇచ్చావు.
మతం కన్నా మానవత్వమే గొప్పదన్నావు
కలిమి కన్నా చెలిమి మిన్న అని అన్నావు

అంతగా ధనాన్నిఇవ్వకపోయినా..
మన ఊరి ప్రజల అభిమానధనాన్ని సంపాదించి ఇచ్చావు
అన్నీచెప్పిన నువ్వు...
అవ్వ,నువ్వు లేకపోతే.. 
నేనెలా బతకాలో
ఎందుకు చెప్పలేదు నాన్నా?
ఎవరున్నా, ఎందరున్నా
మీరు లేని లోటు ఎవ్వరూ  తీర్చలేనిది
ఆవ్యథను నా చిన్నిగుండె  ఓర్చుకో(లే)నిది

అవ్వను.. నా బిడ్డలో..
నిన్ను... తమ్మునిలో చూసుకుంటూ....
జీవచ్చవంలా బతుకునీడుస్తున్నాను నాన్నా! 
నాన్నా!

(  తొమ్మిదేళ్ళ క్రితం మాకు భౌతికంగా దూరమైన మా నాన్న జంగం  చిన్న ముత్తయ్య గారిని  అక్షరాలతో పలకరిస్తూ.... పులకరిస్తూ.... మా నాన్న యాదిలో....)