ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎం. ఇ. ఓ గా పనిచేస్తున్న కాలంలో సీతా నగరం మండలం పరిధిలో గల టీచర్స్ కు 12 రోజులు విద్యారంగంలో శిక్షణ ఇచ్చేందుకు నన్ను కోర్సు డైరక్టర్ గా నియమించారు. మండలంలో నున్న టీచర్స్ ను నాలుగు గ్రూపులుగా విభజించి, ఒక్కొక్క గ్రూప్ కు మూడు రోజులు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీ ఒక్కరూ తొమ్మిది గంటలయ్యేసరికి శిక్షణా శిబిరానికి హాజరవ్వాలి. అలా హాజరు కాలేని పక్షంలో ఎక్సప్లనేషన్ వ్రాతపూర్వకంగా ఇవ్వాలని ముందుగానే తెలియజెప్పడం జరిగింది. ఆ కారణంగా ముందుగానే అందరూ వచ్చేవారు. శిక్షణా తరగతులు చాలా క్రమపద్ధతిలో నిర్వహింప బడేవి. అదే కాలంలో బాలసాహిత్యంలో బాగా అనుభవం ఉన్న ప్రముఖ బాలసాహితీవేత్తలు ---ప్రస్తుత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బెలగాం. భీమేశ్వరావుగారు, మరో ప్రముఖ బాలసాహిత్య వేత్త బెహరాఉమామహేశ్వరరావు గార్లనూ పార్వతీపురం మండలం నుండి సీతా నగరం శిక్షణా శిబిరానికి రిసోర్స్ పెర్సన్స్ గా జిల్లా విద్యాశాఖాధికారివారు నియమించారు. అప్పటికి ఆ ఇద్దరు బాలసాహిత్య రచయితలని కూడా తెలియదు. వారు శిక్షణా శిబిరానికి వచ్చి బాలసాహిత్యం దాని విలువలు, పిల్లలకు బాల సాహిత్యం వలన కలిగే లాభాలు గురించి శిక్షణా తరగతులలో ఉపాధ్యాయులకు తెలియజేశారు. నేను 1967నుండీ నేను ఆంగ్ల భాషలోనూ, ,తెలుగులోనూ వ్యాసాలు ఇండియన్ ఎక్స్ప్రెస్, దక్కన్ క్రానికల్ ఆంధ్రపత్రిక ,ఆంధ్రభూమి, ఆంధ్ర జ్యోతి, జయశ్రీ పత్రికలలోనూ మరికొన్నింటిలో సంపాదకీయం పేజీల్లో పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాసేవాడిని. యద్దనపూడి సులౌచనారాణి, కే. రామలక్ష్మి, పసుపులేటి. రామారావు, గురజాడ, కృష్ణశాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) ఆరుద్ర, దాశరథి, చలం, శ్రీ శ్రీ , సి నా రె, కృష్ణశాస్త్రి, విశ్వనాథ మొదలగు వారి రచనలు చదివాను. గానీ ఇది బాల సాహిత్యం, అది ప్రౌఢ సాహిత్యం అనే తారతమ్యం నాకు తెలిసేదికాదు. తెలియక పోయినా నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆరుద్ర గారి మాత్రా చందస్సుతో గేయాలు వ్రాసేవాడను. ' 1969 మార్చిలో బొబ్బిలి రాజా కళాశాలలో నా డిగ్రీ పూర్తయింది. అయినా నా కళాశాల మీద, అధ్యాపకుల మీద ఉన్న గౌరవం, ప్రే‌మాభిమానాలతో ఆ మరుచటి సంవత్సరం అంటే 1970 మార్చిలో జరపబోతున్న కళాశాల వార్షికోత్సవ సందర్భంగా ' నా కళాశాల ' అన్న శీర్షికతో ఆరుద్ర రచనల ద్వారా నేర్చుకున్న మాత్రా చందస్సుతో 16 గేయాలు వ్రాసాను. వాటిని చూసిన ఆనాటి మా కాలేజీ ప్రిన్సిపాల్ జి. సుబ్బారెడ్డిగారు తెగ సంతోషించారు. 1970 సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా నన్ను ఆ కళాశాల వార్షికోత్సవానికి రమ్మనమని ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి గారు నాకు ఆహ్వాన పత్రం పంపారు. ఆనాటి తెలుగు లెక్చరర్ రఘువర్మగారు మరికొంత మందితో కలసి నా కవితకు ట్యూనింగ్ కట్టి వార్షికోత్సవం సందర్భంగా పాడించారు. చాలామంది చప్పట్లు కొట్టారు. నా ప్రక్కనే కూర్చున్న ఒక పెద్దాయన ఎవరు ఆ పాటను వ్రాసారన్నారు. నేనే వ్రాసానన్నాను. ఆ పెద్దాయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చాలా సంతోషం, ఆనందం అనిపించింది. నేను వ్రాసిన ఈ కవితకు అలాంటి స్పందని వస్తుందని నేను ఊహించలేదు. దానికి నేను వ్రాసిన వ్రాత గొప్పతనం కాదు. నా కవితకు సమకూర్చిన సంగీతం అవ్వొచ్చు అనుకున్నాను. అన్నింటికన్నా మించి నాపై అభిమానాన్ని కురిపించిన ఆనాటి ప్రిన్సిపాల్ సుబ్బిరెడ్డిగారికి, మిగిలిన నా అధ్యాప కులకు ఈ నాటికీ హృదయ పూర్వక అభినంద నలు. ఇంకా అత్యంత సంతోష కరమైన విషయం చెప్పాలంటే ప్రిన్సిపాల్ సుబ్బిరెడ్డిగారు అత్యంత విలువైన మాటలతో తన లెటర్ హెడ్ పై ఒక సర్టిఫికేట్ వ్రాసిచ్చారు. అందులో కొన్నివాక్యములు ".........through-out this period of contact,he impressed me as an intelligent and earnest student, taking keen interest in both curricular and intracurricular activities. He has a flair for writing poems inTelugu and his verses are highly readable and are pregnant with meaning. I wish him all success in life. " అది నా జీవితంలో మరపురానిది. ఆ ప్రోత్సాహంతో అప్పుడప్పుడు నేను, గేయాలు,కవితలు,వ్యాసాలు వ్రాసేవాడను. ఇవి గేయాలు, కవితలు అనే విభజన చేసి చూసే వాడనుకాదు. దానికి కొన్ని కారణాలు - కథను కథగా చదవడమే గానీ, అది బాలసాహిత్యానికి సంబంధించినదా? ప్రౌఢసాహిత్యానికి సంబంధిం చినదా? అనే ఆలోచనే నాకు వచ్చేదికాదు. నేను ఎనిమిది, తొమ్మిది తరగతులు చదువుతున్న ప్పుడు మా స్కూలులో గంటి. సూర్యనారాయణ గారు హెడ్మాష్టర్ గా ఉండేవారు. పాఠశాలో ప్రతీ సంవత్సరం జరిపే వార్షికోత్సవాలకు రక రకాలైన కర్క్యులర్, కో-కర్క్యులర్ ఏక్టీవిటీస్ లలో పోటీలుపెట్టేవారు. "చందమామ" కథల పుస్తకాలను తెచ్చి అందులో ఏదో ఒక చిన్న కథను ఎంపిక చేసి పోటీలో పాల్గొన్నవారికి పదినిమిషాలుచదవమని ఇచ్చేవారు. అలా చదివిన కథలను పోటీదారులు చూడకుండా తమకు కేటాయించిన టైంలో వ్రాయాలి. అలా ఎవరు బాగా వ్రాస్తారో వారికి బహుమతులు ఇచ్చేవారు. అంతే కాదు "మోరల్ ఇనస్ట్రక్షన్స్" పీరియడ్ లో కథలనుచదివించేవారు. ఎన్నికథలు, గేయాలు, చదివినా బాలసాహిత్యా నికి సంబంధించినవి ఫలానా ఫలానా రచనలని ఏనాడు ఆలోచన చేయలేదు. బాలసాహిత్యం పై ఉపాధ్యాయ శిక్షణా శిబిరం లో చర్చ రావడం దానిపై దృష్టి సారించడం జరిగింది. తరువాత కాలంలో బాలసాహిత్యానికి సంబంధించిన అనేకమంది రచయితలు వ్రాసిన అనేక గ్రంథాలు చదివాను. వారి జీవితచరిత్రలనూ చదివాను.( సశేషం) -శివ్వాం.ప్రభాకరం, బొబ్బిలి ఫోన్ : 701 3660 252.
July 1, 2020 • T. VEDANTA SURY • Memories