ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎరుక: - డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
October 14, 2020 • T. VEDANTA SURY • Story

ఉదయం పదకొండు గంటలు, చలికాలపు ఎండ సేదతీరు స్తుంది. కళాశాల ఆవరణలోని పచ్చదనం పక్షులకు ఊరటనిస్తుంది. కూరగాయల తోట మీదుగా వచ్చే గాలి ఆరోగ్యం. ‘‘గాఊఁకా హవా, దేహాత్ కా దవా’’ నిజమేననిపిస్తుంది. మా గుంపులో నుండి వచ్చే సరదా కబుర్లు వాతావరణానికి శబ్దాన్ని అద్దాయి. అలా నడుస్తున్న మా వాళ్ళలో ఒకతను అకస్మాత్తుగా ‘‘ఊసరవెల్లి’’ అని అరిచిండు. అందరం ఊసరవెల్లి చుట్టూ మూగినం. అందరం యాభై నిండిన వాళ్ళమే.
‘‘ఆకుపచ్చగా ఉంది’’ ఒక మాట
‘‘ఇది రంగు మారుస్తది’’ కట్టెపుల్లతో కొట్టారొకరు
‘‘రంగు మారుస్త లేదు కదా’’ మరొకరు కాలుతో తన్నారు.
‘‘భలే ఉందే’’ ఒకరు సెల్ ఫోన్‌లో ఫోటో తీసుకున్నరు.
‘‘ఎంత భయపెట్టినా రంగు మార్చుకుంట లేదు’’ మరొకరి అనుమానం
‘‘దాని తోక పట్టుకున్నా ఏమనది’’ ఒకరు తోకపట్టుకున్నారు.
‘‘ఆ! రంగు మార్చింది’’ మరొకరి సంతోషం
‘‘దాన్నెందుకు కొడుతరు. ఎందుకు సతాయిస్తరు’’ ఇంకొకరి మాట
‘‘దీన్ని మన విద్యార్థులకు చూపుదాం’’ ఒకరి సలహా
అందర్ని చూస్తూ మెల్లెగా రాజులాగా నడుస్తూ పోతున్న ఊసరవెల్లి తోకను చిన్న తాడుతో కట్టి. అక్కడే ఉన్న చెట్టు కొమ్మకు తగలించాం. టీ తాగి వచ్చేటపడు తీసుకెళ్దాం. అనుకుంటూ వెళ్ళాం. కాస్త దూరంలో ఉన్న టీ దుకాణంకు పోయి కబుర్లతో పాటు టీ తాగి ఊసరవెల్లి వద్దకు వచ్చాం. అక్కడ ఊసరవెల్లి లేదు. కట్లు ఊడదీసుకొని పోయినట్లుంది. అనుకున్నాం. చిన్న ప్రాణికి సైతం తనను తాను రక్షించుకునే శక్తి, ఎరుక ఉంటాయన్న బుంగి మాటలు నా మెదట్లో గింగురుమన్నాయి. ప్రకృతి సృజనలో ఎంత దయ, ప్రేమ ఇమిడి ఉంటాయో అనిపించి. మనిషిలాగే ప్రవర్తించిన ప్రాణి నాలో అనేక ఆలోచనలకు జీవం పోసింది.
ఎన్నగల జీవరాసుల
యన్నిటి గర్భమున బుట్టి యటమనుజుండై
తన్నెరిగి బ్రతుకవలెరా
కొన్నాళ్ళకు నెచటనున్న గువ్వలచెన్నా
గువ్వలచెన్న శతకం
గువ్వల చెన్న